ట్రూడో గత చరిత్ర అంతా గొడవలమయమే!

కెనడా ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యను భారత్‌ పైకి తోసి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే.

Update: 2023-09-19 23:30 GMT

కెనడా ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యను భారత్‌ పైకి తోసి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే. రెండు దేశాలు ఒకరి రాయబారిని మరొకరు బహిష్కరించేవరకు ఈ వ్యవహారం దారితీసింది. కాగా జస్టిన్‌ ట్రూడో గత చరిత్ర కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదని.. ఆయన రాజకీయ జీవితంలో జగడాలెన్నో ఉన్నాయని చెబుతున్నారు. గొడవలతో ఆయన ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారని గుర్తు చేస్తున్నారు.

2015లో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలుమార్లు జస్టిన్‌ ట్రూడోను వివాదాలు చుట్టుముట్టాయి. భారత్‌ పర్యటనలో విమర్శలు..కెనడా పార్లమెంట్‌ లో మహిళా ఎంపీని తోసేయడం ఇలా అనేక వివాదాల్లో ఆయన ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల భారత్‌ కు వచ్చిన జస్టిన్‌ ట్రూడోను భారత్‌ ప్రభుత్వం లైట్‌ తీసుకుందని వార్తలు వచ్చాయి.

2016లో ట్రూడో ఓసారి పార్లమెంట్‌ లో అనుచితంగా ప్రవర్తించారు. విపక్ష నేతలు ఆరోపణలు చేస్తుండటంతో ఒక ప్రతిపక్ష నాయకుడిపై ఆయన ఆగ్రహంతో దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ మహిళా ఎంపీని ఆయన నెట్టేయడం వివాదానికి కారణమైంది. ట్రూడో మోచేయి మహిళా ఎంపీ ఛాతీని బలంగా తాకింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇక 2016లో ప్రముఖ బిలియనీర్‌ ఆగాఖాన్‌ కు చెందిన ఓ ఎక్స్‌క్లూజివ్‌ దీవిలో ప్రధాని హోదాలో జస్టిన్‌ ట్రూడో సెలవులు గడపటానికి వెళ్లారు. అయితే, సొంత ప్రయోజనాల కోసమే ఆయన అక్కడకు వెళ్లారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆగాఖాన్‌ ఫౌండేషన్‌.. ట్రూడోకు లాబీ కంపెనీ అని ఆరోపణలు వెల్లువెత్తాయి.

అలాగే 2018 ఫిబ్రవరిలో ట్రూడో కుటుంబం ఎనిమిది రోజుల పాటు భారత్‌ ను సందర్శించింది. ఆయన గౌరవార్థం భారత్‌ లోని కెనడా హైకమిషన్‌ ఇచ్చిన విందుకు మాజీ ఖలిస్థానీ ఉగ్రవాది జస్పాల్‌ అత్వాల్‌ ను ట్రూడో ఆహ్వానించారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత్‌ కూడా ఆయన పర్యటనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో అధికారిక కార్యక్రమాల కంటే భారత్‌ లో పర్యాటక ప్రదేశాల సందర్శనకే ట్రూడో సమయం వెచ్చించాల్సి వచ్చింది.

అదేవిధంగా 2018లో భారత్‌ పర్యటనలో ట్రూడో సిక్కుల మాదిరిగా కుర్తా, పైజమాలో కనిపించారు. భారత్‌ అధికారులతో సమావేశంలోనూ ఇలాంటి దుస్తుల్లోనే ఆయన దర్శనమిచ్చారు. కెనడాలో భారీ ఎత్తున సిక్కు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇలా చేశారని విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇక 2019లో ట్రూడో ప్రభుత్వం నైతిక చట్టాలను ఉల్లంఘించిందని కెనడా స్వతంత్ర ఎథిక్స్‌ కమిషనర్‌ కార్యాలయం బాంబుపేల్చింది. 2018లో ఎన్‌ఎన్‌సీ లవాలిన్‌ అనే నిర్మాణ సంస్థపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ గ్రూప్‌ పై దర్యాప్తు చేపట్టాలని ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు నిర్ణయించారు. అయితే ఈ దర్యాప్తును ట్రూడో ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించిందని ఎథిక్స్‌ కమిషన్‌ తన నివేదికలో తప్పుబట్టింది. దీన్ని ట్రూడో కూడా అంగీకరించడం గమనార్హం. అయితే వేలాది ఉద్యోగాలను కాపాడేందుకే తాను ఆ పని చేసినట్లు ఆయన తన చర్యను సమర్థించుకున్నారు. నైతిక చట్టాలను ఉల్లంఘించారని నిర్ధారణ అయిన తొలి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోనే కావడం గమనార్హం.

2018లోనే ట్రూడో ఆధ్వర్యంలో లిబరల్‌ పార్టీ నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఓ మహిళ ఆందోళన చేపట్టింది. కెనడాలో జీవన స్థితిగతులు దిగజారుతున్నాయని గళమెత్తింది. దీంతో ఆమెను బలవంతంగా అక్కడి నుంచి తరిమేయడమే కాకుండా ట్రూడో ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఇక ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు హాజరైన జస్టిన్‌ ట్రూడో తొలిరోజు నిర్వహించిన విందుకు కూడా ఆయన హాజరు కాలేదు. ఆ తర్వాత ప్రపంచ దేశాధినేతలు రాజ్‌ ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించే సమయంలో కూడా ట్రూడో ఎవరితో పెద్దగా కలవలేదు. అంతేకాకుండా భారత ప్రధాని మోదీ.. భారత్‌ వ్యతిరేక శక్తులకు కెనడాలో ఆశ్రయం లభిస్తుందని.. ఇది తమకు నచ్చడం లేదని నేరుగా ట్రూడోకి చెప్పేశారు.

ట్రూడో జీ20 పర్యటనపై కెనడాలో సైతం విమర్శలు వచ్చాయి. సదస్సులో మిగిలిన దేశాధినేతలు ఆయన్ని పట్టించుకోలేదని.. ఇది అవమానకరమని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

Tags:    

Similar News