కడప రెడ్డమ్మను వెంటాడుతున్న కుర్చీ కష్టాలు.. ఈ సారి ఏం జరిగింది అంటే..?

ప్రభుత్వ విప్ పదవిలో కేబినెట్ హోదాలో ఉన్న తనకు అధికారులు సరైన గౌరవం ఇవ్వడం లేదన్న భావనతో ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు.;

Update: 2025-08-15 10:59 GMT

కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రెడ్డప్పగారి మాధవీరెడ్డికి కుర్చీ కష్టాలు వెంటాడుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోట అయిన కడపలో అనూహ్య విజయం సాధించిన మాధవీరెడ్డి కూటమి ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన దూకుడు పనితీరుతో ప్రభుత్వంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే కడప మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీ అధిపత్యం ఉండటంతో పాలకవర్గ సమావేశాల్లో ఆమెకు ఎప్పుడు అవమానాలే ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలిచిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశాల్లో మేయర్ కుర్చీ పక్కనే ఎమ్మెల్యేకు కుర్చీ వేయాలని ఆమె కోరుతున్నారు. అయితే మేయర్ వైసీపీకి చెందిన వారు కావడంతో నిబంధనలు పేరు చెప్పి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయడం లేదు. ఇది రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు వల్ల రాజకీయ వివాదంగా చూసేవారు. అయితే ఈ సారి కడప ఎమ్మెల్యేకు అధికారుల నుంచే అవమానం ఎదురైందని చెబుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కడపలో నిర్వహించిన వేడుకల్లో వేదికపైకి ఎమ్మెల్యే మాధవీరెడ్డిని ఆహ్వానించలేదని, ఆమెకు ప్రత్యేకంగా సీటు వేయలేదని మాధవీరెడ్డి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జేసీ అదితి సింగ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడప స్వాతంత్ర్య వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డికి అవమానం జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తగ్గట్టు స్వాతంత్ర్య వేడుకలకు వచ్చిన ఎమ్మెల్యే వేదికపైకి వెళ్లకుండా చాలా సేపు వేదిక పక్కనే నిల్చొని కార్యక్రమం అనంతరం సీరియస్గా వెళ్లిపోయిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఆగ్రహాన్ని గమనించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నచ్చజెప్పినా ఎమ్మెల్యే మాధవీ రెడ్డి శాంతించలేదు. ఎమ్మెల్యే భర్త, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. టీడీపీ ముఖ్యనేతలైన ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆమె భర్త అలిగి వెళ్లిపోయినా స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పట్టించుకోలేదని టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కడప పోలీస్ పరేడ్ గ్రౌండులో ఈ రోజు 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గౌరవ అతిథిగా మంత్రి ఫరూక్ హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే మాధవీరెడ్డిని కూడా ఆహ్వానించారు. ఉదయం స్థానిక కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డితో కలిసి పోలీస్ పరేడ్ గ్రౌండుకు వెళ్లారు. ఆ సమయంలో వేదికపై తనకు కేటాయించిన సీటులో వేరే అధికారి కూర్చోవడానికి గమనించి ఆమె కిందనే ఉండిపోయారు. ఈ విషయాన్ని గమనించిన జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ వెంటనే ఎమ్మెల్యే మాధవిరెడ్డి వద్దకు వెళ్లి సముదాయించారు. కానీ, ఎమ్మెల్యే మాధవీరెడ్డి అలకవీడలేదు. ఈ విషయం తెలుసుకుని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సైతం వేదిక దిగి ఎమ్మెల్యేకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా తనకు కేటాయించిన సీటులో వేరొకరు కూర్చోవడంపై కినుక వహించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి వేదికపైకి వెళ్లేందుకు ఇష్టపడలేదు.

ప్రభుత్వ విప్ పదవిలో కేబినెట్ హోదాలో ఉన్న తనకు అధికారులు సరైన గౌరవం ఇవ్వడం లేదన్న భావనతో ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారుల వాదన మరోలా ఉంది. స్వాతంత్ర్య వేడుకల్లో ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కుర్చీ వేసే ప్రొటోకాల్ లేదని, అందుకే ఎమ్మెల్యే మాధవీరెడ్డికి ప్రత్యేకంగా సీటు కేటాయించలేదని అధికార యంత్రాంగం వివరణ ఇస్తోంది. అయినప్పటికీ జేసీ, కలెక్టర్ తదితర ఉన్నతాధికారులు ఎమ్మెల్యే మాధవిరెడ్డి వద్దకు వెళ్లి వేదికపైకి రమ్మనమని పిలిచినా పట్టించుకోకుండా వెళ్లిపోయారని చెబుతున్నారు.

ఈ ఉదంతంతో మాధవీరెడ్డికి కుర్చీ తిప్పలు తప్పడం లేదని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కూడా కడప నగర పాలక సంస్థ సమావేశాల్లో కుర్చీ కోసం ఆమె చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తున్నారు. అధికారులు నిబంధనలు ప్రకారమే నడుచుకుంటారని, ఒక్కో ప్రభుత్వంలో ఒక్కోలా వ్యవహరించరని అంటున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యేగా మాధవీరెడ్డి ప్రొటోకాల్ ప్రకారమే గౌరవం కోరుకుంటున్నారని ఆమె మద్దతుదారులు, అనుచరులు చెబుతున్నారు. మరోవైపు మాధవీరెడ్డికి అవమానం జరిగిందనే వార్త రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మాధవీరెడ్డి తరచూ ఈ తరహా అవమానాలేంటన్న చర్చ జరుగుతోంది. ఇక ఈ వివాదంపై ప్రభుత్వ స్పందన ఏంటన్నది ఇంతవరకు తెలియలేదని చెబుతున్నారు.

Tags:    

Similar News