'ఇది ఫైనల్ వార్నింగ్'... బంగ్లాదేశ్ లో హిందువులకు హెచ్చరిక బ్యానర్!
బంగ్లాదేశ్ లో హిందూ సమాజంపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే.;
బంగ్లాదేశ్ లో హిందూ సమాజంపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా హైదీ మరణానంతరం జరిగిన ఘటనలు బంగ్లాలో మైనారిటీల భద్రతను ప్రశ్నార్ధకం చేస్తోందని అంటున్నారు. ఇక.. దీపూ చంద్రదాస్ ని హతమార్చిన విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజా ఓ హిందూ కుటుంబం ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు.. ఓ హెచ్చరిక నోట్ ను అక్కడ ఉంచడం కలకలం రేపుతోంది.
అవును... బంగ్లాదేశ్ లో హిందూ సమాజంపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల దీప్ చంద్రదాస్ ని అత్యంత కిరాతకంగా ఘటన అనంతరం తాజాగా కొంతమంది దుండగులు.. ఓ హిందూ కుటుంబం ఇంటికి నిప్పంటించి, వారి పెంపుడు జంతువులను సైతం తగులబెట్టారు. ఇదే సమయంలో ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు. తాజాగా ఈ కొత్త సంఘటన వెలుగులోకి వచ్చింది. బంగ్లాలో హిందూ కుటుంబాల పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.
ఈ సంఘటన చటోగ్రామ్ లో చోటు చేసుకోగా.. ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో కుటుంబ సభ్యులంతా కంచెను తెంచుకుని సకాలంలో తప్పించుకోగలిగారు. అయితే.. వారి ఇంటి పెంపుడు జంతువులు మాత్రం మృతిచెందాయి. ఈ ఘటన జరిగిన ఇంటి వద్ద ఓ బ్యానర్ కనిపించింది. అది.. హిందువులు, ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. ఆ పనులు వెంటనే ఆపాలని.. ఏదైనా ఉల్లంఘన జరిగితే తీవ్ర అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించింది.
బెంగాలీలో చేతితో రాసిన ఆ బ్యానర్ లో... ఈ ప్రాంతంలోని హిందూ నివాసితులను నిశితంగా గమనిస్తున్నామని తెలియజేయడానికే ఇది అని రాసి ఉంది. “ఇస్లాం, ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మీపై ఆరోపణలు ఉన్నాయి.. మీ సమావేశాలు, కార్యకలాపాలను వెంటనే ఆపాలి.. ఈ ఆదేశాలు మీరు పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు” అని ఉంది.
ఇదే సమయంలో.. హిందూ సమాజ సభ్యులు తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే.. వారి ఇళ్లు, ఆస్తులు, వ్యాపారాలను వదిలిపెట్టబోమని.. ఈ విషయంలో మిమ్మల్ని ఎవరూ రక్షించలేరని.. ఏదైనా ప్రతిఘటన జరిగితే అది తీవ్రమైన చర్యకు దారి తీస్తుందని.. ఇది చివరి హెచ్చరిక అని బ్యానర్ లో జోడించబడింది. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంగ్లాలో హిందువులు బిక్కు బిక్కు మంటూ బ్రతకాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లున్నాయనే చర్చకు బలం చేకూర్చింది.
కాగా... మైమెన్సింగ్ జిల్లాలో దైవదూషణ ఆరోపణలపై హిందూ వ్యక్తి దుపు చంద్రదాస్ ను కొంతమంది దుండగులు కొట్టి చంపి, మృతదేహానికి నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ తాజా ఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ 16న రాత్రి దాస్ ను ఫ్యాక్టరీ సూపర్ వైజర్ బలవంతంగా రాజీనామా చేయించారని.. ఆపై ఇస్లామిక్ గుంపుకు అప్పగించారని.. వారు అతన్ని కొట్టి చంపారని కథనాలొచ్చాయి!
ఇలా బంగ్లాదేశ్ లో ఓ హిందూ వ్యక్తి దీప్ దాస్ ను హత్య చేయడంపై భారతదేశంలో నిరసనలు వెళ్లువెత్తాయి. దీనిపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.