కొత్త ఎమ్మెల్యే: అమిలినేని ఆపశోపాలు.. !
అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం కళ్యాణదుర్గం. ఇక్కడి నుంచి తొలిసారిగా గత ఎన్నికల్లో అమిలినేని సురేంద్రబాబు విజయం దక్కించుకున్నారు.;
అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం కళ్యాణదుర్గం. ఇక్కడి నుంచి తొలిసారిగా గత ఎన్నికల్లో అమిలినేని సురేంద్రబాబు విజయం దక్కించుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా, ముఖ్యంగా పెట్టుబడిదారుడిగా కూడా సురేంద్రబాబు పేరు తెచ్చుకున్నారు. దీంతో సునాయాసంగా గత ఎన్నికల్లో సీటు తెచ్చుకున్నారు. దీనికి తోడు టిడిపిలో నెలకొన్న అంతర్గత వ్యవహారాలు, వివాదాలు కూడా ఆయనకు అప్పట్లో టికెట్ వచ్చేందుకు కలిసి వచ్చాయి. ఇక గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్న సురేంద్రబాబు ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తున్నారు? అనేది ప్రశ్న.
అంతేకాదు, అందరినీ ఎలా కలుపుకుని పోతున్నారు అనే విషయాన్ని పరిశీలిస్తే కొంతమేరకు ఆయనకు ఇబ్బందికర పరిణామాలే ఎదురవుతున్నాయని స్థానికంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్న పనులను ఒక వర్గం వారికే కేటాయిస్తున్నారన్నది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. అదేవిధంగా పార్టీ నాయకులతోకూడా కలివిడిగా లేరని వ్యక్తిగతంగా కలుసుకునేందుకు సమయం కూడా ఇవ్వడం లేదని టిడిపి నేతలు వాపోతున్నారు. మిశ్రమ ఫలితాలు వచ్చే కళ్యాణదుర్గం నియోజకవర్గం లో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
దీంతో పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించే విషయంలో కొందరు నాయకులు ఎమ్మెల్యే పై ఒత్తిడి చేస్తుండగా మరి కొందరు మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీనివల్ల వైసిపి దూకుడు పెరుగుతుంది అన్నది నాయకులు చెబుతున్న మాట. ఈ పరిణామాలకు అడ్డుకట్ట వేయాలంటే ఎమ్మెల్యే ప్రజల మధ్యకు రావాలని, పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా వ్యాపారాల పరంగా ఉన్న బిజీ కారణంగా రాలేకపోతున్నారన్నది వాస్తవం. ఆయన ఈ విషయాన్ని నిర్మొహమాటంగా అందరికీ చెబుతున్నారు.
అయితే పార్టీకి కేటాయించాల్సిన సమయం కేటాయిస్తున్నామని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఇస్తున్న సంక్షేమాన్ని ప్రజల మధ్యకు తీసుకు వెళుతున్నామని కూడా చెబుతున్నారు. కానీ కొంతమంది నాయకులు మాత్రం పదవుల విషయంలో తమకు ఎలాంటి సిఫారసులు చేయడం లేదని కూడా వాపోతున్నారు. మొత్తానికి కళ్యాణదుర్గం నియోజకవర్గం లో కొత్త ఎమ్మెల్యేకి మిశ్రమ వాతావరణమే కనిపిస్తుండడం విశేషం. ఇది మాజీ మంత్రికి కలిసి వస్తుందన్న విషయాన్ని ఆయన కొట్టి పారేస్తున్నారు. వైసీపీ నేతలవి ఉత్తుత్తి ప్రచారాలేనని చెబుతున్నారు. ఏదేమైనాసురేంద్ర బాబు కొంత సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని నాయకులు సూచిస్తున్నారు.