ఇరాన్ అగ్రనేత కుమార్తెకు యూఎస్ షాక్

నిరసన గళాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిన ఇరాన్ మాస్టర్ మైండ్ ఫాతిమా తండ్రిదని చెబుతున్నారు.;

Update: 2026-01-27 04:51 GMT

అగ్రరాజ్యం అమెరికాకు.. ఇరాన్ కు మధ్య నడుస్తున్న ఉద్రిక్తల పర్వం గురించి తెలిసిందే. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని భావించే అగ్రరాజ్యం.. ఇరాన్ మీద పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో రెండు అడుగులు ముందుకు.. ఒక అడుగు వెనక్కు వేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్న అగ్రరాజ్యం.. తాజాగా తమ దేశానికి చెందిన అతి పెద్ద యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక ఇరాన్ సమీపానికి వెళుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ అప్రమత్తం కావటం.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ఇరాన్ అగ్రనేతల్లో ఒకరు అలీ లారిజానీ. ఆయన ఎవరంటే.. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకి సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తుంటారు. ఆయన కుమార్తె డాక్టర్ ఫాతిమా అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో పని చేస్తుంటారు. తాజాగా ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా ఎమోరీ వర్సిటీ ప్రకటించింది. ఇదే విశ్వవిద్యాలయంలోని మెడికల్ స్కూల్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఫాతిమా పని చేస్తోంది.

ఎందుకిలా? అంటే.. కొద్ది రోజుల క్రితం ఇరాన్ సుప్రీం అయతుల్లా పాలనకు వ్యతిరేకంగా ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకోవటం.. ఈ సందర్భంగా సైన్యాన్ని రంగంలోకి దించిన ఆయన కఠిన చర్యలకు ఆదేశించిన వైనం తెలిసిందే. ప్రాశ్చాత్య మీడియా లెక్కల ప్రకారం దాదాపు 30 వేల మందికి పైగా నిరసనకారులు సైన్యం కాల్పుల్లో మరణించినట్లుగా పేర్కొన్నారు.

నిరసన గళాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిన ఇరాన్ మాస్టర్ మైండ్ ఫాతిమా తండ్రిదని చెబుతున్నారు. నిరసనలపై భద్రతా దళాలు కఠినంగా వ్యవహరించటంలో కీలకపాత్ర పోషించిన అతడి తీరును గుర్తించి అమెరికా ట్రెజరీ విభాగం.. తదుపరి చర్యల్లో భాగంగా అతడి కుమార్తెపై వేటు వేయటం ద్వారా షాకిచ్చినట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News