షాకింగ్... ప్రైవేట్ వాట్సప్ చాట్ లను మెటా చదివేస్తుందా..!
అవును... యాప్ లో ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్ ఉన్నప్పటికీ.. మాతృ సంస్థ మెటా ప్రైవేట్ సందేశాలను యాక్సెస్ చేయగలదని అంతర్జాతీయ వాట్సాప్ వినియోగదారుల బృందం ఆరోపించింది.;
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కంపెనీ 'ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్' ఉన్నప్పటికీ ప్రైవేట్ కమ్యూనికేషన్ లకు 'బ్యాక్ డోర్' యాక్సెస్ ను నిర్వహిస్తుందని.. తద్వారా బిలియన్ల మంది వినియోగదారులను మోసం చేసిందని ఆరోపిస్తూ అంతర్జాతీయ వాట్సాప్ వినియోగదారుల బృందం ఉత్తర కాలిఫోర్నియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేసింది. ఈ పిటిషన్ లో వాదులు.. ఈ ఫీచర్ ను 'బూటకం' అని అభివర్ణించారు. ఈ సందర్భంగా... టెక్ దిగ్గజం నుండి నష్టపరిహారాన్ని కోరుతున్నారు!
అవును... యాప్ లో ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్ ఉన్నప్పటికీ.. మాతృ సంస్థ మెటా ప్రైవేట్ సందేశాలను యాక్సెస్ చేయగలదని అంతర్జాతీయ వాట్సాప్ వినియోగదారుల బృందం ఆరోపించింది. ఈ మేరకు యూఎస్ కోర్టులో దావా వేసింది. అయితే మెటా మాత్రం ఈ ఆరోపణలతో పూర్తిగా విభేదిస్తుంది. ఈ సందర్భంగా... ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్ యాప్ లోని సందేశాలను రక్షిస్తుందని.. పంపినవారు, గ్రహీత మాత్రమే సందేశాన్ని చదవగలరని చెబుతోంది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం... వాట్సాప్ కంపెనీ వినియోగదారుల 'ప్రైవేట్' కమ్యూనికేషన్ లన్నింటినీ నిల్వ చేస్తుందని.. విశ్లేషిస్తుందని.. వాటిని యాక్సెస్ చేయగలదని ఆరోపిస్తూ కోర్టులో దావా వేయబడింది. భారతదేశంతో పాటు బ్రెజిల్, ఆస్ట్రేలియా, మెక్సికో, దక్షిణాఫ్రికాకు చెందిన వినియోగదారులకు ఈ సందర్భంగా వాదులు ప్రాతినిధ్యం వహించారు. అంతర్గత పర్యవేక్షణ కోసం సందేశాల సారాన్ని డీక్రిప్ట్ చేసే సామర్థ్యాన్ని కంపెనీ కలిగి ఉందని కూడా దావా ఆరోపించింది.
అయితే ఈ ఆరోపణలను మెటా కంపెనీ తీవ్రంగా తప్పుపడుతుంది. ఈ సందర్భంగా స్పందించిన కంపెనీ ప్రతినిధి ఆండీ స్టోన్ స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ప్రజల వాట్సాప్ సందేశాలు ఎన్ క్రిప్ట్ చేయబడలేదని చెప్పే ఏ వాదన అయినా పూర్తిగా తప్పని.. వాట్సాప్ ను సిగ్నల్ ప్రోటోకాల్ ఉపయోగించి దశాబ్దం పాటు ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్ట్ చేశారని.. ఈ వ్యాజ్యం ఒక పనికిమాలిన కల్పిత రచన అని ఆయన తెలిపారు.
అయితే.. అంతర్జాతీయ వాట్సప్ వినియోగదారుల బృందం దాఖలు చేసిన ఈ 51 పేజీల పిటిషన్ లో.. తమ వాదనలకు, ఆరోపణలకు మద్దతు ఇచ్చే సాంకేతిక ఆధారాలు లేవని అంటున్నారు.
రియాక్ట్ అయిన ఎలాన్ మస్క్!:
ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతున్న వేళ ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ సందర్భంగా వాట్సప్ పై కలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. వాట్సప్ సురక్షితం కాదని నొక్కి చెబుతూ.. సిగ్నల్ కూడా ప్రశ్నార్థకమే అని జోడించారు. ఈ సందర్భంగా 'ఎక్స్ చాట్'ను ఉపయోగించమని వినియోగదారులను కోరారు. కాగా... వాట్సప్, ఇతర ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ లకు ప్రత్యామ్నాయంగా అంటూ గత ఏడాది నవంబర్ లో ఎలాన్ మస్క్ "ఎస్క్ ఏఐ చాట్ ఆన్ ఎక్స్"ను ప్రారంభించిన సంగతి తెలిసిందే!