తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తున్న కేసీఆర్?

సాధారణంగా ఒక పార్టీ అధినేత, అందులోనూ సీఎంగా ఉన్న నాయకుడి నోటి వెంట ప్రత్యర్థి పార్టీ ప్రస్తావన తక్కువ.;

Update: 2022-10-19 01:30 GMT

''కాంగ్రెస్ తో ముప్పే.. కాంగ్రెస్ గనుక అధికారంలోకి వస్తే పెద్ద దెబ్బ.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం.. అప్పుడు నేనేమీ చేయలేను.. మళ్లీ ఉద్యమాలు చేయడం తప్ప..'' ఇవేవో సాధారణ నాయకుడు చేస్తున్న ప్రకటనలు కావు. పోనీ ఏ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలో కూడా కావు. బీఆర్ఎస్ అధినేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. అందులోనూ కీలకమైన ఎన్నికల ముంగిట వరుసగా తలపెట్టిన ప్రచార సభల్లో కేసీఆర్ ఇలా మాట్లాడుతుండడం రాజకీయ వర్గాల్లో విశేషంగా చర్చనీయాంశం అవుతోంది.

పదేపదే ప్రసంగంలో

సాధారణంగా ఒక పార్టీ అధినేత, అందులోనూ సీఎంగా ఉన్న నాయకుడి నోటి వెంట ప్రత్యర్థి పార్టీ ప్రస్తావన తక్కువ. ఎన్నికల సమయంలో అయితే మరీ ఊహించలేం. కానీ, కేసీఆర్ మాత్రం వరుసగా రెండు రోజుల పాటు జరిగిన హుస్నాబాద్, సిరిసిల్ల బహిరంగ సభల్లో ''కాంగ్రెస్ గెలిస్తే'' అని అంటున్నారు. దీంతో ఆయన మాటల వెనుక మర్మం ఏమిటా? అని విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు.

పోటీ తీవ్రంగా ఉందని నిర్ణయానికొచ్చారా?

తెలంగాణలో మరొక్క 41 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ వచ్చేసింది. నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. అధికార బీఆర్ఎస్ దాదాపు రెండు నెలల కిందటే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక మిగిలింది ప్రచారమే. ఆ పార్టీ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లడమే. ఈ మేరకు బీఫాంల పంపిణీ కూడా మొదలుపెట్టారు. కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అయితే, వాటిలో చేసే ప్రసంగంలో కాంగ్రెస్ ప్రస్తావన ఉంటోంది. ఇది ఎంతైనా ఆశ్చర్యకరమే. మరో కోణంలో చూస్తే కాంగ్రెస్ నుంచి పోటీ తీవ్రంగా ఉందని కేసీఆర్ అంగీకరిస్తున్నారా? అనే సందేహమూ కలుగుతోంది.

ఓటమిని ఊహిస్తున్నారా?

కేసీఆర్ స్థాయి నాయకుడు మాట్లాడితే ప్రజలు చెవులు రిక్కించుకుని మరీ వింటారు. ఆయన ప్రసంగంలో పంచ్ లు, ప్రత్యర్థులను చెండాడే తీరు ఆకట్టుకుంటాయి. అలాంటి నాయకుడే.. ప్రధాన ప్రత్యర్థి పార్టీని ఉద్దేశిస్తూ.. ఒకవేళ వారు గెలిస్తే’’ అంటుండడం ఓటమి భయం వెంటాడుతోందా? అనే అనుమానాలకు తావిస్తోంది.

ప్రజలను ఎమోషనల్ గా సిద్ధం చేస్తూ..

తెలంగాణ ఉద్యమ నిర్మాతగా కేసీఆర్ స్థాయి చెక్కుచెదరనిది. రాష్ట్రం సిద్ధించాక తొమ్మిదేళ్లుగా ఆయన సీఎంగా ఉన్నారు. ఇప్పుడు కీలక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సవాల్ విసురుతోంది. దీంతోనే ప్రజలను ఎమోషనల్ చేస్తూ బీఆర్ఎస్ వైపునకు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందులోనూ రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన కేసీఆర్ నోటి వెంట ఇలాంటి మాటలు వస్తున్నాయంటేనే ఆశ్చర్యపోతున్నాయి. కాగా, 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇలానే టీడీపీ అధినేత, ఏపీ అప్పటి సీఎం చంద్రబాబు మళ్లీ తెలంగాణలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రజలను ఉద్వేగానికి గురిచేశారు. దానికితగినట్లుగా ఫలితం పొందారు. ఇప్పుడు కూడా ‘‘కాంగ్రెస్’’ గెలిస్తే అనే వ్యాఖ్యలు కూడా ఇదే కోవలోకి వస్తాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. అంతేకాక.. పోటీ తీవ్రంగా ఉందని పరోక్షంగా ఒప్పుకొంటున్నారని చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన పార్టీ అధినేతగా ఆయన చేస్తున్న ప్రసంగాలు.. కాంగ్రెస్ ను ఆదరించవద్దు అని ప్రజలను కోరుతున్నట్లుగా ఉన్నాయని వివరిస్తున్నారు. మరో కోణంలో చూస్తే బీఆర్ఎస్ ఓడిపోయి.. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తుందని కేసీఆర్ భావిస్తున్నారా? అనే అభిప్రాయాన్నీ వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎన్నికలకు మరో 40 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఇంకే విధంగా మాటల దాడి చేస్తారో చూడాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News