అదిరే హామీలు సరే.. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు కేసీఆర్?
అందరి మనసు దోచుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ప్రదర్శించిన తొందర.. వేలెత్తి చూపేలా మారిందంటున్నారు.;
వరాల దేవుడిగా పేరున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకున్న పేరుకు ఏ మాత్రం తీసిపోని విధంగా తమ ఎన్నికల హామీల్ని వరుస పెట్టి ఇచ్చేశారు. ముచ్చటగా మూడోసారి.. హ్యాట్రిక్ సీఎం కావాలని తపిస్తున్న ఆయన.. గులాబీ పార్టీ చేతికి అధికార పగ్గాలు అందుకునేందుకు వీలుగా.. కీలకమైన ఎన్నికల వేళ తాము మరోసారి అధికారంలోకి వస్తే పూర్తి చేసే హామీల చిట్టాను విప్పటం తెలిసిందే.
కేసీఆర్ చెప్పిన హామీల్ని విన్నప్పుడు అంతా బాగున్నట్లే అనిపించినా.. సామాన్యుడి మనసుకు వస్తున్న సందేహాలు ఇప్పుడా పార్టీని ఇబ్బందులకు గురి చేస్తాయంటున్నారు. అందరి మనసు దోచుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ప్రదర్శించిన తొందర.. వేలెత్తి చూపేలా మారిందంటున్నారు. రూ.400 లకు గ్యాస్ బండ ఇస్తామని ఘనంగా చెప్పటం బాగానే ఉంది. మరింత కాలం ఏం చేసినట్లు?
గ్యాస్ బండ ధర చుక్కలు చూపిస్తున్న వేళ.. ఆ భారాన్ని ఇప్పటికే తగ్గించే వీలు రాష్ట్రం చేతిలో ఉన్నా.. అదేమీ చేయని కేసీఆర్ సరిగ్గా ఎన్నికల వేళ.. మీరు మళ్లీ ఓటేస్తే.. తగ్గిస్తానని చెప్పటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ బండ ధర తగ్గిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హామీ ఇచ్చిన దాన్ని కాపీ కొట్టినట్లుగా ఉన్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది.
తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిన ఐదు కీలక హామీల్లోని వాటిని గులాబీ పార్టీ కాపీ చేయటం ఏమిటి? అన్నది పెద్ద ప్రశ్న. అధికారంలో ఉండి.. చేయూతను ఇచ్చే వీలున్నా.. ఇవ్వని తీరును తప్పు పడుతున్నారు.
హైదరాబాద్ వాసులకు మరో లక్ష ఇళ్లు.. పేద కుటుంబాలకు కేసీఆర్ బీమా లాంటి పథకాల్ని ప్రకటించటం బాగున్నా.. పదేళ్లుగా అధికారంలో ఉండి చేసే వీలున్నా.. చేయని వాటిని ఈ ఎన్నికల్లో గెలిస్తే చేస్తామని హామీ ఇవ్వటం వరం కంటే కూడా శాపంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వరాల దేవుడి నుంచి ఆశించిన వరాలకు భిన్నమైన వరాలు ఇవ్వటాన్ని తప్పు పడుతున్నారు. సన్న బియ్యం హామీ సంగతే చూస్తే.. బియ్యాన్ని అందించే కార్యక్రమం కేంద్రం ఇచ్చేది. దాన్ని సన్నబియ్యం ఇస్తామని చెప్పటం వరకు బాగానే ఉన్నా.. ఇంతకు ముందే అమలు చేసి ఉంటే మరింత బాగుండేది కదా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అసరా పింఛన్ ను రూ.6006కు పెంచనున్నట్లు చెప్పిన ఆయన మాటలకు.. పక్క రాష్ట్రాల్లో ఇస్తున్న మాటేమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
అధికార పార్టీగా వరాల్ని ఇచ్చే విషయంలో ఆకర్షణీయంగా ఉండే వాటి కంటే.. ప్రజలకు నిజంగా అవసరమైన వాటిని ఇచ్చే విషయంపై ఫోకస్ చేయని తీరు కనిపిస్తుంది. హామీల జాబితాలో మహానగరంలో కల్పించాల్సిన మౌలిక వసతుల గురించి ఒక్క మాట లేదు. వర్షం పడితే చాలు స్కూళ్లకు సెలువులు ఇచ్చేసి.. ఎవరికి వారు ఇళ్లల్లో కూర్చొని ఆఫీసు పని చేయాల్సిన దుస్థితికి విరుగుడు విధానాల్ని ప్రకటించింది లేదు.
ఎంతసేపటికి ఓటుబ్యాంకును ఆకర్షించే హామీలే తప్పించి.. రాష్ట్ర ముఖచిత్రం మారేలా మాట లేకపోవటం చూసినప్పుడు.. వరాల దేవుడు వర్గాలే తప్పించి.. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చాలన్న ఆలోచన లేదా? అన్న సందేహం కలుగుకమానదు.