కారం పొడి, గాజు సీసాతో మాజీ డీజీపీని చంపిన భార్య!
ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన భార్యే ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.;
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ (68) హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన భార్యే ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, ఈ కేసులో మరిన్ని భయానకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ఆదివారం మధ్యాహ్నం ఓం ప్రకాష, ఆయన భార్య పల్లవి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది.
గొడవ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పల్లవి మొదట ఓం ప్రకాష్ కళ్లల్లో కారం పొడి చల్లింది. ఆ తర్వాత ఆయనను కట్టేసి, ఓ గాజు సీసా పగుల కొట్టి దానితో పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేసింది. ఈ ఘోరం జరిగిన వెంటనే, నిందితురాలు మరో పోలీసు అధికారి భార్యకు ఫోన్ చేసి తన భర్తను తానే చంపానని చెప్పింది. దీంతో వెంటనే ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది.
సంబంధిత వ్యక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓం ప్రకాష్ తన బంధువుకు ఒక ఆస్తిని ట్రాన్సఫర్ చేశారు. ఈ విషయంపై భార్యభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ ఆస్తి వివాదమే హత్యకు దారితీసిందని భావిస్తున్నారు. మృతుడు ఓం ప్రకాష్ కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో మృతుడి కుమార్తె పాత్ర కూడా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మృతుడి కుమారుడు తన ఫిర్యాదులో పల్లవి 12 ఏళ్లుగా స్కిజోఫ్రీనియాతో బాధపడుతోందని, ఆమెకు ప్రస్తుతం ఇంకా చికిత్స కూడా జరుగుతోందని పేర్కొన్నాడు. ఆమె తరచూ తన భర్త నుండి తనకు ప్రమాదం ఉందని భయం వ్యక్తం చేసేదని ఊహాజనితమైన ఆలోచనలతో తీవ్ర ఆందోళనకు గురయ్యేదని కూడా కుమారుడు పోలీసులకు తెలిపాడు.
1981 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్ బిహార్‌లోని చంపారన్‌కు చెందిన వారు. ఆయన 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 2017లో పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ అనంతరం ఆయన బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వారి ఇంటికి వెళ్లగా, ఓం ప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. పోలీసులు వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ దారుణమైన ఘటన బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది.