'తెలంగాణా ప్రజా జాగృతి'.. కవిత కొత్త పార్టీ ఇదేనా?
ప్రస్తుత సమాచారం ప్రకారం.. జనవరిలో నిర్వహించిన 'జాగృతి విస్తృత స్థాయి సమావేశం'లో ఇప్పటికే దీనిపై ప్రాథమిక నిర్ణయాలు తీసుకున్నారు.;
దేశంలోనే పాపులర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అండగా కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతోందని.. సీఎం పీఠం లక్ష్యంగా అడుగులు వేయబోతున్నదని కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై మరో కొత్త శక్తి ఆవిర్భవించబోతోందా? అంటే అవుననే సమాధానాలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా సాంస్కృతిక సంస్థగా సేవలందించిన తెలంగాణ జాగృతి ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందడానికి సిద్ధమైంది.
ఎందుకు ఈ కొత్త అడుగు?
బిఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత లభించకపోవడం.. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లేకపోవడం కవితను ఈ దిశగా ఆలోచింపజేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవి ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం ద్వారా ఆమె తన రాజకీయ స్వయంప్రతిపత్తిని చాటుకోవాలని చూస్తున్నారు.
'తెలంగాణ ప్రజా జాగృతి' పేరు వెనుక ఉన్న వ్యూహం
కవిత చాలా వ్యూహాత్మకంగా పార్టీపేరును నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. పార్టీ పేరులో ‘జాగృతి’ అనే పదాన్ని కొనసాగించడం ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంటింటికీ చేరిన పేరు ఇది. కొత్తగా ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండానే ప్రజల్లోకి సులభంగా వెళ్తుందనే ఈపేరు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇక బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో జాగృతి పోషించిన పాత్ర కవితకు మహిళా ఓటర్లలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించింది.
ప్రధాన లక్ష్యాలు.. అజెండా
రాబోయే ఎన్నికల నాటికి ముఖ్యంగా 2029 లక్ష్యంగా కవిత తన పార్టీ ద్వారా కొన్ని కీలక అంశాలను ఎజెండాగా మార్చుకోబోతున్నారు. రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అణగారిన వర్గాలు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై పోరాటానికి రెడీ అవుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని కాపాడే ఏకైక పార్టీగా తనను తాను ప్రదర్శించుకోవడానికి కవిత రెడీ అయ్యారు..
పొలిటికల్ రోడ్ మ్యాప్
ప్రస్తుత సమాచారం ప్రకారం.. జనవరిలో నిర్వహించిన 'జాగృతి విస్తృత స్థాయి సమావేశం'లో ఇప్పటికే దీనిపై ప్రాథమిక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ అధికారికంగా ప్రకటించకపోయినా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి మద్దతుదారులు స్వతంత్రులుగా లేదా ఒక గ్రూపుగా పోటీ చేసే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా పార్టీ జెండా, ఎజెండాను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని కవిత భావిస్తున్నారు.
కవిత కొత్త పార్టీ కేవలం అస్తిత్వ పోరాటమా లేక తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే ప్రయత్నమా అనేది కాలమే నిర్ణయించాలి. అయితే ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తలతో చర్చలు జరుపుతున్నారనే వార్తలు చూస్తుంటే, ఆమె చాలా పక్కా ప్లాన్‌తోనే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ తో కవిత సంప్రదింపులు...
ఇటీవలే.. జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రెండు నెలల వ్యవధిలో వరుసగా సమావేశాలు జరగడం, సంక్రాంతి రోజున కూడా మంతనాలు జరిగినట్లు వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గులాబీ పార్టీ నుంచి సస్పెన్షన్, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అనంతరం కవిత రాజకీయంగా మరింత చురుకయ్యారు. జాగృతి ఆధ్వర్యంలో 50 కమిటీల ఏర్పాటు, పాలమూరు నుంచి ఖమ్మం వరకు యాత్ర, ప్రజా సమస్యలపై నేరుగా దృష్టి పెట్టడం.. ఇవన్నీ కొత్త పార్టీకి సంకేతాలుగా భావిస్తున్నారు. పార్టీ విధానాల రూపకల్పనలో ప్రశాంత్ కిషోర్ సూచనలు తీసుకుంటున్నారన్న ప్రచారం కూడా ఊపందుకుంది.
అయితే ప్రశాంత్ కిషోర్ ఇటీవల బీహార్‌లో జన్ సూరజ్‌తో ఆశించిన ఫలితం సాధించలేకపోయారు. అలాంటి ఆయన తెలంగాణలో తన వ్యూహాత్మక ప్రభావం చూపగలరా? కవిత రాజకీయ భవిష్యత్తుకు ఇది ఎంతవరకు దోహదపడుతుంది? గతంలో గులాబీ పార్టీతో కలిసి పనిచేసిన అనుభవం ఇప్పుడు కొత్త ప్రయోగానికి బలం అవుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కాలమే చెప్పాలి. కానీ కవిత–ప్రశాంత్ కిషోర్ భేటీ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.