కాపులు తలో దారి...ఆశలు ఆవిరి....!?

కాపులకు నిర్ణయాత్మకమైన ఎన్నికలు 2024లో అని అంతా అనుకున్నారు. మూడవ ఆల్టర్నేషన్ గా జనసేన నిలుస్తుందని భావించారు.

Update: 2024-03-07 15:30 GMT

కాపులకు నిర్ణయాత్మకమైన ఎన్నికలు 2024లో అని అంతా అనుకున్నారు. మూడవ ఆల్టర్నేషన్ గా జనసేన నిలుస్తుందని భావించారు. దానికి తగినట్లుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలు గత ఏడాది ఉభయ గోదావరి జిల్లాలలో చేపట్టారు. దానికి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. అది చూసిన వారు జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఈ జిల్లాలలో పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకుంటుందని కూడా లెక్క వేశారు.

సీన్ కట్ చేసే అదే ఏడాది సెప్టెంబర్ లో చంద్రబాబు అరెస్ట్ అయితే ఆయనను పరామర్శించి వచ్చిన పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అది కూడా వ్యూహాత్మకమా అనుకున్నా తక్కువ సీట్లతో ఈ పొత్తు అని ఇటీవల తేలింది. దాంతో పాటు కాపులకు రాజ్యాధికారం అన్నది ఈ ఎన్నికలకు మాత్రం ఒక కల అన్నది కాపులకు మెల్లగా అర్ధం అవుతోంది అంటున్నారు.

ఇక కాపులకు ఎంతో మంది నాయకులు ఉన్నారు. వారంతా కాపుల సంక్షేమం కోసం కృషి చేశారు. వారిని కలుపుకుని పోతే కచ్చితంగా జనసేన గోదావరి జిల్లాలలో బలోపేతం అయ్యేది. దాని ప్రభావం ఇటు ఉత్తరాంధ్రా నుంచి అటు దక్షిణ కోస్తా జిల్లాల దాకా పడేది అన్న అంచనాలు ఉన్నాయి.

ఆ క్రమంలో ముద్రగడ పద్మనాభం వంటి వారు జనసేనలో చేరాలని చూసారు. వారిని కనుక చేర్చుకుని ఉంటే జనసేనకు మరింతగా నిబ్బరం పెరిగేది అని అంటున్నారు. అలాగే కాపుల కోసం దాదాపు తొంబై ఏళ్ల వయసులో పాటుపడుతున్న చేగొండి హరి రామజోగయ్య వంటి వారి సలహాలు పాటించి ఉంటే కూడా జనసేన పట్ల బలమైన సామాజిక వర్గంలో పూర్తి విశ్వాసం వ్యక్తం అయ్యేది అని అంటున్నారు.

Read more!

కానీ ఇపుడు కాపు పెద్దలను కలుపుకోకుండా టీడీపీతో పొత్తులతో వెళ్తున్న జనసేన గోదావరి జిల్లాలలో ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది అన్న చర్చ మొదలైంది. ఈసారి ఎన్నికలు నిజానికి జనసేనకు ఎంతో ఉపయోగపడేదిగా ఉన్నాయి. కానీ జనసేన మాత్రం తన ఎదుగుదలకు తొలి మెట్టు రెండవ మెట్టు అంటూ తక్కువ సీట్లతో తగ్గి టీడీపీనే ఆల్టర్నేషన్ అని చెప్పేసింది.

నిజానికి ముద్రగడ వంటి వారు గతంలో వైసీపీలో వెళ్ళాలని అనుకున్నా కాపు సామాజిక వర్గంలో కొంత వ్యతిరేకత కనిపించేది. జనసేనలో చేరకుండా ఎదురునిలుస్తారా అన్న ప్రశ్నలు కూడా వినిపించేవి. పవన్ ముద్రగడతో సరిగ్గా వ్యవహరించలేదని పెద్దాయన రాసిన బహిరంగ లేఖతో చాలా మందికి ఎన్నో సందేహాలు విడిపోయాయి.

అందుకే ముద్రగడ పద్మనాభం ఇపుడు పూర్తి ఆప్షన్ గా చేసుకుని వైసీపీలోకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు చూస్తే కనుక మనలను ఎవరు గౌరవిస్తే వారితోనే ఉందాం అని. అంటే ఇది కాపు సామాజిక వర్గంలో కూడా చర్చకు వచ్చేలా ఉంది. తనను పవన్ కళ్యాణ్ అవమానించారు అన్న బాధ పెద్దాయనలో ఉంది అంటున్నారు. దాంతో ముద్రగడ ఇపుడు వైసీపీలో చేరినా కూడా ఎవరూ కాదనే పరిస్థితి లేదు.

పైగా ముద్రగడ తన ప్రభావం చూపించడానికి సత్తా చాటడానికి కూడా సహజంగానే చూస్తారు. ఆయన 2009 ఎన్నికల తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇపుడు మళ్ళీ ఆయన తన రాజకీయ సత్తాను పూర్తిగా చూపుతారు అని అంటున్నారు. అది వైసీపీ కోసమే కాదు తన కోసం కూడా అంటున్నారు. ముద్రగడ రాజకీయంగా ఏమీ సాధించుకోలేదు. ఎన్నో పదవులు నిర్వహించినా ఆయన ఏమీ కాకుండా మిగిలారు.

4

ఈసారి ఆయన వైసీపీలో చేరిక సందర్భనగ తన రాజకీయ విశ్వ రూపం కూడా చూపిస్తారు అని అంటున్నారు. ఇది ఆయనకు అనివార్యం అని అంటున్నారు. ముద్రగడ వైసీపీ వైపు నిలబడి జనసేన టీడీపీ కూటమిని అడ్డుకుంటే గోదావరి జిల్లాలలో ఫలితాలు ఏకపక్షం కాబోవు అని అంటున్నారు. ఏది ఏమైనా ఇక్కడ ఒక మాట ఉంది. మూడవ ఆల్టర్నేషన్ గా భావించుకున్న జనసేన టీడీపీతో పొత్తుకు వెళ్ళిపోవడం, కాపు పెద్దలు తలో దారి కావడంలో కాపుల సీఎం కల మరో అయిదేళ్ల పాటు వాయిదా వేసుకోవడమేనా అన్న చర్చ అయితే వస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News