మాటకు రాజీనామా అంటే ఏం బాగుంటుంది పేర్నినాని?

తాజాగా తిరుపతి లడ్డూ నాణ్యత మీద మాట్లాడిన సందర్భంగా అరువు తెచ్చుకున్న నాలుగు మాటల్ని మాట్లాడిన పేర్నినాని తరహా తీరుతో లాభం కంటే నష్టమే ఎక్కువని చెప్పాలి.;

Update: 2026-01-27 05:30 GMT

భావోద్వేగాలతో ముడిపడిన అంశానికి సంబంధించి మాట్లాడే మాటలు కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాలన్న కనీస ఆలోచన కూడా రాలేని పరిస్థితి ఏపీ రాజకీయ నేతల్లో కనిపిస్తోంది. సంచలన అంశాలపై ఆచితూచి మాట్లాడకుండా.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే నష్టం తమ కంటే తమ పార్టీకే ఎక్కువన్న విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విషయాన్నే తీసుకుంటే.. చాలామంది వైసీపీ నేతలతో పోలిస్తే.. ఆయన చాలా మెరుగు.

విషయం ఏదైనా.. తానే భుజాన వేసుకొని మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి కౌంటర్లు ఇస్తున్నారు. 2014లో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు అదే పనిగా చంద్రబాబు సర్కారు మీద విమర్శలు గుప్పించి బాధ్యతను వైసీపీలో చాలామందే తీసుకున్నారు. వారిలో చాలామంది ఇప్పుడు పెదవి విప్పటానికి కూడా ఇష్టపడటం లేదు. అసలు వారెక్కడ ఉన్నారో అర్థం కాని పరిస్థితి.

అందుకు భిన్నంగా పేర్ని నాని.. అంబటి రాంబాబు లాంటోళ్లు కొందరు మాత్రం తరచూ వివిధ అంశాల మీద స్పందిస్తూ వైసీపీ ఉనికిని చాటుతున్నారు. అయితే.. ఇలాంటి వేళలో కాస్తంత హోంవర్కు చేసి.. తాము మాట్లాడే అంశాల మీద కాస్తంత ఫోకస్ గా మాట్లాడితే బాగుంటుంది. తాజాగా తిరుపతి లడ్డూ నాణ్యత మీద మాట్లాడిన సందర్భంగా అరువు తెచ్చుకున్న నాలుగు మాటల్ని మాట్లాడిన పేర్నినాని తరహా తీరుతో లాభం కంటే నష్టమే ఎక్కువని చెప్పాలి.

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు.. చేపల నూనె కలిపారని దుష్ప్రచారం చేశారని.. వెంటనే పవన్ కల్యాణ్ దుర్గగుడికి మెట్లు కడిగితే.. తిరుపతి అపవిత్రమైందంటూ సంప్రోక్షణ చేశారన్నారు. పాపపు మాటలు మాట్లాడిన చంద్రబాబు నాలుకపై వాతలు పెట్టాలంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ వచ్చే ఇబ్బందేమంటే.. తిరుపతి లడ్డూలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందా? లేదా? అన్నదే వస్తుందే తప్పించి.. కల్తీ సందర్భంగా చంద్రబాబు, పవన్ ఏం మాట్లాడారు? అన్నది పెద్ద విషయాలుగా ఉండవన్నది పేర్ని నానికి ఎందుకు అర్థం కాదు?

తిరుపతి లడ్డూలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న భావోద్వేగ అంశానికి సంబంధించి మాట్లాడే వేళ.. జాగ్రత్తలు మరిచి పేర్ని నాని తీరు విస్మయానికి గురి చేసేలా మారింది. ఎందుకంటే.. లడ్డూలో వాడిన నెయ్యి గురించి.. దాని కల్తీ గురించి మాట్లాడే ముందు అసలు కల్తీ అయితే జరిగిందన్న విషయం మీద ఇప్పటికే అందరిలో క్లారిటీ వచ్చేసింది. అంటే.. కల్తీ జరిగిందని తేలిన తర్వాత.. ఫలానా రీతిలో కల్తీ జరిగిందని చెప్పారు.. అలా జరగలేదని చెప్పటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా? ఫలానా రీతిలో కల్తీ జరగలేదు సరే.. కల్తీ జరిగిందా? లేదా? అన్న సూటిప్రశ్నకు పేర్ని నాని సమాధానం ఏంటి? అన్నది మొదట తేలాల్సి ఉంది కదా?

మాటకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలి.. మాటకు వెనకాల అదే మాట చెప్పటం వల్ల లాభం ఉండదు కదా? అలాంటప్పుడు జరగని విషయం మీద అదే పనిగా నస మాదిరి మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా.. తన మాటల్లో విశ్వసనీయత పాళ్లు కూడా తగ్గిపోతాయన్న విషయాన్ని పేర్ని నాని గుర్తిస్తే మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అంతలా ఆలోచిస్తారా?

Tags:    

Similar News