గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ : పవన్ అలెర్ట్ కావాల్సిందేనా ?
అధినేతను కలుసుకోవాలని తమ సాధక బాధకాలు చెప్పుకోవాలని చాలా మంది జనసేన నేతలు భావిస్తున్నారని అంటున్నారు.;
పవన్ కళ్యాణ్ రాజకీయంగా గెలిచారు. 2014లో పార్టీ పెట్టి పోటీ చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆయన 2019 నాటికి జనసేన బలం ఎంతో స్వయంగా తాను చూశారు. ఇక 2024 నాటికి స్ట్రాటజీ మార్చి పొత్తుల ఎత్తులతో కూటమిని కట్టి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. ఆయనకు అయిదు ప్రధానమైన మంత్రిత్వ శాఖలు కూడా దక్కాయి. ఆయన కూడా తన శాఖల పనితీరులో రాటుతేలుతున్నారు. అవగాహన పెంచుకుంటున్నారు. ఇదంతా ఒకే కానీ పార్టీకి సంబంధించిన దాని మీద ఆయన ఏమి చేస్తున్నారు అన్నది చర్చగా ఉంది.
ఆశలతో ఎంతో మంది :
జనసేన మీద ఆశలతో ఎంతో ఆ పార్టీలో చేరారు. ఒక బలమైన సామాజిక వర్గం అయితే జనసేనతో అల్లుకుని పోయింది వారంతా పవన్ ని తమ ఆరాధ్య నేతగా భావిస్తూ పార్టీ కోసం పనిచేశారు. అయితే ఇపుడు వారిలో నిరాశ కనిపిస్తోంది అని అంటున్నారు. నామినేటెడ్ పదవులు అయినా దక్కుతాయని అనుకుంటే అవి కూడా అరకొరగా కొందరికీ లభించాయి. అదే విధంగా తమకు నియోజకవర్గాలలో అధికార పార్టీ నేతలుగా ప్రాముఖ్యత దక్కుతోందా అంటే అది కూడా పెద్దగా ఉండడం లేదని వాపోతున్నారు. దాంతో అనేక మంది అయితే పార్టీ నడుస్తున్న తీరు పట్ల కొంత బాధగా నిర్వేదంగా ఉన్నారని చెబుతున్నారు.
కలుసుకోవాలని ఉన్నా :
అధినేతను కలుసుకోవాలని తమ సాధక బాధకాలు చెప్పుకోవాలని చాలా మంది జనసేన నేతలు భావిస్తున్నారని అంటున్నారు. అయితే వారి విషయంలో అధినేత పెద్దగా స్పందించడం లేదని ఆయనను కలిసేందుకే వీలు కల్పించడం లేదని కూడా వారు మనో వేదన చెందుతున్నారు. తమ పార్టీ అధినేతతో తాము సమస్యలను చెప్పుకోకపోతే ఇక పార్టీలో ఉండి ఏమి లాభమని కూడా కొత్త ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు. వీరిలో కొందరు నేతలు అయితే ఇతర పార్టీలలో అవకాశాలను కూడా చూసుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది. ఈ మధ్యనే తాడేపల్లిలోని జగన్ సమక్షంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కీలక నేతతో పాటు కొందరు వైసీపీలో చేరిన సంగతిని గుర్తు చేస్తున్నారు.
ఇది ప్రధాన అంశంగా :
ఇక కాపు కార్పొరేషన్ కి నిధులు విడుదల చేయకపోవడం మీద కూడా జనసేనలో నేతలు గుర్రు మీద ఉన్నారు తమ పార్టీ అధికారంలోకి వస్తే కాపు కార్పోరేషన్ కి దండీగా నిధులు వస్తాయని తమ సామాజిక వర్గం యువతకు ఆపన్నులకు అది ఎంతో మేలు చేస్తుందని భావించిన వారు ఏణ్ణర్థం గడచినా కూడా నిధులు విడుదల చేయకపోవడం మీద ఆగ్రహమే వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పవన్ కలుగచేసుకోవాల్సి ఉందని అని వారు అంటున్నారు. ఇది ఇపుడు తీవ్రమైన ఇష్యూగా మారిపోతోంది. సోషల్ మీడియా వేదికగా కూడా అనేక మంది పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. కూటమిలో తమకు న్యాయం జరిగిందా లేదా అని కూడా ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారని అంటున్నారు.
అదే ముదిరితే ఇబ్బందే :
ఏ రాజకీయ పార్టీలో అయినా ముందుగా వచ్చేది అసంతృప్తి అది కాస్తా నెమ్మదిగా పెరిగి అసమ్మతిగా మారుతుంది. ఆ మీదట సెగలూ పొగలూ కక్కితే దానిని అదుపు చేయడం కష్టం. అందుకే ముందుగానే జాగ్రత్త పడాలని అంటున్నారు. జనసేన నేతలలో ఇంకా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేకమైన అభిమానం ఉందని చెబుతున్నారు. దాంతో అధినాయకత్వం అలెర్ట్ అయి సమస్యల మీద సమావేశాలు నిర్వహించి అందరినీ దగ్గరకు చేర్చుకుంటే తిరుగు ఉండదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.