రేవంత్ స్టూడెంట్ వెర్షన్: వణికించే చలిలో మెడలో ఐడీ కార్డుతో!
మెడలో ఐడీ కార్డుతో వణికించే చలిలో హార్వర్డ్ పరిధిలోని మసాచుసెట్స్ లోని కెనడీ స్కూల్ కు వెళ్లిన రేవంత్.. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.;
తోపు బిజినెస్ మ్యాన్ తనకు నచ్చిన అమ్మాయి కోసం సాదాసీదాగా వ్యవహరించటం. తన పని ఏదో తాను చేసుకుంటూ ఉండే ఒక పెద్ద పొలిటీషియన్ కొడుకు అకస్మాత్తుగా రాజకీయాల్లోకి రావటం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. సినిమాల్లో మాత్రమే కనిపించే కొన్ని సీన్లు.. అప్పుడప్పుడు అరుదుగా కళ్ల ముందుకు వస్తుంటాయి. ఇప్పుడు అలాంటిదే జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్నిరోజుల పాటు స్టూడెంట్ వెర్షన్ లో విద్యను అభ్యసిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. దావోస్ కు వెళ్లిన ఆయన.. అటు నుంచి అటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక కోర్సు చేస్తున్న సంగతి తెలిసిందే.
మన దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఎంతటి శక్తివంతమైన స్థానమన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందునా తెలంగాణ లాంటి సంపన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్.. నిత్యం ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. అలాంటిది విద్యార్థిగా ప్రపంచంలోనే అత్యున్న విశ్వవిద్యాలయంలో కోర్సు చేయటం చిన్నవిషయం కాదు. అది రోజుకు 11 గంటల పాటు ఆయన క్లాసులకు హాజరవుతున్నారు. ఉన్నతాధికారులకు.. అధికారులకు క్లాసులు తీసుకోవటమే కానీ క్లాసులు వినాల్సిన అవసరం లేని స్థితిలో ఉండి కూడా కొత్త విషయాల్ని నేర్చుకోవాలన్న ఆసక్తిని ప్రదర్శించటం చూస్తే.. తనను తాను అప్ గ్రేడ్ చేసుకోవాలన్న అంశంపై ఆయన ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థమవుతుంది.
మెడలో ఐడీ కార్డుతో వణికించే చలిలో హార్వర్డ్ పరిధిలోని మసాచుసెట్స్ లోని కెనడీ స్కూల్ కు వెళ్లిన రేవంత్.. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం 7 గంటలకు మొదలయ్యే క్లాసులు సాయంత్రం ఆరు గంటల వరకు సాగుతాయి. అంటే.. పదకొండు గంటలన్నమాట. ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిగా మూడేళ్లు హైదరాబాద్ లోని జేఎన్ టీయూలో క్లాసులకు హాజరైన రేవంత్.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మారారు.
ఇంతకూ సీఎం రేవంత్ చేస్తున్న కోర్సు ఏమిటంటే.. లీడర్ షిప్ 21 సెంచరీ. ఈ కోర్సుకు సంబంధించిన క్లాసులు కెనడీ స్కూల్ క్యాంపస్ లో మొదలయ్యాయి. ఈ క్లాసులు 30 వరకు జరుగుతాయి. ఈ కోర్సుకు ఐదు ఖండాలనుంచి 20 దేశాల ప్రతినిధులు హాజరవుతారు. సీఎం పదవిలో ఉంటూ హార్వర్డ్ వర్సిటీ నుంచి ఒక కోర్సు సర్టిఫికేట్ అందుకోవటం ద్వారా ఆయనో రికార్డును క్రియేట్ చేయనున్నారు. కోర్సులో భాగంగా వివిధ అంశాలపై తరగతులు.. కేస్ అనాలిస్ తో పాటు.. కొన్నింటికి పరిస్కారాల్ని సమర్పించటంతో కోర్సు ముగుస్తుంది. ఆపై వర్సిటీ నుంచి సీఎం రేవంత్ సర్టిపికేట్ అందుకుంటారు. ఫిబ్రవరి 2న ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. తాజాగా చేస్తున్న కోర్సుతో ఆయనో అరుదైన రికార్డును క్రియేట్ చేస్తున్నారు. స్వతంత్ర భారతంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ.. హార్వర్డ్ లాంటి ప్రఖ్యాత వర్సిటీలో కోర్సు చేస్తున్న మొదటి నేతగా నిలిచారు.
కోర్సులో భాగంగా క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాలి? అనిశ్చితి పరిస్థితులు.. అనుకోని మార్పుల్ని ఎలా ఎదుర్కోవాలి? లాంటి అంశాలు కోర్సులో ఉంటాయని చెబుతున్నారు. మొత్తంగా క్షణం ఖాళీ లేకుండా బ్యాక్ టు బ్యాక్ కార్యక్రమాలు ఉండటం.. అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికి.. తనను తాను మెరుగుపర్చుకోవటానికి ముఖ్యమంత్రి రేవంత్ చేస్తున్నప్రయత్నం చూసినప్పుడు అప్ గ్రేడ్ అయ్యేందుకు ఏ స్థాయిలో ఉన్నా.. ఏ అవకాశాన్ని వదులుకోకూడదన్నది అర్థమవుతుంది. తాను చేస్తున్న పనితో సీఎం రేవంత్ ఎంతోమందికి కొత్త స్ఫూర్తిగా మారతారని చెప్పక తప్పదు.