సూసైడ్ చేసుకున్న వ్యక్తిని సేవ్ చేసేందుకు 2కి.మీ. మోసుకెళ్లిన పోలీస్

అయితే.. పోలం వద్ద ఆత్మహత్యాయత్నం చేసుకోవటం.. అక్కడకు టూవీలర్ వెళ్లే పరిస్థితి లేదు

Update: 2024-02-29 07:30 GMT

వావ్ అనిపించే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు ఒక పోలీస్ కానిస్టేబుల్ చేసిన సాహసం గురించి తెలిసిన వారంతా అతడ్ని అభినందించటమే కాదు.. అసలుసిసలు పోలీస్ అంటే ఇలా ఉండాలంటూ పొగిడేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని కాపాడేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగటమే కాదు.. అంబులెన్సు కోసం ఎదురుచూడకుండా.. అమాంతం భుజాన వేసుకొని పరుగులు తీసిన పోలీస్ కానిస్టేబుల్ ఉదంతమిది.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం భేతిగల్ కు చెందిన కుర్ర సురేష్ ఇంటి వద్ద గొడవ పడ్డాడు. ఇంటి నుంచి పొలానికి వచ్చిన అతను పురుగుల మందు తాగాడు. అక్కడున్న వారు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. దీంతో బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్.. హోంగార్డు సంపత్ లు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే.. పోలం వద్ద ఆత్మహత్యాయత్నం చేసుకోవటం.. అక్కడకు టూవీలర్ వెళ్లే పరిస్థితి లేదు.

దీంతో.. అపస్మారక స్థితిలో ఉన్న సరేష్ ను జయపాల్ భుజాన వేసుకొని సుమారు రెండు కిలోమీటర్లు మోసుకుంటూ పొలం గట్టు మీదుగా గ్రామంలోకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సూసైడ్ కు పాల్పడిన సురేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే స్పందించటం ఒక ఎత్తు అయితే.. భుజాన మోసుకొంటూ రెండు కిలోమీటర్లు నడిచిన కానిస్టేబుల్ తెగువకు.. చొరవకు గ్రామస్తులంతా అతడ్ని అభినందిస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు పోలీసుల మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని అంతో ఇంతో తగ్గిస్తాయని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News