బీఆర్ ఎస్ టాక్: 'గుర్తు'నైనా ఆపుతారా?
కానీ, అప్పటికే కవిత ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అంతేకాదు.. పార్టీ పేరును కూడా ఆమె ప్రకటించింది.;
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టుకున్న కవిత.. తనపార్టీని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్)గా ప్రక టించిన విషయం తెలిసిందే. తెలంగాణ మలి దశ ఉద్యమ కాలం నుంచి ప్రజల్లో బాగా పాపులర్ అయిన `టీఆర్ ఎస్` పేరును ఆమె వాడుకోవడంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో కేసీఆర్ పెట్టిన `టీఆర్ ఎస్` ఇదేనని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి ఉంటుందని పెద్ద ఎత్తున నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి టీఆర్ ఎస్ పేరును తమకే ఉంచాలని.. ఈ మేరకుఎన్నికల సంఘం లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ ఎస్ నిర్ణయించింది.
కానీ, అప్పటికే కవిత ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అంతేకాదు.. పార్టీ పేరును కూడా ఆమె ప్రకటించింది. మొత్తంగా ఈ విషయంలో బీఆర్ ఎస్ పార్టీ కళ్లు తెరిచేలోగానే.. `సినిమా` స్టార్ట్ అయిపోయింది. ఎన్నికల సంఘం కవితకు పార్టీ పేరును `టీఆర్ ఎస్`గా నిర్ధారించింది. దీనిని రద్దు చేయడం అంటే.. పెద్ద ప్రాసెస్. దీంతో బీఆర్ ఎస్ నేతలు.. ఈ టీఆర్ ఎస్(తెలంగాణ రక్షణ సేన) .. ఆ టీఆర్ ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి) కాదని ప్రజలను మెప్పించగలగాలి. ఒప్పించగలగాలి. మరి ఇది సాధ్యమేనా? అనేది ఒక ప్రశ్న. ఇక, కవిత వ్యవహారంలో అసలు `క్లైమాక్స్` జరగాల్సి ఉంది. అదే పార్టీ ఎన్నికల గుర్తు.
ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు.. కవిత తన పార్టీ గుర్తుగా `బస్సు`ను ఎంచుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోం ది. ఆమె ఇప్పటికే 6 ఆప్షన్లతో ఎన్నికల సంఘానికి గుర్తుపైనా ప్రపోజల్ పంపించారని అంటున్నారు. వీటిలో రోడ్డు రోలర్, బస్సు, బుల్‌డోజర్ వంటివి ఉన్నాయని తెలుస్తోంది. ఇవన్నీ.. దాదాపు `కారు` గుర్తును పోలి ఉంటాయి. అంటే.. బీఆర్ ఎస్ ఎన్నికల గుర్తు `కారు`మాదిరిగానే ఉండనున్నాయని తెలుస్తోంది. తద్వారా టీఆర్ ఎస్ పేరు మాదిరిగానే.. ఆ పార్టీ ఎన్నికల గుర్తును కూడా హైజాక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే జరిగితే పార్టీకి మరింత నష్టమని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలపై తక్షణమే స్పందించాలని.. బీఆర్ ఎస్ వర్గాలు కోరుతున్నాయి. కానీ, అధిష్టానం `వేచి చూసే` ధోరణిలోనే ఉండడం గమనార్హం.