కేసీయార్ చేతికి చిక్కని ఆయుధం : హ్యాట్రిక్ కొట్టేది ఎలా...?
తెలంగాణా ప్రజానీకం తీర్పు అయినపుడు ఈ తులాభారంలో బీయారెస్ వైపు త్రాస్ పైకి ఎగబాకి తేలిక అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.;
హ్యాట్రిక్ కొట్టేది ఎలా. ఈ ప్రశ్న బీయారెస్ అధినాయకత్వాన్ని గట్టిగా నిలదీస్తోంది. రెండు ఎన్నికలకు పుష్కలమైన సానుభూతి సెంటిమెంట్ అన్నీ సరిపోయాయి. అందివచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వాడుకుని గడచిన తొమ్మిదిన్నరేళ్ళుగా కేసీయార్ తెలంగాణాలో రాజ్యం చేశారు. కేవలం రెండే రెండు ఎంపీలతో ఆయన తెలంగాణా తెచ్చాను అంటే జనాలు నమ్మారు.
దానికి కారణం ఆయనకు పార్లమెంట్ లో ఎంపీల బలం చూసి కాదు తెలంగాణా సెంటిమెంట్ ని ఆయన ఎప్పటికపుడు రాజేసి వారి ఆత్మగౌరవాన్ని తట్టి లేపినందుకు. అయితే 2014లో తెలంగాణా ఏర్పాటు అయ్యాక తొలి దఫాలోనే టీడీపీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిని వచ్చినట్లే తన పార్టీలో కలిపేసుకుని టీయారెస్ ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పేశారు. దాంతో ఉద్యమం సెంటిమెంట్ అన్నవి చివరి ఆప్షన్లు అయ్యాయి.
ఇక 2018 ఎన్నికలకు వచ్చేసరికే ఎన్నికల వ్యూహాల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. లక్కీగా టీడీపీ అధినేత కాంగ్రెస్ కలసి ఏర్పాటు చేసిన కూటమితో వేయి ఏనుగుల బలం కేసీయార్ కి వచ్చింది. మరోసారి ఆంధ్రా పెత్తనం అంటూ చంద్రబాబు బూచిని చూపించి మరీ ఆయన సెంటిమెంట్ ని పెంచేశారు. ఫలితంగా మరోసారి అధికారం చిక్కింది.
ఇపుడు చూస్తే భావోద్వేగం అయిన స్లోగన్ అయితే బీయారెస్ చేతిలో లేదు అనే అంటున్నారు. పాలన చూసి ఓటేయమనే ఆ పార్టీ నేతలు జనాల వద్దకు వెళ్తున్నారు. అంటే అన్ని పార్టీల మాదిరిగానే అన్న మాట. కర్ణుడికి కవచ కుండలాల మాదిరిగా బీయారెస్ కి అంటిపెట్టుకుని ఉన్న తెలంగాణా సెంటిమెంట్ పూర్తిగా కరిగిపోయిన వేళ యాంటీ ఇంకెంబెన్సీ పెరిగిపోయిన వేళ జనాలకు అంతా రాజకీయమే అని అర్ధం అయిన వేళ ఏ రాయి అయితేనేమి పళ్ళూడగొట్టుకోవడానికి అన్న వేదాంతం వంటబట్టాక గద్దెనెక్కేది ఎవరైతే ఏంటి అన్న ప్రశ్న సగటు జనం నుంచి వస్తోంది.
తెలంగాణా రాష్ట్రం తెచ్చామంటే రెండు సార్లు అధికారంలోకి బీయారెస్ కి చాన్స్ ఇచ్చారు. మరి ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ కి కూడా ఒక్క చాన్స్ ఇవ్వాలి కదా. ఇదే మాట ఇదే న్యాయం, ఇదే నీతి అన్నది సగటు తెలంగాణా ప్రజానీకం తీర్పు అయినపుడు ఈ తులాభారంలో బీయారెస్ వైపు త్రాస్ పైకి ఎగబాకి తేలిక అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.
తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో యాంటీ ఇంకెంబెన్సీ చాలానే ఉంది. దాన్ని తట్టుకుని మూడవసారి గెలవడం అంటే అధ్బుతం అనే అంటున్నారు. అలాంటి మ్యాజిక్ చేయడం ఎపుడూ కేసీయార్ వంటి రాజకీయ వ్యూహకర్తకు అలవాటే అన్న వారూ ఉన్నారు. అవతల వైపు కాంగ్రెస్ ఉంది. బీజేపీ తన స్వీయ తప్పులతో ఇప్పటికే ఇబ్బందులో ఉంది. కాంగ్రెస్ ఏ మాత్రం చాన్స్ ఇచ్చినా కేసీయార్ పులిలా మీదపడి దూకుడు చేయడం ఖాయం.
ఆయనకు ఆయుధాలు ఇచ్చేది ఈ రోజుకు చూస్తే విపక్షాలే. కాంగ్రెస్ అంటేనే మహా సముద్రం. ఐక్యత ఎండమావి అన్న మాట ఉంది. సీట్ల దగ్గరే అసలైన పంచాయతీ మొదలవుతుంది. కాబట్టి అన్నీ సర్దుకుని హస్తం పార్టీ ముందుకు సాగితేనే అపుడు అసలైన ఎన్నికల చిత్రం బయటకు వస్తుంది. అంటే నామినేషన్ల విత్ డ్రా తరువాతనే తెలంగాణాలో ఎవరు ఏమిటి అన్నది ఫుల్ క్లారిటీ వస్తుంది అన్న మాట. సో బీయారెస్ కి ఈ రోజుకు అయితే ఆయుధాలు లేవనే అంటున్నారు.