గర్బిణిపై దాడి.. పోలీసు మార్కు ట్రీట్మెంట్..
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సత్యసాయి జిల్లాలోని కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవారి పల్లెలో గొడవ జరిగింది.;
మొన్న తెనాలి.. నిన్న నెల్లూరు.. తాజాగా కదిరి.. పోలీస్ ట్రీట్మెంట్ పై స్పెషల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెనాలిలో గంజాయి విక్రయిస్తున్నారనే కారణంగా ముగ్గురిపై పోలీసులు బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఇక కొద్దిరోజుల క్రితం నెల్లూరులో గంజాయి విక్రయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీపీఎం కార్యకర్తను కొందరు హత్య చేస్తే.. పోలీసులు నగరంలోని రౌడీలతో స్పెషల్ షో నిర్వహించారు. ఈ రెండు ఘటనలు రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీయగా, మంగళవారం అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోనూ పోలీసులు కొందరు నిందితులను రోడ్డుపై నడిపించుకుని పోలీసుస్టేషన్ కు తీసుకువెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సత్యసాయి జిల్లాలోని కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవారి పల్లెలో గొడవ జరిగింది. కొందరు వ్యక్తులు కేక్ కట్ చేసి, బాణా సంచా కాల్చుతుండగా, సంధ్యారాణి అనే గర్భిణి అభ్యంతరం చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా జరిగిన గొడవలో గర్భిణి అయిన సంధ్యారాణిపై అజయ్ దేవా అనే వ్యక్తి దాడి చేసి, ఆమె కడుపుపై తన్నినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనను సీరియసుగా తీసుకున్న ప్రభుత్వం, మహిళపై దాడి చేసిన నిందితుడి తక్షణ అరెస్టుకు ఆదేశించింది.
ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు అజయ్ దేవాను అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా, బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అయితే నిందితుడు రెండు రోజులుగా పరారీలో ఉండటంతో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. రోడ్డుపై నడిపించుకుంటూ పోలీసుస్టేషన్ కు తీసుకువెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిందితుడు రోడ్డుపై కుంటు కుంటూ నడుస్తుండటం ఆ వీడియోలో కనిపిస్తోంది. దీంతో నిందితుడికి పోలీసు ట్రీట్మెంట్ తర్వాత ఇలా నడిపించారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదేవిధంగా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మసానిపల్లి రోడ్డు కూడలిలో సర్పంచ్ ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీపై పొట్టేలను బహిరంగంగా నరికి వాటి రక్తంతో అభిషేకం చేశారు. ఈ వీడియో కూడా వైరల్ గా మారడంతో పోలీసులు జంతు హింస కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులను కూడా బహిరంగంగా నడిపించుకుని పోలీసుస్టేషన్ కు అక్కడి నుంచి కోర్టుకు తరలించడం వైరల్ అవుతోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతున్న నిందితుల విషయంలో పోలీసులు ఇలా రోడ్ షోలు నిర్వహించడంపై విస్తృత చర్చ జరుగుతోంది.