అమెరికా నుంచి *కొత్త పదవి*తో దిగిన కవిత..
కవిత అమెరికా నుంచి తిరిగొచ్చిన సమయానికి బీఆర్ఎస్ రాజకీయాలు బాగా వేడెక్కాయి. ఆమె నేరుగా కొత్త పార్టీని స్థాపిస్తారనే ఊహాగానాలు వ్యాపించాయి.;
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణకు తిరిగొచ్చారు. చిన్న కుమారుడి ఉన్నత చదువుల్లో చేర్పించేదుకు గత నెలలో అమెరికా వెళ్లిన ఆమె.. ఇప్పుడు స్వదేశం చేరుకున్నారు. ఈ ఏడాది వేసవి కాలంలో పెద్ద కుమారుడి గ్రాడ్యుయేషన్ డే కోసం కవిత అమెరికా వెళ్లిన సమయంలో.. ఆమె తన తండ్రికి రాసిన లేఖ లీకైంది. పార్టీ అంతర్గత వ్యవహారాలను ప్రస్తావిస్తూ.. బీజేపీ పట్ల వైఖరిని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్న ఆ లేఖ పెద్ద సంచలనంగా మారింది. పార్టీలోని అగ్ర నాయకత్వమే దానిని లీక్ చేసిందని కవిత ఆరోపించారు. తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కొత్త పార్టీ అనుకుంటే...
కవిత అమెరికా నుంచి తిరిగొచ్చిన సమయానికి బీఆర్ఎస్ రాజకీయాలు బాగా వేడెక్కాయి. ఆమె నేరుగా కొత్త పార్టీని స్థాపిస్తారనే ఊహాగానాలు వ్యాపించాయి. ఆ తర్వాత సైతం కవిత మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే పార్టీలో ఎవరూ నోరు మెదపలేదని, అదే మరో నాయకుడికి ఇస్తే మాత్రం అందరూ ఖండించారని అన్నారు. ఇక తాను స్థాపించిన తెలంగాణ జాగృతి తరఫున ఆమె ముందుకెళ్తారని కూడా భావించారు. ఆ సంస్థ నూతన కార్యాలయం సైతం స్థాపించారు. అవేమీ లేకుండానే కవిత మళ్లీ అమెరికా వెళ్లారు.
అక్కడ ఉండగానే పదవి తొలగింపు
కవిత రెండోసారి అమెరికా పర్యటనలో ఉండగానే.. ఆమెను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (తెబొగకాసం) గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించారు. 2015 నుంచి ఆమె ఈ పదవిలో ఉన్నారు. కవిత స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నియమించారు. ఇదంతా బీఆర్ఎస్ కార్యాలయంలోనే జరగడం గమనార్హం. అందుకని తన తొలగింపు చెల్లదని కవిత వాదించారు. అయితే, కవితకు ఇప్పుడు మరో కార్మిక సంఘంలో అదే స్థాయిలో పదవి దొరికింది.
సింగరేణిలోనే మళ్లీ...
కవిత తాజాగా సింగరేణిలోని హిందూ మజ్దూర్ సంఘ్ (హెచ్ఎంఎస్) గౌరవ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇది కూడా సింగరేణిలోని కీలక సంఘమే. ఈ ఎన్నిక ఆదివారం జరిగింది. సోమవారం ఉదయం కవిత అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అంటే.. కవితకు ఒక పదవి పోతే.. మరో పదవి దక్కిందన్న మాట. మున్ముందు ఏంచేస్తారో చూడాలి.