జూబ్లీహిల్స్ తెరపైకి విజయారెడ్డి.. అక్కాతమ్ముళ్ల సమరమేనా?
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రసవత్తరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక అనివార్యంగా మారింది.;
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రసవత్తరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక అనివార్యంగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారా? లేదా? అన్నది స్పష్టం కావడంలేదు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్ తన కుటుంబ సభ్యులను ఎప్పుడూ రాజకీయాల్లో ప్రోత్సహించలేదు. దీంతో త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో గోపీనాథ్ వారసులు బరిలో నిలిచే పరిస్థితి లేదన్న చర్చ జరుగుతోంది.
గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ నగరంలో మాత్రం మొండిచేయి చూపింది. నగరంలో కేవలం ఒక్కస్థానం మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయితే ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. దీంతో ఆ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నిక జరిగితే మూడు రంగుల జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ శ్రేణులు తహతహలాడుతున్నాయి.
2023లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీచేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు దాదాపు 90 వేల వరకు ఉండటంతో వ్యూహాత్మకంగా ఆయనను రంగంలోకి దింపింది కాంగ్రెస్. అయితే ఆయన అప్పటికే రెండుసార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ చేతిలో సుమారు 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు అనుకోకుండా ఉప ఎన్నిక జరుగుతుండటంతో మళ్లీ పోటీకి రెడీ అవుతున్నారు అజారుద్దీన్. కానీ, కాంగ్రెస్ ఈ దఫా అజారుద్దీన్ స్థానంలో మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డిని పోటీకి పెట్టాలని ఆలోచన చేస్తోందని ప్రచారం జరుగుతోంది.
విజయారెడ్డి గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒకప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. రాష్ట్ర విభజనకు ముందు ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి తండ్రి పి.జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించేవారు. ఆయన వారసురాలిగా విజయారెడ్డిని బరిలోకి దింపితే విజయం సాధించవచ్చని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. జనార్దన్ రెడ్డికి ప్రస్తుత జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో అనుచరులు ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం విజయారెడ్డి ఖైరతాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నా, ఇప్పుడు అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడంతో విజయారెడ్డికి ప్రత్యామ్నాయం చూపినట్లు కూడా అవుతుందని అంటున్నారు.
మరోవైపు ఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయారెడ్డికి విష్ణు స్వయాన సోదరుడు. అయితే వీరిద్దరి మధ్య అంతగా సంబంధాలు లేవని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదన్న కారణంగా విష్ణు కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం జరగబోయే ఉప ఎన్నికకు ఆయనే బీఆర్ఎస్ అభ్యర్థి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అదే జరిగితే జూబ్లీహిల్స్ వేదికగా అక్కాతమ్ముడు మధ్య సమరం జరగనుందని అంటున్నారు. రాజకీయాల్లో ఓటమే ఎరుగని మాజీ మంత్రి జనార్దన్ రెడ్డి వారసులు చాలా కాలంగా గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో అయినా వారి ఆశ తీరుతుందా? లేదా? అన్నది ఎదురుచూడాల్సివుంది.