జగన్ లాగానే కేటీఆర్ పాస్ పోర్టు సీజ్ కానుందా?
ఇప్పుడు తాజాగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోపాటు పలువురు కీలక అధికారులపై ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది.
తెలంగాణలో అసలు ఊహించని రాజకీయం నడుస్తోంది. అధికార పార్టీని డిఫెన్స్ లో పడేసేలా ప్రతిపక్షం బీఆర్ఎస్ ఏదో ఒక బలమైన అంశాన్ని ఎంచుకోవడం.. దాన్ని ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ మరో అంశంతో ప్రతిపక్షాన్ని కొట్టి డైవర్ట్ చేయడం.. ఇలా సాగుతోంది రాజకీయం.. ఇటీవల 22 ఏ భూముల వివాదంపై అసెంబ్లీని కుదిపేయాలనుకున్న బీఆర్ఎస్ కు కేసీఆర్ ఫాంహౌస్ భూములను తెరపైకి తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడేశాడు.
ఇప్పుడు తాజాగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోపాటు పలువురు కీలక అధికారులపై ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఏసీబీ తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం కేసును తీవ్రమైన మలుపు తిప్పింది. నిందితుల పాస్ పోర్టులను స్వాధీనం లేదా రద్దు చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు అందరి దృష్టి కేటీఆర్ పాస్ పోర్టుపై పడింది.
ఫార్ములా ఈ రేస్ కేసులో నిధుల మళ్లింపు, ప్రభుత్వ అనుమతుల ఉల్లంఘనలు.. నిబంధనలకు విరుద్దంగా చెల్లింపులు జరిగాయనే ఆరోపణలపై ఏసీబీ విచారణ జరుపుతోంది. అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, అప్పటి పురుపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఏఎల్ నిరంజన్ రెడ్డి, జి కిరణ్ మల్లేశ్వరరావులతోపాటు ఫార్ములా ఆపరేషన్స్ ప్రతినిధి అల్బర్టో లాంగో నిందితులుగా ఉన్నారు.
దీంతో ఈ కేసులో ఊహించని స్టెప్ తీసుకుంది ఏసీబీ.. నిందితులు దేశం విడిచి వెళ్లకుండా దర్యాప్తు ను నిరోధించకుండా నలుగురు స్వదేశీ నిందితుల పాస్ పోర్టులను సరెండర్ చేసుకోవాలని కోర్టును కోరింది. కేటీఆర్ తో సహా నలుగురి పాస్ పోర్టుల అంశమే ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.
ఒకవేళ ఏసీబీ కోర్టు ఆమోదం తెలిపితే.. నిందితులు విదేశాలకు వెళ్లే స్వేచ్ఛను కోల్పోతారు. ప్రతీసారి విదేశీ ప్రయాణం కోసం కోర్టు అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. ఈ పరిణామం వైసీపీ అదినేత జగన్ కేసులను గుర్తు చేస్తోందని.. కేటీఆర్ ను కూడా అదేలా ఎదుర్కొనేలా చేస్తుందని విశ్లేషఖులు భావిస్తున్నారు.
ఇప్పటివరకూ కోర్టులో వాదనలు వినిపిస్తున్న కేటీఆర్ కు ఇది కొత్త సవాల్. ఏసీబీ విజ్ఞప్తిని కోర్టు అంగీకరిస్తుందా? కేటీఆర్ దీనికి కౌంటర్ వాదనలు వినిపిస్తారా? జగన్ లాగానే కేటీఆర్ కు విదేశీ ప్రయాణ చిక్కులు ఎదురవుతాయా? అనేది కోర్టు ఇచ్చే ఉత్తర్వుల్లోనే వెలువడనుంది.