పాక్ ఆగడాలకు చెక్..జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు ప్రజల కోసం వేల సంఖ్యలో సీక్రెట్ బంకర్స్

పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో చేస్తున్న దాడులకు దీటుగా అక్కడి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది.;

Update: 2025-05-14 09:30 GMT

పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో చేస్తున్న దాడులకు దీటుగా అక్కడి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు దాదాపు 9,500 ప్రత్యేకమైన బంకర్లను ఏర్పాటు చేసినట్లు చీఫ్ సెక్రటరీ అటల్ దుల్లూ స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఆయన రాజౌరీలోని సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించి, పాక్ శతఘ్ని గుండ్ల వర్షానికి గురైన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భవిష్యత్తులో కూడా సరిహద్దు ప్రజల భద్రత కోసం మరిన్ని బంకర్లు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అటల్ దుల్లూ మాట్లాడుతూ.. "పాక్ దళాలు సరిహద్దుల్లో నివసిస్తున్న అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న దృశ్యాలను మీరందరూ వీక్షించారు. ఈ దాడుల్లో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అంతేకాకుండా, అనేక పశువులు మరణించాయి. ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.

'ఆపరేషన్ సిందూర్‌' ముగిసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పాకిస్తాన్ దళాలు రెచ్చిపోయి విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో అనేక ప్రార్థనా మందిరాలు కూడా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా కుప్వారా, ఉరి, పూంఛ్ ప్రాంతాలు పాక్ షెల్లింగ్‌తో నిత్యం భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

స్థానిక అధికారులు మాత్రం ప్రజలకు సహాయం అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. పరిస్థితిని వేగంగా అంచనా వేసి, బాధితులకు తక్షణ సహాయం అందించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ అటల్ దుల్లూ ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం సరిహద్దు వెంబడి 9,500 బంకర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రజల నుండి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని బంకర్ల నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, అంతకుముందు రాజౌరీలోని పలు గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న పేలని బాంబులు, శతఘ్ని గుండ్లను భారత సైన్యం ఎంతో చాకచక్యంగా నిర్వీర్యం చేసింది.

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం టంగ్దార్‌లోని షెల్లింగ్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి ప్రజలు ఏర్పాటు చేసుకున్న కమ్యూనిటీ బంకర్లను సందర్శించి వారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. నష్టం యొక్క తీవ్రతను స్వయంగా తెలుసుకున్న ఆయన, ప్రభుత్వం బాధితులకు తప్పకుండా న్యాయమైన పరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

సైనిక ఘర్షణల భయానక ఛాయల నుండి నెమ్మదిగా జమ్మూకశ్మీర్ కోలుకుంటోంది. మూతబడిన పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్లు మళ్లీ సందడిగా మారుతున్నాయి. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం విమాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. కుప్వారా, బారాముల్లా ప్రాంతాలు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రానప్పటికీ, మిగిలిన అన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలు మంగళవారం నుండి యథావిధిగా పనిచేయడం మొదలుపెట్టాయి. కాశ్మీర్ విశ్వవిద్యాలయం కూడా బుధవారం నుండి తరగతులు ప్రారంభించనుంది. అయితే సరిహద్దుల్లో మాత్రం ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, శాంతిని నెలకొల్పడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది.

Tags:    

Similar News