భారత్-ఈయూ 'మెగా' డీల్: అగ్రరాజ్యం గుండెల్లో రైళ్లు.. ప్రపంచ వాణిజ్యంలో కొత్త శకం!
వాణిజ్యంతో పాటు రక్షణ రంగంలోనూ భారత్ కీలక అడుగు వేసింది. 27 ఈయూ సభ్య దేశాలతో కలిసి భారత్ 'సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ (సేఫ్)' ప్రోగ్రామ్‌లో భాగస్వామి కానుంది.;
ముందుగ మురిస్తే పండుగ కాదని ట్రంప్ కు ఇప్పటికే అర్థమై ఉంటుంది. భారత్ ప్రధాని మోడీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థమైంది. ట్రంప్ కు సన్నిహితులైన యూరోపియన్ యూనియన్ తోనే ఏకంగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకొని అగ్రరాజ్యానికి షాకిచ్చాడు మోడీ. అమెరికాతో ఈయూకు చెడడంతో మోడీ చేసుకున్న ఈ ఒప్పందం దౌత్య విజయంగా అభివర్ణిస్తున్నారు. అటు రష్యాను నొప్పింపకుండా.. ఇటు ఈయూతో డీల్ చేసుకొని అగ్రరాజ్య అహంకారాన్ని మోడీ దించారని ప్రశంసలు కురుస్తున్నాయి.
అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ ఒక భారీ వ్యూహాత్మక విజయాన్ని నమోదు చేసింది. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న 'భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ)' స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్.టీ.ఏ) ఎట్టకేలకు ఖరారైంది. మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాల మధ్య జరిగిన భేటీలో ఈ చరిత్రాత్మక ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ ఒప్పందం కేవలం రెండు ప్రాంతాల మధ్య వాణిజ్యానికే పరిమితం కాకుండా గ్రీన్‌లాండ్ అంశంపై అమెరికా-ఐరోపా మధ్య విభేదాలు తలెత్తిన వేళ ప్రపంచ సమీకరణాలను ఒక్కసారిగా మార్చివేసింది.
ఒప్పందంలోని కీలక అంశాలు
ఈ ఒప్పందం ద్వారా ఇరు పక్షాలు పరస్పరం రాయితీలు ప్రకటించుకున్నాయి. భారత ఎగుమతులకు ఊతమిస్తూ.. ముడి వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, దుస్తులు, పాదరక్షలు, రత్నాలు, వజ్రాభరణాలపై ఈయూ టారిఫ్‌లను పూర్తిగా తొలగించింది.లగ్జరీ కార్ల ధరలు దిగిరానున్నాయి. భారత్‌కు దిగుమతయ్యే ఐరోపా లగ్జరీ కార్లపై ప్రస్తుతం ఉన్న 110% సుంకాన్ని 40%కి తగ్గించాలని నిర్ణయించారు. భవిష్యత్తులో దీనిని 10%కి తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఫోక్స్‌వ్యాగన్ వంటి కార్లు భారతీయ వినియోగదారులకు చౌకగా అందనున్నాయి. వైన్ , స్పిరిట్స్ సుమారు 150% వరకు ఉన్న టారిఫ్‌లు, ప్లాస్టిక్స్, కెమికల్స్ , ఫార్మా ఉత్పత్తులపై కూడా సుంకాలు భారీగా తగ్గనున్నాయి.
రక్షణ, సాంకేతిక సహకారం
వాణిజ్యంతో పాటు రక్షణ రంగంలోనూ భారత్ కీలక అడుగు వేసింది. 27 ఈయూ సభ్య దేశాలతో కలిసి భారత్ 'సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ (సేఫ్)' ప్రోగ్రామ్‌లో భాగస్వామి కానుంది. దీనివల్ల భారతీయ రక్షణ సంస్థలు ఐరోపా మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం దక్కుతుంది. అలాగే 'సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ (ఎస్.ఓ,ఐఏ)' ద్వారా వ్యూహాత్మక సమాచార మార్పిడికి మార్గం సుగమమైంది.
అమెరికా 'అక్కసు'.. నాటో హెచ్చరికలు
భారత్-ఈయూ బంధం బలపడటంపై అగ్రరాజ్యం అమెరికా అసహనం వ్యక్తం చేసింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. తాము రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు త్యాగాలు చేస్తుంటే ఐరోపా మాత్రం భారత్‌తో ఒప్పందాలు చేసుకోవడంపై విమర్శలు గుప్పించారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్‌పై టారిఫ్‌లు వేయాలని తాము భావిస్తుంటే ఈయూ సహకరించడం లేదన్నది వారి వాదన.
మరోవైపు గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో నాటో చీఫ్ మార్క్ రుట్టే స్పందిస్తూ "అమెరికా సాయం లేకుండా ఐరోపా తనను తాను రక్షించుకోలేదు" అని హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఈ ఒప్పందంపై తాజాగా మోడీ గోవాలో జరిగిన ఓకార్యక్రమంలో వర్చువల్ గా మాట్లాడుతూ అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రపంచ GDPలో 25 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. దీనివల్ల కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని నరేంద్ర మోదీ ఈయూతో డీల్ అధికారికంగా ఆమోదించబడిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈయూ, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25 ప్రకారం 136.53 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో భారత్ ఎగుమతులు 75.85 బిలియన్ డాలర్లు కాగా.. భారత్ దిగుమతులు 60.68 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మిగులులో భారత్ నే టాప్ లో ఉంది కాబట్టి ఈ డీల్ దేశానికి ఎంతో మేలు. భారత్ ప్రస్తుతం 15.17 బిలియన్ డాలర్ల మిగులులో ఉంది.
ఈ ఎఫ్‌టీఏ (ఎఫ్.టీఏ) ద్వారా భారతీయ కార్మికులకు ఐరోపాలో మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. అమెరికా ఒత్తిళ్లను కాదని, అటు రష్యాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే.. ఇటు ఐరోపాతో మెగా డీల్ కుదుర్చుకోవడం ప్రధాని మోదీ దౌత్య విజయాన్నే సూచిస్తోంది.