'బోయింగ్ బోరుకు'.. మాజీ ఉద్యోగి విజిల్ బ్లోయింగ్.. అనుమానాస్పద మృతి
తిరుగు ప్రయాణం కావాల్సిన సమయంలో స్టార్ లైనర్ లో సమస్యతో ఆగిపోయారు. కొన్ని నెలల పాటు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు.;

భారత విమానయాన చరిత్రలో గురువారం అత్యంత దుర్దినంగా మిగిలిపోయింది.. ఎన్నడూ లేనంత స్థాయిలో ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ టేకాఫ్ లో కూలిపోయి 290 మంది మరణానికి కారణమైంది. దీంతో బోయింగ్ సంస్థ విమానాలపై చర్చ మొదలైంది. ఇప్పుడే కాదు.. కొంతకాలంగా బోయింగ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ బోయింగ్ కంపెనీ స్టార్ లైనర్ లో గత ఏడాది స్వల్ప కాల పర్యటనకు అంతరిక్షంలోకి వెళ్లారు. తిరుగు ప్రయాణం కావాల్సిన సమయంలో స్టార్ లైనర్ లో సమస్యతో ఆగిపోయారు. కొన్ని నెలల పాటు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు.
ఇలా బోయింగ్ సంస్థపై ఒక్కటి రెండు కాదు.. ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా గురువారం ప్రమాదానికి గురైన డ్రీమ్ లైనర్ తరహా విమానాలపై ఆ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ గతంలోనే హెచ్చరించారు. అయితే, ఆ తర్వాత ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు. విజిల్ బ్లోయర్ అయిన బార్నెట్ బోయింగ్ సంస్థపై తీవ్ర ఆరోపణల అనంతరం చనిపోవడం చర్చనీయాంశమైంది. బార్నెట్ వయసు కూడా 62 ఏళ్లే. మూడు దశాబ్దాలకు పైగా బోయింగ్ లో పనిచేసి 2017లో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత తమ సంస్థపై న్యాయం పోరాటం మొదలుపెట్టారు. ఇక బార్నెట్.. డ్రీమ్ లైనర్ ను తయారుచేస్తున్న నార్త్ చార్లెస్టన్ ప్లాంట్ లో 15 ఏళ్లు క్వాలిటీ మేనేజర్ గా బాధ్యతలు నిర్వర్తించడం గమనార్హం.
పదవీ విరమణ పొందిన రెండేళ్లకు.. అంటే 2019లో బార్నెట్.. ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. సరిగా లేని భాగాలను బోయింగ్ విమానంలో అమర్చారని ఆరోపించారు. ఇదంతా కావాలనే చేశారని పేర్కొన్నారు. విమానం ఆక్సిజన్ వ్యవస్థలోనూ లోపాలను ఎత్తిచూపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నాలుగు ఆక్సిజన్ మాస్క్ లలో ఒకటి పనిచేయడం లేదని పేర్కొన్నారు.
అసలు డ్రీమ్ లైనర్ అసెంబ్లింగ్ కూడా అమెరికాలోని సౌత్ కరోలినాలో హడావుడిగా చేశారని.. ఈ క్రమంలో భద్రతపై రాజీ పడ్డారని ఆరోపించారు. లోపాలున్న భాగాలను ట్రాక్ చేయడంలో కార్మికులు విఫలం కావడంతో.. అవి కనిపించకుండా పోయినట్లు తెలిపారు. త్వరత్వరగా తయారీకి.. నాణ్యత లేని భాగాలను వాడారని, దీనిపై సంస్థకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని బార్నెట్ పేర్కొన్నారు. కాగా, ఈయన ఆరోపణలను బోయింగ్ సంస్థ ఖండించింది. అయితే, ఫెడరల్ ఏవియేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం సమర్థించింది. ఇక నిరుడు మార్చి 9న బార్నెట్ దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్ లో ఓ హోటల్ ముందు తన పికప్ ట్రక్ లో చనిపోయి కనిపించారు. అతడి తలపై తుపాకీ గాయం ఉంది. ఇది కూడా బోయింగ్ పై తన ఆరోపణల కేసులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధం అవుతుండగా కావడం గమనార్హం. బార్నెట్ కుడి చేతిలో తుపాకీ ఉండడంతో ఇది ఆత్మహత్యగా పోలీసులు పేర్కొన్నారు. ఆయన ట్రక్ లో దొరికిన లేఖలో.. బోయింగ్ మూల్యం చెల్లించాల్సి ఉందని రాయడం గమనార్హం.