ప్రజాభవన్ లో మంత్రుల భేటీ.. కొందరు ఈకలు పీకుతున్నారా?
లోక్ భవన్ కు.. ప్రజాభవన్ పక్కపక్కనే ఉండటం.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేని నేపథ్యంలో వీరు భేటీ కావటం ఆసక్తికరంగా మారింది.;
సమాచారాన్ని సంప్రదాయపద్దతిలో ఇవ్వటం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా.. యూట్యూబ్ చానళ్ల ఎంట్రీతో ప్రతి ఒక్కరు అనలిస్టుగా మారుతున్నారు. దీంతో వార్తల కంటే కూడా వార్తావిశేషాలే ఎక్కువగా ఉంటున్నాయి. అంతేనా.. జరిగిందేంటి? అన్నది వదిలేసి.. ఏదో జరుగుతుందన్నట్లుగా హైప్ క్రియేట్ చేయటం.. సంచలనం చుట్టూనే తిరగటం ఎక్కువైంది. ఇలాంటి వేళల్లో లాజిక్ మిస్ అవుతున్న వైనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
సోమవారం ప్రజాభవన్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో ముగ్గురు మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు కాసేపు మాట్లాడుకున్నారు. ఇక్కడే కొన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. అదేమంటే.. ఏ సందర్భంలో.. ఎందుకు మంత్రుల భేటీ జరిగిందన్నది. ఆ విషయానికి వస్తే.. జనవరి 26న, ఆగస్టు 15న గవర్నర్ అధికారిక నివాసంలో ఎట్ హోం ప్రోగ్రాం జరుగుతుందన్నది తెలిసిందే.
సోమవారం (జనవరి 26) సాయంత్రం గవర్నర్ అధికార నివాసమైన లోక్ భవన్ లో ఎట్ హోం ప్రోగ్రాం జరిగింది. దీనికి రాజకీయ.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు.. ముగ్గురు మంత్రులు (శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్)లు కలిసి ప్రజాభవన్ కు వెళ్లారు.
లోక్ భవన్ కు.. ప్రజాభవన్ పక్కపక్కనే ఉండటం.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేని నేపథ్యంలో వీరు భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. అయితే.. భేటీ అయిన వారిలో శ్రీధర్ బాబు ఉండటం చూస్తే.. ఈ అంశానికి లేని ఉద్దేశాలు అపాదించటం తప్పే అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ కు అత్యంత నమ్మకస్తుల్లో శ్రీధర్ బాబు ఒకరు. నిజానికి ఏదైనా సున్నిత అంశాల మీద సమావేశం కావాలనుకుంటే రహస్యంగా మీటింగ్ జరుగుతుందే తప్పించి.. ఇలా అందరికి తెలిసేలా అధికారికంగా జరగదు కదా?
కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా.. ప్రతి విషయంలోనూ ఏదో ఒక అంశాన్ని చూపిస్తూ.. దానికి విశ్లేషణలు చేయటం మామూలైంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో.. వ్యవహరించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి నగరానికి చేరుకోవటానికి మరో వారం వరకు పట్టే వీలున్న నేపథ్యంలో.. అప్పటివరకు చక్కదిద్దాల్సిన అంశాలను మంత్రుల టీంకు అప్పజెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ఈ భేటీ జరిగిందని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా గూడపుఠాణీ చేసే శక్తిసామర్థ్యాలు ఏ నేతకు లేవన్నది బహిరంగ రహస్యం. గడిచిన రెండేళ్లలో పాలన మీద పట్టు రాని పక్షంలో.. కొందరి మీద వదిలేసి.. రెండు వారాలకు పైనే రాష్ట్రానికి దూరంగా ఉండే సాహసం ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా చేయగలరా?