మోడీ వర్సెస్ స్టాలిన్... తమిళనాడు మహిళలకు సేఫ్ కాదా..!

ఈ సందర్భంగా అన్నాడీఎంకే, బీజేపీ ల మధ్య పునరుద్ధరించబడిన పొత్తుపైనా సీఎం స్టాలిన్ దాడి చేశారు. ఇందులో భాగంగా... ఈ పొత్తును "రీ-ప్యాకేజ్డ్ ఫెయిల్యూర్ అలయన్స్" అని అభివర్ణించారు.;

Update: 2026-01-27 08:30 GMT

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి వర్సెస్ ముఖ్యమంత్రి ఇష్యూ వైరల్ అవుతోంది. ఇటీవల తమిళనాడులో మహిళలు సురక్షితంగా లేరంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో.. సీఎం స్టాలిన్ తీవ్ర రాజకీయ దాడిని ప్రారంభించారు. ఈ సందర్భంగా.. దేశంలో మహిళల భద్రత, మణిపూర్ హింసను తెరపైకి తెచ్చారు. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

అవును... త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పదునైన రాజకీయ దాడిని ప్రారంభించారు. ఈ సందర్భంగా... మహిళా భద్రత, మణిపూర్ హింస, పాలనపై కేంద్రం రికార్డును ప్రశ్నించారు. అదే సమయంలో తన ప్రభుత్వ ద్రవిడ అభివృద్ధి నమూనాను సమర్థించారు. తాజాగా తంజావూరు జిల్లాలో జరిగిన భారీ డీఎంకే మహిళా సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

మణిపూర్ ని మరిచిపోయారా?:

ఈ సందర్భంగా... తమిళనాడులో మహిళలకు భద్రత లేదంటూ ప్రధాని అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని చెబుతూ.. మణిపూర్ అంశాన్ని తెరపైకి తెచ్చారు స్టాలిన్. ఈ సందర్భంగా... హింసతో అతలాకుతలమైన ఈశాన్య రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడంలో బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం.. మణిపూర్ లో జరిగిన ఘోరాల్లో సుమారు 260 మంది మరణించారని.. 3,000 మంది గాయపడ్డారని.. లక్ష మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టారని స్టాలిన్ తెలిపారు!

'రీ-ప్యాకేజ్డ్ ఫెయిల్యూర్ అలయన్స్'!:

ఈ సందర్భంగా అన్నాడీఎంకే, బీజేపీ ల మధ్య పునరుద్ధరించబడిన పొత్తుపైనా సీఎం స్టాలిన్ దాడి చేశారు. ఇందులో భాగంగా... ఈ పొత్తును "రీ-ప్యాకేజ్డ్ ఫెయిల్యూర్ అలయన్స్" అని అభివర్ణించారు. ఈ కూటమిని తమిళనాడు ప్రజలు రెగ్యులర్ గా తిరస్కరిస్తూనే ఉన్నారని తెలిపారు. ఇక.. తమిళనాడులో ఎన్డీయే.. ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడుతుందనే విషయం అందరికీ తెలుసని.. ఈడీ, ఐటీ దాడులను సాధనంగా ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

అవి 'స్టాలిన్ బస్సులు'!:

ఈ నేపథ్యంలో.. మహిళలను సమాజానికి శక్తి కేంద్రం అని పిలిచిన స్టాలిన్... ముఖ్యమంత్రిగా తన మొదటి సంతకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం చేసినట్లు గుర్తు చేశారు. దీంతో.. ప్రజలు ఇప్పుడు వాటిని 'స్టాలిన్ బస్సులు' అని పిలుస్తున్నారని.. ఈ పథకం విజయవంతమైందని ఆ పేరే చూపిస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లతో పాటు, ఇంటింటికీ ఆరోగ్య సంరక్షణలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్రను కూడా స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు!

కనిమొళి కీలక ప్రశ్నలు!:

ఈ కార్యక్రమంలో అంతకంటే ముందు ప్రసంగించిన డీఎంకే ఎంపీ కనిమొళి.. ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో మాత్రమే తమిళనాడుకు వచ్చే "పర్యాటక ప్రధానమంత్రి" అని ఆమె అభివర్ణించారు. ఈ సందర్భంగా... హోసూర్ విమానాశ్రయ ప్రాజెక్టు, వరద విపత్తు ఉపశమనం, పాఠశాల పిల్లలకు పెండింగ్‌ లో ఉన్న నిధులు, తమిళ భాషా కార్యక్రమాలకు తగినంత నిధులు లేకపోవడం వంటి కీలక ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Tags:    

Similar News