కందుకూరు హత్య.. కొన్ని నిజాలు.. !
తిరుమల శెట్టి గత నెల 29న హరిశ్చంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి.. స్థానికంగా జరుగుతున్న పరిణామాలపై నిలదీశారు.;
నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని దామరకవాని పాడు గ్రామంలో ఈ నెల 2న దసరా రోజు జరిగిన దారుణ హత్య రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. వాస్తవానికి ఈ హత్య జరిగి 18 రోజులు అయింది. అనంతరం.. అన్ని కార్యక్రమాలు కూడా ముగిశాయి. హత్యకు కారణమైన హరిశ్చంద్ర ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు.. ఆయన తండ్రిని కూడా జైలుకు పంపించారు. కానీ, ఇప్పుడు ఈ వ్యవహారం చర్చకు రావడం.. ప్రభుత్వం హుటాహుటిన స్పందించడం వంటివి చర్చనీయాం శంగా మారాయి.
అసలు ఏం జరిగింది..?
కందుకూరు ఘటనలో హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు.. కాపు సామాజిక వర్గం తరఫున బల మైన గళం వినిపిస్తున్న మాట వాస్తవమే. అయితే.. ఆయన రాజకీయాలకంటే కూడా.. సామాజిక వర్గం కార్య క్రమాలకు ఎక్కువగా హాజరవుతున్నారు. ఇక, ఇదే నియోజకవర్గంలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన హరిశ్చంద్రప్రసాద్.. అటు రాజకీయంగా ఇటు నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున కీలక రోల్ పోషిస్తున్నా రు. ఇరువురు కూడా ఒకప్పుడు మిత్రులే. అయితే.. ఇటీవల కాలంలో తమకు ప్రాధాన్యం తగ్గిపోయింద న్నది తిరుమలశెట్టి వాదన. ఇదే వివాదానికి దారితీసింది.
తిరుమల శెట్టి గత నెల 29న హరిశ్చంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి.. స్థానికంగా జరుగుతున్న పరిణామాలపై నిలదీశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం.. హరిశ్చంద్ర ప్రసాద్ చేస్తున్న ఆగడాలకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని.. వాటిని బయట పెడతానని లక్ష్మీనాయుడు హెచ్చరించారు. ఇదే అసలు వివాదానికి దారి తీసింది. దీనిపై స్థానిక నేతలకు ముందు నుంచి సమాచారం ఉందని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే..వారు పట్టించుకోలేదు.
తర్వాత జరిగిన పరిణామాల్లో దసరా రోజు లక్ష్మీనాయుడిని హరిశ్చంద్రప్రసాద్ కారుతో గుద్ది చంపారు. ఇదిలావుంటే.. దీనికి ఓ వర్గం నాయకులు.. కాపు నాయకుడిని హత్య చేస్తే.. కనీసం పట్టించుకోరా.. అంటూ జనసేనను ఈ ఉచ్చులోకి లాగారు. ఇక, అక్కడి నుంచి ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ పరిణామాలతోనే తొలుత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ.. రాను రాను ఇది కులాల మధ్య ఘర్షణగా మారుతున్న క్రమంలో స్పందించి.. సాయానికి హామీ ఇచ్చింది.