రిస్క్ సీటులో అంబటి ....రాజకీయ సంక్రాంతి కోసమేనా ?
ఇక అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనలో గుంటూరు పశ్చిమ 2009లో ఏర్పాటు అయింది. తొలి సారి అక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు.;
వైసీపీలో నోరున్న పేరున్న నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయన వాగ్దాటి ముందు ఎవరూ ఆగలేరు. ఆయన అలాంటి వాదనా పటిమని చూపిస్తారు. మీడియా ముందుకు వచ్చారంటే గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా మాట్లాడుతారు. అంబటిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ వాదిగానే రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్సార్ ని ఆరాధించారు, ఆయన వారసుడు జగన్ తో కలసి ప్రయాణం చేస్తున్నారు. తన మొత్తం మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో అంబటి గెలిచింది రెండే రెండు సార్లు. ఆయన మంత్రి కూడా 2022 నుంచి 2024 మధ్యలో అయిపోయారు. కీలకమైన జలవనరుల శాఖను కూడా నిర్వహించారు. ఇదిలా ఉంటే అంబటి సత్తెనపల్లి నుంచి మూడు సార్లు పోటీ చేస్తే ఒకసారి గెలిచారు. దాంతో జగన్ ఆయనను గుంటూరు పశ్చిమకు మార్చారు.
అక్కడ నుంచే పోటీ :
దాంతో ఆయన 2029 ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీకి సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇస్తున్నారు. అంబటి 2024లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు, 2025 లో మాత్రం ఎక్కడా నిర్వహించలేదు, కానీ ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించారు. చాలా అట్టహాసంగా డ్యాన్సులు చేస్తూ మరీ సందడి చేశారు. ప్రత్యేకంగా రాయించుకున్న పార్టీ పాటలో ఆయన నర్తించిన తీరు ఆయన ఈ ఏజ్ లో వేసిన స్టెప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక మీదట గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోనే తన సంక్రాంతి సంబరాలను ఏటేటా నిర్వహిస్తాను అని చెప్పడం ద్వారా అంబటి వచ్చే ఎన్నికల్లో పోటీకి తయారు అని చెప్పేశారు.
వైసీపీకి కలసి రాని వైనం :
ఇక అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనలో గుంటూరు పశ్చిమ 2009లో ఏర్పాటు అయింది. తొలి సారి అక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు. కానీ 2014 నుంచి మాత్రం వరసగా టీడీపీ గెలుస్తూ వస్తోంది. 2015లో మోదుగుల వేణు గోపాల రెడ్డి టీడీపీ నుంచి గెలిచారు. 2019లో టీడీపీ నుంచి మద్దాలి గిరిధర రావు గెలిచారు, 2024లో మళ్లీ టీడీపీ ముంచే గల్లా మాధవి గెలిచారు. విశేషం ఏంటి అంటే ఈ నియోజకవర్గం ఏర్పాటు అయ్యాక రెండు సార్లు కాపులు గెలిచారు. ఇక్కడ కాపుల సంఖ్య అధికం. బహుశా ఆ ఉద్దేశ్యంతోనే వైసీపీ అధినాయకత్వం అదే సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబుని ఈ నియోజకవర్గానికి ఇంచార్జిగా చేశారు అని అంటున్నారు. తాజగా 2024 లో గెలిచిన మాధవి కూడా కాపు సామాజిక వర్గం వారు కావడం విశేషం.
వైసీపీ వేవ్ లో కూడా :
అయితే వైసీపీకి భారీ వేవ్ అన్నది 2019లో వచ్చింది. ఆ సమయంలో కూడా టీడీపీ ఇక్కడ నుంచి గెలిచింది అంటే అది టీడీపీకి కంచుకోట అని అర్ధం అవుతోంది. అలాంటి చోట అంబటి రాంబాబుని పంపించారు అంటే రిస్క్ సీటులో ఫైట్ చేయమనే అర్ధం అని అంటున్నారు. అయితే టీడీపీలో వర్గ పోరు ఉంది, ఎమ్మెల్యే మాధవికి మేయర్ కి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. అదే విధంగా నియోజకవర్గంలో పార్టీ కూడా అలాగే చీలిపోయింది. దాంతో పాటుగా అంబటి రాంబాబు నియోజకవర్గంలో మొదటి నుంచి ఉంటూ అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక వర్గం ప్రభావం అంబటి రాజకీయ వ్యూహాలు పనిచేస్తే వైసీపీ ఇక్కడ నుంచి గెలుస్తుంది అని పార్టీ వర్గాలు అంటున్నారు. 2029లో తానే గెలిచి తీరుతాను అని అంబటి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వీటి సంగతి పక్కన పెడితే మరో మూడు సంక్రాంతులు డ్యాన్సులు అన్నట్లుగా అంబటి గుంటూరు వెస్ట్ పాలిటిక్స్ సాగనుందని చెబుతున్నారు.