మీకు దండాలు సామీ.. జేసీ ప్రభాకర్ రెడ్డి గాంధీ గిరి!!

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఫైర్ బ్రాండ్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్టైలే వేరు. ఆయనకు కోపం వచ్చిందంటే అవతల ఎవరు ఉన్నారు? ఏ స్థాయి వారు అన్నది పట్టించుకోకుండా ఎడాపెడా తిట్టేస్తారని జేసీపై ఫిర్యాదులు చేస్తుంటారు.

Update: 2026-08-14 16:47 GMT

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఫైర్ బ్రాండ్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్టైలే వేరు. ఆయనకు కోపం వచ్చిందంటే అవతల ఎవరు ఉన్నారు? ఏ స్థాయి వారు అన్నది పట్టించుకోకుండా ఎడాపెడా తిట్టేస్తారని జేసీపై ఫిర్యాదులు చేస్తుంటారు. అందుకే ఆయనతో ఎందుకొచ్చింది గొడవ అంటూ సొంత పార్టీ నేతలు, అధికారులు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారని చెబుతున్నారు. ఇక సాధారణ ప్రజలు కూడా అంతే జేసీ విషయంలో ఆచితూచి ప్రవర్తిస్తారని, పెద్దాయనకు కోపం తెప్పించే పనులు చేయడానికి చాలా దూరంగా ఉంటారు. ఈ వ్యవహారశైలి కారణంగానే జేసీకి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందనే అభిప్రాయం ఉంది.

అయితే తన సహజ స్వభావానికి భిన్నంగా జేసీ వ్యవహరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మనుగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా కాలంగా పట్టణంలోని రోడ్లు, ఫుట్ పాత్ ల ఆక్రమణలపై అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఆక్రమణల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై చాలా సార్లు అధికారులకు చెప్పిచూసినా వ్యాపారులు పట్టించుకోవడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా రంగంలోకి దిగారు.

రోడ్లపై ఆక్రమణలను బలవంతంగా తొలగిస్తే చిరు వ్యాపారులు నష్టపోతారని, అదే సమయంలో వారిని అలా వదిలేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోతున్నాయని భావనకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న పంథా ఎంచుకున్నారు. తన స్టైల్ లో చెప్పడం వల్ల చిరు వ్యాపారులు బెదిరిపోతారని గ్రహించారో ఏమో ఒక్కసారిగా గాంధీ గిరికి మారిపోయారు. రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారి వద్దకు వెళ్లి పూలమాల వేస్తూ, స్వీట్లు పంచుతూ స్వచ్ఛందంగా ఆక్రమణల నుంచి వైదొలగాలని కోరారు.

జేసీ సహజ శైలికి భిన్నంగా గాంధీగిరి చేయడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. వ్యాపారుల మెడలో పూల దండ వేయడమే కాకుండా, స్వీట్లు పంచి చెబుతున్నా రోడ్డుకు అడ్డంగా పార్కింగులు లేకుండా చూసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. స్వీట్లు ఇవ్వడమే కాకుండా, స్వీట్లు తినిపించి మరీ చెబుతున్నానని, మన ఊరుపై అందరూ బాధ్యతగా నడుచుకోవాలని హితవు పలికారు. ఇలా చెబుతున్నా మీరు వినకపోతే మరోసారి మీ కాళ్లు పట్టుకుంటానని ఆపై మీ ఇష్టం అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి శాంతివచనాలు చెప్పడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జేసీ రోడ్డుపైకి వచ్చారంటే ఏం జరుగుతుందోనని ఇటు టీడీపీ అధిష్టానం నుంచి నియోజకవర్గంలో పనిచేసిన అధికారులు హడలిపోతుంటారు. అయితే ఈ సారి ఆయన గాంధీగిరితో ఆకట్టుకోవడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News