నిశ్శబ్దంగా స్కైస్క్రాపర్ హబ్‌గా మారుతున్న హైదరాబాద్

ఈ మార్పునకు ప్రధాన కారణం ఐటీ ఆధారిత అభివృద్ధి. గచ్చిబౌలి, కొకాపేట్ ప్రాంతాలు ఈ వర్టికల్ గ్రోత్‌కు కేంద్ర బిందువులుగా మారాయి.;

Update: 2026-01-27 06:44 GMT

భారత నగరాల రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. పెరుగుతున్న జనాభా, ఆర్థిక కార్యకలాపాలు, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు నగరాలు ఇప్పుడు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నాయి. ఒకప్పుడు భారత స్కైస్క్రాపర్ (ఆకాశ హర్మ్యాలు) సంస్కృతికి ఏకైక ప్రతీకగా నిలిచిన ముంబై ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నా, ఇప్పుడు ఇతర నగరాలు కూడా వేగంగా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో నిశ్శబ్దంగా దృఢంగా ఎదుగుతున్న నగరం హైదరాబాద్.

ఆసక్తిని రేకెత్తించిన విశాల్ భార్గవ వ్యాఖ్యలు..

ఇటీవల సోషల్ మీడియా వేదిక ‘X’లో విశ్లేషకుడు విశాల్ భర్గవా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఆయన హైదరాబాద్‌ను ‘భారతదేశ రైజింగ్ స్కైస్క్రాపర్ క్యాపిటల్’గా అభివర్ణించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం హైదరాబాద్‌లో 150 మీటర్లకు పైగా ఎత్తున్న భవనాల సంఖ్య బెంగళూర్, పుణె, కోల్‌కతా, గుర్గావ్, నోయిడాతో కలిపిన మొత్తం సంఖ్యకు సమానంగా ఉండడం. అందుబాటులో ఉన్న డేటా కూడా ఈ వాదనకు బలమిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 150 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న భవనాలు 48 ఉన్నాయి. కానీ అసలు కథ భవిష్యత్తులోనే ఉంది. 2026 నాటికి ఈ సంఖ్య 250కి పైగా చేరే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. 2030 నాటికి 250కు పైగా హై-రైజ్ ప్రాజెక్టులు ప్లానింగ్ లేదా నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ వేగం చూస్తే హైదరాబాద్ స్కైలైన్ పూర్తిగా కొత్త రూపం దాల్చబోతోంది అనడం అతిశయోక్తి కాదు.

ఐటీ హబ్ ఈ మార్పునకు కారణం..

ఈ మార్పునకు ప్రధాన కారణం ఐటీ ఆధారిత అభివృద్ధి. గచ్చిబౌలి, కొకాపేట్ ప్రాంతాలు ఈ వర్టికల్ గ్రోత్‌కు కేంద్ర బిందువులుగా మారాయి. భారీ ఐటీ క్యాంపస్‌లు, మల్టీనేషనల్ కంపెనీల కార్యాలయాలు, లగ్జరీ రెసిడెన్షియల్ టవర్స్ ఈ ప్రాంతాల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. ఒకప్పుడు హరిజాంటల్‌ (అడ్డంగా)గా విస్తరించిన నగరం, ఇప్పుడు పరిమిత భూమిని గరిష్టంగా వినియోగించుకునే దిశగా మలుపు తిరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ దక్షిణాదిలోని తన పోటీ నగరాలైన చెన్నై, బెంగళూరును కూడా వెనక్కి నెట్టింది. ఐటీ ఉద్యోగాలు, గ్లోబల్ కంపెనీల ఇన్వెస్ట్‌మెంట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అన్నీ కలిసి హైదరాబాద్‌ను హై-రైజ్ హబ్‌గా మారుస్తున్నాయి. అయితే, ముంబైతో పోలిస్తే ఇప్పటికీ దూరం ఉంది. 2026 ప్రారంభానికి ముంబైలో 150 మీటర్లకు పైగా ఎత్తున్న భవనాలు 278కి పైగా పూర్తయ్యాయి లేదా టాప్-అవుట్ దశలో ఉన్నాయి. దశాబ్దాలుగా ఏర్పడిన రియల్ ఎస్టేట్ ఎకోసిస్టమ్ ముంబైకి ఇంకా ఆధిక్యతను ఇస్తోంది.

పదేళ్లలో ముంబైని దాటడం పక్కా..!

కానీ భర్గవ సూచించినట్లుగా, హైదరాబాద్ నిర్మాణ వేగం ఇదే స్థాయిలో కొనసాగితే వచ్చే పదేళ్లలో ముంబైకి గట్టి సవాల్ విసిరే అవకాశం ఉంది. ప్రతి ఏడాది పూర్తయ్యే స్కైస్క్రాపర్ల సంఖ్య ముంబై స్థాయికి చేరవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అంతేకాదు, గ్లోబల్ ర్యాంకింగ్స్ ప్రకారం 2030 నాటికి హైదరాబాద్ సింగపూర్ లాంటి అంతర్జాతీయ నగరాలను కూడా అధిగమించే దిశగా సాగుతోంది. ఈ మార్పు ఒక్క హైదరాబాద్‌కే కాదు.. మొత్తం భారత పట్టణాభివృద్ధిలో వస్తున్న మలుపును సూచిస్తోంది. ఎత్తైన భవనాలు ఆర్థిక ఆశయాలకు చిహ్నాలుగా మారుతున్నాయి. అయితే, ఇదే సమయంలో ట్రాఫిక్, నీటి వనరులు, పర్యావరణం, పట్టణ ప్రణాళిక వంటి సవాళ్లను కూడా సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఈ సమతుల్యతను ఎంతవరకు సాధించగలుగుతుందన్నదే రాబోయే కాలంలో కీలకం. ఇప్పటికి మాత్రం ఒక విషయం స్పష్టం భారత స్కైస్క్రాపర్ మ్యాప్‌లో హైదరాబాద్ పేరు గట్టిగా వినిపిస్తోంది.

Tags:    

Similar News