జూబ్లీహిల్స్ సర్వే : బీఆర్‌ఎస్ కే ఆధిక్యం.. రేవంత్ ను మించిన కేసీఆర్ పాపులారిటీ
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు సర్వే వెల్లడించింది. కేవలం 28.40% మంది మాత్రమే ఆయన పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.;
తెలంగాణ రాజకీయాలను మరోసారి వేడెక్కించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'మూడ్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ పాపులేషన్' సంస్థ నిర్వహించిన సర్వే సంచలన విషయాలను బయటపెట్టింది.
-సర్వే ఫలితాల సారాంశం
సర్వే ప్రకారం, బీఆర్‌ఎస్‌కి 44.91% మద్దతు లభించగా, కాంగ్రెస్‌కి 37.33% మద్దతు లభించింది. బీజేపీ కేవలం 0.55% ఓట్లతో వెనుకబడింది. ఇంకా 13.02% మంది ఓటర్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదు. ఈ ఫలితాలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీని సూచిస్తున్నాయి. అయితే అంతిమంగా బీఆర్ఎస్ కే ఆధిక్యం లభించింది.
- రేవంత్ రెడ్డి పాలనపై అసంతృప్తి
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు సర్వే వెల్లడించింది. కేవలం 28.40% మంది మాత్రమే ఆయన పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీల అమలులో జాప్యం, జూబ్లీహిల్స్‌లో నెలకొన్న తాగునీరు, విద్యుత్ కోతలు, రోడ్ల సమస్యలు వంటి స్థానిక సమస్యలు ప్రజల అసంతృప్తికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
-కేసీఆర్ వర్సెస్ రేవంత్: ఎవరి పాలన బెటర్?
ఏ ముఖ్యమంత్రి పాలన బాగుందని అడిగిన ప్రశ్నకు.. ఎక్కువ మంది ప్రజలు కేసీఆర్‌కి మద్దతు పలికారు. ఏకంగా 55.68% మంది కేసీఆర్ పాలన బాగుందని చెప్పగా, రేవంత్ రెడ్డికి కేవలం 28.40% మద్దతు మాత్రమే లభించింది. రైతు బంధు, దళిత బంధు, 24 గంటల విద్యుత్ వంటి గత ప్రభుత్వ పథకాలు కేసీఆర్‌కు బలమైన ప్రజాదరణను కల్పించాయి.
-అభ్యర్థులపై ప్రజల అభిప్రాయం
బీఆర్‌ఎస్ తరపున పోటీ చేయనున్న దివంగత ఎమ్మెల్యే భార్య మాగంటి సునీతమ్మకు ప్రజల మద్దతు గణనీయంగా ఉంది. ఆమెకు 46.60% మద్దతు లభించింది. సానుభూతి, స్థానికంగా ఆమె కుటుంబానికి ఉన్న పట్టు ఇందుకు కారణాలు.
కాంగ్రెస్ తరపున మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు 22.72% మద్దతు, మరో అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 15.90% మద్దతు ఉన్నట్లు సర్వేలో తేలింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 4.54% మద్దతు లభించింది.
ఈ సర్వే ఫలితాలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీని సూచిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ కే స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది. ఈ ఎన్నికల ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది.