కేసీఆర్.. కేటీఆర్ నామినేషన్లకు రూ.లక్ష ఇచ్చిన ఆ గ్రామస్తులు

తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ మీద తమకున్న అభిమానం ఎంతన్న విషయాన్ని చాటుకున్నారు అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా.కె గ్రామానికి చెందిన పింఛన్ దారులు.;

Update: 2023-10-16 04:05 GMT

విన్నంతనే విచిత్రంగా అనిపించినా.. కొందరి అభిమానం.. ప్రేమ ఇలా ఉంటుంది. ఎదుటోళ్లకు అవసరమా? లేదా? అన్నది పక్కన పెట్టి.. తమకున్న ప్రేమాభిమానాన్ని ప్రదర్శించటమే ముఖ్యమనుకుంటారు.

తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ మీద తమకున్న అభిమానం ఎంతన్న విషయాన్ని చాటుకున్నారు అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా.కె గ్రామానికి చెందిన పింఛన్ దారులు. ఆదర్శ గ్రామంగా పేరున్న ఈ గ్రామానికి చెందిన వంద మంది అసరా పింఛనుదారులు.. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తమకున్న అభిమానాన్ని చాటారు.

ఎన్నికల సందర్భంగా కేసీఆర్.. కేటీఆర్ ల నామినేషన్లకు చెల్లించాల్సిన రూ.లక్ష మొత్తాన్ని ఒక్కొక్కరు రూ.వెయ్యి చొప్పున వేసుకొని.. ఆ మొత్తాన్ని తాజాగా ప్రగతి భవన్ లో కలిసి అందజేశారు. తాము తీసుకున్న నిర్ణయంతో ముఖరా.కె గ్రామం మరోసారి వార్తల్లోకి వచ్చింది. వందల ఎకరాల అసామి కేసీఆర్ కు.. ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ నామినేషన్ ఖర్చుల కోసం రూ.లక్ష వెచ్చించిన తీరు చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.

తమకు అసరా పింఛన్లతో ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని భావించారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ ను సంప్రదించగా.. ఆయన వారిని నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి తీసుకెళ్లారు. అసరా పింఛన్ దారులు తాము కలెక్టు చేసిన మొత్తాన్ని గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి చేతికి ఇవ్వగా.. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. మంత్రి కేటీఆర్ కు రూ.50వేల చొప్పున రెండు చెక్కుల్ని అందించారు. దీంతో వారికి ముఖ్యమంత్రి థ్యాంక్స్ చెప్పారు. ముఖరా.కె పింఛన్ దారుల అభిమానాన్ని తప్పు పట్టలేం.

కానీ.. ఇదే మొత్తాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ లాంటి వారికి ఇచ్చే కన్నా.. నిరుపేదలకు ఇచ్చి ఉంటే అంతో ఇంతో ఉపయోగం ఉండేది కదా? అన్న మాట కొందరి నోటి నుంచి రావొచ్చు. వారు కానీ అలా చేస్తే.. మనం ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటామా చెప్పండి?

Tags:    

Similar News