కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పై నటి ఆరోపణలు.. అధిష్టానం కీలక నిర్ణయం

కేరళ కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పాలక్కాడ్‌ ఎమ్మెల్యే, యువజన కాంగ్రెస్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్‌ మాంకూటతిల్‌ను మహిళల పలు ఆరోపణల నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్‌ చేసింది.;

Update: 2025-08-25 08:34 GMT

కేరళ కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పాలక్కాడ్‌ ఎమ్మెల్యే, యువజన కాంగ్రెస్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్‌ మాంకూటతిల్‌ను మహిళల పలు ఆరోపణల నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్‌ చేసింది. ఈ చర్యతో కేరళ కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది.

ఎమ్మెల్యే పైనటి ఆరోపణలు

గత వారం మలయాళ నటి, మాజీ జర్నలిస్టు రిని అన్న్‌ జార్జ్‌ చేసిన సంచలన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. ఒక ప్రధాన పార్టీ యువనేత తనకు పదేపదే అసభ్యకరమైన సందేశాలు పంపించాడని, హోటల్‌కు రావాలని ఆహ్వానించాడని ఆమె ఆరోపించారు. ఆమె పేరు ప్రస్తావించకపోయినా, బీజేపీ నేతలు రాహుల్‌ మాంకూటతిల్‌నే ఆ నేత అని ఆరోపిస్తూ ఆయన కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సిపిఎం అనుబంధ యువజన విభాగం డీవైఎఫ్‌ఐ కూడా వీరంగం సృష్టించింది.

గతంలోనూ ఫిర్యాదులు

తరువాత రచయిత హనీ భాస్కరన్‌ బహిరంగంగా మాంకూటతిల్‌నే ఆరోపిస్తూ, తనకు పదేపదే మెసేజీలు పంపి, తరువాత వాటిని వక్రీకరించాడని విమర్శించారు. యువజన కాంగ్రెస్‌లో ఇదివరకే ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చాయని, అయినప్పటికీ పార్టీ చర్యలు తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. అదే సమయంలో అవంతిక అనే ట్రాన్స్‌వుమన్‌ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ, అసభ్యకరమైన సందేశాలు పంపిన విషయాన్ని బహిర్గతం చేశారు.

పదవికి రాజీనామా

వివాదం తీవ్రరూపం దాల్చడంతో, మాంకూటతిల్‌ యువజన కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, సహచర నేతలపై భారాన్ని మోపకూడదనే ఉద్దేశంతోనే తప్పుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారం మరింత సీరియస్‌ కావడానికి కారణం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్‌ సతీమణి ఆశా కె. చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌. ఆ పోస్ట్‌లో రాజకీయ నాయకుడి ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేయడం, ఆయన పేరు ప్రస్తావించకపోయినా, రాహుల్‌ మాంకూటతిల్‌పై ఆరోపణలకు బలాన్ని చేకూర్చింది.

ప్రతికూల ప్రభావం

ఈ ఘటనతో కాంగ్రెస్‌ పార్టీ ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం పడినట్టే కనిపిస్తోంది. మహిళల గౌరవం, రాజకీయ నైతికత వంటి ప్రశ్నలతో కూడిన ఈ వివాదం, రాబోయే రోజుల్లో కేరళ రాజకీయాలను మరింత కుదిపే అవకాశం ఉంది.

Tags:    

Similar News