మానస సరోవర్ యాత్రకు సరిహద్దు సెగ.. రిజిస్ట్రేషన్లు ముగుస్తున్న వేల యాత్ర సాగుతుందా?

కోట్లాది ఏళ్ల భక్తుల నమ్మకానికి ప్రతీక అయిన కైలాశ్ మానసరోవర్ యాత్ర చుట్టూ ఇప్పుడు సరిహద్దు వివాదాలు మధ్య చిక్కుకోవడం ఆశ్చర్యకరం.;

Update: 2026-05-04 04:00 GMT

కోట్లాది ఏళ్ల భక్తుల నమ్మకానికి ప్రతీక అయిన కైలాశ్ మానసరోవర్ యాత్ర చుట్టూ ఇప్పుడు సరిహద్దు వివాదాలు మధ్య చిక్కుకోవడం ఆశ్చర్యకరం. ఏటా వేలాది మంది భారతీయులు భక్తిశ్రద్ధలతో సాగించే ఈ పవిత్ర ప్రయాణం, ఇప్పుడు మూడు దేశాల మధ్య రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పవిత్రమైన హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రశాంతంగా సాగాల్సిన యాత్రపై నేపాల్ లేవనెత్తిన అభ్యంతరాలు, అంతర్జాతీయ స్థాయిలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అసలు ఈ వివాదం వెనుక ఉన్న లోతైన కారణాలు, భక్తుల విశ్వాసాల పరిస్థితి ఏంటో చూద్దాం.

ఉత్తరాఖండ్ మీదుగా సాగే కైలాశ్ మానసరోవర్ యాత్రపై నేపాల్ విదేశాంగ శాఖ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఉత్తరాఖండ్ నుంచి లిపులేఖ్ పాస్ ద్వారా ఈ యాత్ర నిర్వహించాలన్న భారత్, చైనాల ప్రణాళికలను నేపాల్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ వివాదం ఇప్పుడు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చిక్కులను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.

లిపులేఖ్ పాస్ ఎవరిది?

ఈ వివాదానికి ప్రధాన కేంద్రం లిపులేఖ్ పాస్ అనే హిమాలయ కనుమ. లిపులేఖ్ పాస్ తమ భూభాగంలో ఉందని నేపాల్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అలాంటిది తమ అనుమతి లేకుండా మార్గాన్ని ఉపయోగించుకునే హక్కు ఏ దేశానికీ లేదని నేపాల్ ప్రభుత్వం ఖరాఖండిగా చెప్తోంది. నేపాల్ లేవనెత్తిన ఈ అభ్యంతరాలపై అటు భారత్ గానీ, ఇటు చైనా గానీ ఎటువంటి అధికారిక స్పందనను తెలియజేయలేదు.

జోరుగా రిజిస్ట్రేషన్ల జోరు!

ఒకవైపు దౌత్యపరమైన వివాదాలు నడుస్తున్నప్పటికీ, మానసరోవర్ యాత్రకు సంబంధించిన ప్రక్రియ మాత్రం ఆగలేదు. ఈ పవిత్ర యాత్రలో పాల్గొనాలనుకునే భక్తుల కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. యాత్రకు దరఖాస్తు చేసుకునేందుకు మే 19వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. సరిహద్దు వివాదాల మధ్య యాత్ర షెడ్యూల్ ప్రకారం సాగుతుందా? లేదా అనే ఉత్కంఠ భక్తుల్లో నెలకొంది.

ప్రాధాన్యత, భద్రత

మానసరోవర్ యాత్ర అనేది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. లిపులేఖ్ పాస్ ద్వారా యాత్ర సాగితే ప్రయాణ సమయం, ప్రయాణ బడలిక గణనీయంగా తగ్గుతుంది, అందుకే భారత్ ఈ మార్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. హిమాలయాల్లో మారుతున్న రాజకీయ సమీకరణలు, నేపాల్ తాజాగా చేస్తున్న వాదనలు యాత్రికుల భద్రత, ప్రయాణ మార్గాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

హిమాలయ కనుమల విషయంలో దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమే అయినా, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న మానసరోవర్ యాత్రకు ఆటంకాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దౌత్య చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకొని, యాత్రను విజయవంతం చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News