విజయ్ సభలో తొక్కిసలాట.. పాపమంతా పోలీసులదేనా?

పోలీసుల వైఫల్యం అన్నది లేకుంటే ఇంత పెద్ద విషాదం చోటు చేసుకునే ఛాన్స్ లేదంటున్నారు. పోలీసుల మీద వచ్చిన ప్రధాన ఆరోపణలు.. విమర్శల్ని చూస్తే..;

Update: 2025-09-28 04:16 GMT

రాజకీయ పార్టీలు భారీ ఎత్తున సభల్ని.. రోడ్ షోలను నిర్వహించటం కొత్త విషయం కాదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ మాటకు వస్తే సౌత్ తో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికల సభలు ఉంటే.. పది వేల మంది అంటే అది చాలా గొప్ప సభ.. భారీ సభగా భావిస్తారు. మన దగ్గర అందుకు భిన్నం. ఐదారు లక్షలు.. అంతకు మించి అయితేనే అది భారీ సభ అన్నట్లుగా ఫీల్ అవుతారు. రాజకీయ పార్టీల బలప్రదర్శనకు భారీ సభలు వేదికగా మారుతుంటాయి.

ప్రజల్లో తమకున్న పట్టును ప్రదర్శించేందుకు.. పార్టీలో జోష్ ను పెంచేందుకు.. ప్రత్యర్థులకు బలమైన సవాలు విసిరేందుకు వీలుగా భారీ సభలు.. పెద్ద ఎత్తున రోడ్ షోలను నిర్వహించటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. అయితే.. క్రౌడ్ కంట్రోల్ అన్నది కామన్ అయినప్పటికీ.. విజయ్ నిర్వహించిన కరూర్ సభలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఎందుకు చోటు చేసుకున్నట్లు అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి అన్ని వేళ్లు.. పోలీసుల వైపు చూపిస్తున్నాయి.

పోలీసుల వైఫల్యం అన్నది లేకుంటే ఇంత పెద్ద విషాదం చోటు చేసుకునే ఛాన్స్ లేదంటున్నారు. పోలీసుల మీద వచ్చిన ప్రధాన ఆరోపణలు.. విమర్శల్ని చూస్తే..

- సభా వేదికను విజయ్ పార్టీ కోరిన చోటు కాకుండా .. తాజాగా జరిగిన వేదిక ప్రాంతాన్ని పోలీసులే సూచించారు.

- సభా వేదిక మొత్తం ఇరుకైన రోడ్లతో నిండటం.. భారీగా అభిమానులు చేరుకోవటంతో కిక్కిరిసిపోయింది.

- సభకు భారీగా హాజరవుతున్న ప్రజలకు తగినట్లుగా.. ఆ సమూహాన్ని కంట్రోల్ చేసేంతగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయకపోవటం.

- విజయ్ పార్టీ సైతం ఈ రోడ్ షోకు 10 వేల మంది వస్తారని అంచనా వేసింది. పోలీసుల అనుమతి సైతం పది వేల మంది వస్తే.. ఎంత సిబ్బంది అవసరమవుతారో.. అంతే ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

- పది వేల మందికి విజయ్ పార్టీ పర్మిషన్ తీసుకున్నప్పటికీ.. భారీగా అభిమానులు రోడ్ షోకు హాజరవుతున్న వైనాన్ని చూసి.. రియల్ టైంలో అప్పటికప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదు? అన్నది ప్రశ్న. అంతేకాదు.. షెడ్యూల్ కు ఆరు గంటలు ఆలస్యంగా రోడ్ షోకు విజయ్ వచ్చినప్పుడు.. అప్పటికే వేలాది మంది అభిమానులు హాజరైనప్పుడు.. అందుకు తగ్గట్లు భద్రతా ఏర్పాట్ల విషయంలో పోలీసులు ముందుచూపుతో వ్యవహరించి ఉంటే ఇంతటి విషాదం చోటు చేసుకునేది కాదంటున్నారు.

- పోలీసుల వైఫల్యంలో మరో కీలక అంశం నిఘా వర్గాలు ఘోర వైఫల్యం కూడా మరో కారణం. రోడ్ షోకు భారీగా అభిమానులు హాజరవుతున్న వివరాల్ని పంపటంతో పాటు.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి.. తొక్కిసలాటకు ఉండే అవకాశాల్ని ఉన్నతాధికారులకు నోట్ పంపి ఉన్నా.. ఈ విషాదం తప్పేదన్న అభిప్రాయం ఉంది. అయితే.. నిఘా వర్గాలు అంత యాక్టివ్ గా రియాక్టు కావటం చాలా అరుదుగా మాత్రమే ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

- విజయ్ సభ జరుగుతున్న సమయంలో అటుగా వచ్చిన ఒక అంబులెన్స్ కు దారి ఇవ్వకపోవటం.. అంబులెన్సు డ్రైవర్ పై దాడి చేసినట్లుగా చెబుతున్నారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పటంతో పరిస్థితి చేజారినట్లుగా ఒక వాదన ప్రచారంలో ఉంది. ఇందులోనూ పోలీసు చర్యతోనే పరిస్థితి చేజారినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఈ దారుణ విషాదంలో పోలీసులు ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా.. ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.

Tags:    

Similar News