చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-04-28 04:23 GMT
KCR Makes Explosive Comments on Chandrababu

ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు హాజరు కావడంతో సభా ప్రాంగణమంతా గులాబీమయమైంది. ఈ సభలో ప్రసంగించిన గులాబీ బాస్ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వలసవాదుల విష కౌగిలిలో నలిగిపోయిన తెలంగాణను కాపాడుకోవడం కోసం 25 ఏళ్ల క్రితం ఒంటరిగా పోరాటం మొదలుబెట్టానని అన్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆనాడు సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు అసెంబ్లీలో తెలంగాణ అనే పదం నిషేధించారని, స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించారని కేసీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణ నడిబొడ్డున ఉన్న అసెంబ్లీలో తెలంగాణ అనే పదం నిషేధించారని, ఆ పదం పలకొద్దని హుకుం జారీ చేశారని వ్యాఖ్యానించారు.

అంతకుముందు, జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాం ఉగ్రదాడి మృతులకు కేసీఆర్ నివాళులర్పించారు. 1 నిమిషం పాటు మౌనం పాటించాలని సభికులకు సూచించారు. 25 ఏళ్ల క్రితం ఇదే రోజున వరంగల్ లో గులాబీ జెండా ఎగిరిందని గుర్తుచేశారు. ఆనాడు గులాబీ జెండాను ఎంతోమంది అవమానించారని, అయినా ఏనాడూ నిరాశ చెందలేదని.., నిర్విరామంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించామని చెప్పారు. జెండా దించితే నన్ను రాళ్లతో కొట్టాలని స్వయంగా చెప్పానని గుర్తుచేసుకున్నారు.

వలసవాదుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించామని, అధికారంలోకి వచ్చాక తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించామని చెప్పారు. తెలంగాణకు అసలు విలన్ కాంగ్రెస్ అని విమర్శించారు. మూడేళ్లలో కాళేశ్వరం కట్టామని, పంజాబ్‌ను తలదన్నేలా పంటలు పండించామన్నారు. దళితబంధు, రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబీమా వంటి అనేక చారిత్రాత్మక పథకాలు తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజల రూపురేఖలు మార్చుకున్నామని అన్నారు.

60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎంతో గోసపడ్డారని చెప్పారు. ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ పార్టీనే అన్నారు. తెలంగాణ సాధించుకొస్తామని బయల్దేరిన ఉద్యమకారుల్ని ఇందిరా గాంధీ ప్రభుత్వం పిట్టల్లా కాల్చేసిందని తెలిపారు. మళ్లీ అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉందని, ప్రజలంతా గమనించాలని సూచించారు.

Tags:    

Similar News