చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఈ మహిళల డిమాండ్ నెరవేరుస్తారా?

కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే.;

Update: 2025-10-10 13:17 GMT

కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా ఒక రోజు, అంటే ఏడాదికి 12 రోజుల వేతనంతో కూడిన పీరియడ్స్ లీవ్ పాలసీ - 2025 ఆమోదించింది. ఈ విధానం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని మహిళా ఉద్యోగులకు వర్తిస్తుంది! దీంతో.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

అవును... కర్ణాటకలో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ రంగ సంస్థల్లోని మహిళా ఉద్యోగులకు నెలకు ఒక రోజు చొప్పున వేతనంతో కూడిన పీరియడ్స్ లీవ్ ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మహిళల శ్రేయస్సును మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 'ఎక్స్' ద్వారా వెల్లడించారు.

ఈ సందర్భగా స్పందించిన రాష్ట్ర న్యాయ మంత్రి హెచ్.కే. పాటిల్... రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, మల్టీ నేషనల్ కంపెనీలు, ఐటీ సంస్థలు, వస్త్ర పరిశ్రమలు, ఇతర ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసే మహిళా ఉద్యోగులకు నెలకు ఒక వేతనంతో కూడిన రుతు సెలవును పొందవచ్చని.. ఇది శ్రామిక మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.

ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన నేపథ్యంలో తాము కూడా దీనిని స్వీకరించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. దీనిపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. మహిళల నిజమైన ఆరోగ్య అవసరాలను గుర్తించడంలో ఇది ప్రశంసనీయమైన అడుగు అని కొనియాడుతూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్ లాడ్ మాట్లాడుతూ.. మహిళలకు నెలసరి సెలవులను ఆమోదించడం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని.. మహిళలు ఏడాదికి మొత్తం 12 సెలవులను, అంటే నెలకు ఒకటి చొప్పున లేదా వారి సౌలభ్యం మేరకు ఒకేసారి తీసుకోవచ్చని వివరించారు. ఈ నిర్ణయం మహిళల సంక్షేమం కోసం ఆలోచించే తమ ప్రభుత్వానికి గర్వకారణం అని అన్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తరహా డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఈ దిశగా ఆలోచన చేయాలని తెలుగు రాష్ట్రాల్లోని మహిళా ఉద్యోగులు కోరుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తరహాలోనే దీన్ని అమలు చేయాలని కోరుతున్నారు!

కాగా... తాజా నిర్ణయంతో పీరియడ్‌ లీవ్స్ అమలు చేసిన రాష్ట్రాల జాబితాలో కర్ణాటక చేరింది. వేతనంతో కూడిన రుతు సెలవులను కేరళ, బీహార్, ఒడిశా, సిక్కిం ఇప్పటికే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు జీతంతో కూడిన రుతు సెలవులను ప్రకటించిన ప్రైవేటు రంగ సమస్థల్లో స్విగ్గీ, జొమాటో, ఎల్ అండ్ టి, బైజూస్ ఉన్నాయి!

Tags:    

Similar News