తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ నే : కేసీఆర్ సంచలన కామెంట్స్

తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీయే విలన్‌ నంబర్‌ 1 అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ గట్టిగా ఉద్ఘాటించారు.;

Update: 2025-04-27 16:55 GMT

తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీయే విలన్‌ నంబర్‌ 1 అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ గట్టిగా ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిలంతరం పనిచేసిందని ఆరోపించారు. 1956లో జవహర్‌లాల్‌ నెహ్రూ తెలంగాణను బలవంతంగా ఆంధ్రతో కలిపారని కేసీఆర్‌ గుర్తుచేశారు. 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు దాన్ని కాంగ్రెస్ క్రూరంగా అణచివేసిందని ఆయన విమర్శించారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా తెలంగాణకు మొదటి విలన్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని ఆయన ప్రకటించారు.అంతకుముందు, జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా కేసీఆర్‌ నిమిషం పాటు మౌనం పాటించారు.

"వలసవాదుల విషకౌగిలిలో నలిగిపోతున్న నా భూమికి విముక్తి కల్పించాలనే లక్ష్యంతో ఒక్కడినే బయల్దేరాను" అని కేసీఆర్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం బయల్దేరిన సమయంలో కొందరు వెటకారం చేశారని, అన్నింటినీ అధిగమించి పోరాడి తెలంగాణను సాధించానని చెప్పారు. ప్రజలు దీవించడం వల్లే గత పదేళ్లుగా తెలంగాణ ధగధగలాడేలా అభివృద్ధి చెందిందని ఆయన హైలైట్ చేశారు.

1969 తర్వాత మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి తానే మళ్లీ జీవం పోశానని, కొండా లక్ష్మణ్‌ బాపూజీ నివాసమైన జలదృశ్యం వేదికగా టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని కేసీఆర్‌ తెలిపారు. ఆనాడు ఉద్యమ జెండాను దించితే తనను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన తన నిబద్ధతను ఆయన గుర్తుచేసుకున్నారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్ని బాధలు పడ్డారో తనకు తెలుసన్నారు. ఆనాడు కాంగ్రెస్‌, తెదేపాలో ఉన్న నేతలు పదవుల కోసం పెదాలు మూసుకొని కూర్చున్నారని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో శాసనసభలో తెలంగాణ అనే పదాన్నే ఉపయోగించవద్దని రూలింగ్‌ ఇచ్చారని పేర్కొన్నారు. తెరాస ఏర్పాటు తర్వాత సాగరహారం, వంటావార్పు, సకలజనుల సమ్మె వంటి కార్యక్రమాలతో మలిదశ ఉద్యమం ఉద్ధృతమైందని అన్నారు.

"సాధించుకున్న తెలంగాణలో ప్రజలు దీవించి పదేళ్లపాటు అవకాశమిస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం. మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సాగుభూమిని గణనీయంగా పెంచాం" అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వ్యవసాయోత్పత్తి ఇప్పుడు పంజాబ్‌ను మించిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. షేర్‌షా కాలం నుంచి స్వాతంత్ర్యం వచ్చే వరకు రైతుల నుంచి పన్నులు వసూలు చేసిన వారే తప్ప, వారికి మేలు చేసిన వారెవరూ లేరని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్న నాథుడు లేడని ఆయన విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్‌ ప్రస్తావించారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు రైతుబంధు, రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబీమా పథకాలు అమలు చేశామన్నారు. భారాస హయాంలో రైతుబంధు పథకం నిరాటంకంగా అమలైందని, వానాకాలం, యాసంగి పంటలకు సకాలంలో రైతుబంధు జమచేశామని నొక్కి చెప్పారు. ఎన్నికల అజెండాలో చెప్పని మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కల్యాణలక్ష్మి, చేపల పెంపకం వంటి పథకాలు కూడా అమలు చేశామన్నారు. పెట్టుబడులు ఆకర్షించి ఉద్యోగ అవకాశాలు పెంచామని, రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్యను 3 నుంచి 33కి పెంచామని పేర్కొన్నారు.

ఎన్నో అద్భుతాలు సాధించుకున్న తెలంగాణకు ఈరోజు "ఏం బీమారి వచ్చింది" అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకులు, "దిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు" ఎన్నికల ముందు ఎన్నెన్నో అబద్ధపు హామీలు ఇచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న రూ.2 వేల పింఛన్‌ను రూ.4 వేలు చేస్తామని, భారాస ఇస్తున్న రూ.10 వేల రైతుబంధును రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని ఉదాహరణగా చెప్పారు. విద్యార్థినులకు స్కూటీలు, రూ.2 లక్షల రుణమాఫీని ఒక్క సంతకంతో రద్దు చేయడం, కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీలను ప్రస్తావించారు. పింఛన్లు ఇప్పటికీ పెరగలేదని, రుణమాఫీ పూర్తి కాలేదని, ప్రజలను ఎన్నో మాటలు చెప్పి మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఉచిత బస్సుల వల్ల మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి తెచ్చారని ఆయన విమర్శించారు. ప్రతి చెడు విషయానికి తననే (కేసీఆర్) కారణమని చెబుతున్నారని, తమను ఎవరూ నమ్మడం లేదని, అప్పు పుట్టతలేదని దివాలా మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. హామీల గురించి అడిగితే సంక్రాంతి, మార్చి అంటూ గడువులు చెబుతున్నారని ఆరోపించారు. తన కళ్లముందే తెలంగాణ ఇలా అయిపోతుంటే దుఃఖం వస్తోందన్నారు. మళ్లీ కరెంట్‌ కోతలు, మోటార్లు కాలిపోయే రోజులు వచ్చాయని, తాను మంచిగా ఇచ్చిన కరెంట్‌కు ఇవాళ ఏమయిందని ప్రశ్నించారు. భూములు ధరలు ఎందుకు తగ్గాయి? నీళ్లు ఎక్కడికి పోయాయి? వడ్లు కొనే దిక్కులేదు.. కల్లాల్లో రైతులు ఏడుస్తున్నారని, 2014కు ముందున్న పరిస్థితులు మళ్లీ వచ్చాయని భారాస అధినేత కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

"పాలన చేతకాక రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారు. 80-90శాతం పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పక్కన పెట్టారు. పేద మహిళల కోసం తీసుకువచ్చిన కేసీఆర్‌ కిట్‌ పథకం కూడా బంద్‌ చేశారు" అని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కొన్నాళ్లు సమయం ఇవ్వాలని ఇన్నాళ్లు బయటకు రాలేదని, ఇకపై బయటకి వస్తానని, అందరి తరఫున పోరాడతానని ఆయన ప్రకటించారు. ప్రజలు ఆలోచించి తెలివితో పని చేయాలని, ఎక్కడ పోగొట్టుకున్నామో మళ్లీ అక్కడే సాధించాలని సూచించారు. మాట్లాడితే భారాసపై నిందలు వేస్తున్నారని, భూములు అమ్మొచ్చు, అభివృద్ధి చేయొచ్చు కానీ, ఏది అమ్మాలో విచక్షణ ఉండాలని, ఎక్కడైనా యూనివర్సిటీ భూములు అమ్ముతారా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

ఎవరు తెచ్చినా బాగున్న పథకాన్ని కొనసాగించాలని తాను ఆనాడే చెప్పానని కేసీఆర్ అన్నారు. వైఎస్‌ఆర్‌ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని తాను రద్దు చేయలేదని, పేరు మార్చకుండా ఆ పథకాన్ని కొనసాగించానని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారని విమర్శించారు. పోలీసులకు చెబుతున్నా.. "డైరీల్లో రాసుకోండి.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎష్ ప్రభుత్వాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా..బీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. కార్యకర్తలకు బీఆర్ఎస్ లీగల్‌సెల్‌ అండగా ఉంటుంది" అని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైందని, 20-30శాతం కమీషన్లు తీసుకుంటూ సంచులు మోస్తోందని ఆరోపించారు. అసెంబ్లీకి రావాలని తనకు సవాల్‌ విసురుతున్నారని, పిల్లలు అడిగితేనే చెప్పే దిక్కులేదు, తాను కావాలా? కమీషన్ల గురించి అసెంబ్లీలో హరీశ్‌రావు ప్రశ్నిస్తే భుజాలు తడుముకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

జాతీయ అంశాలపై కూడా కేసీఆర్ స్పందిస్తూ, భాజపా వైఖరి అంతా భభ్రమానం..భజగోవిందం అని, శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు అని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లో "ఆపరేషన్‌ కగార్‌" పేరుతో గిరిజనులు, యువతను ఊచకోత కోస్తున్నారని ఆయన ఖండించారు. చర్చలకు పిలవాలని నక్సలైట్లు కోరుతున్నారని, వారి విజ్ఞప్తి మేరకు నక్సలైట్లను చర్చలకు పిలవాలని ఆయన కోరారు. బలగాలు ఉన్నాయని అందర్నీ చంపుతూ వెళ్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదని, ఆపరేషన్‌ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆపరేషన్‌ కగార్‌ ఆపాలని తీర్మానం చేసి దిల్లీకి పంపుదామని ఆయన పిలుపునిచ్చారు.

Tags:    

Similar News