మోస్ట్ వాంటెడ్ వెప‌న్.. భార‌త్ కు అమెరికా దేవ దూత‌

అమెరికాతో కుదిరిన ర‌క్ష‌ణ డీల్ ప్ర‌కారం.. భార‌త్ పొంద‌నున్న ఆయుధాల్లో అత్యంత కీల‌క‌మైన‌ది జావెలిన్.;

Update: 2025-11-20 11:30 GMT

ఏనుగు లాంటి ర‌ష్యా ముంగిట చిట్టెలుక లాంటి ఉక్రెయిన్ ఇన్ని రోజులుగా ఎలా నిలిచింది... ర‌ష్యాను ఓ ద‌శ‌లో అత్యంత చికాకు పెట్టింది కూడా...! శ‌త్రుదేశానికి చెందిన ప‌దుల సంఖ్యంలో ట్యాంక‌ర్ల‌ను పేల్చేసింది.. దీంతో ఉక్రెయిన్ ను కేవ‌లం రోజుల వ్య‌వ‌ధిలో ఓడించ‌గ‌ల‌మ‌ని భావించిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ కు దిమ్మ‌తిరిగింది. చివ‌ర‌కు అణ్వాయుధాల ప్ర‌యోగం అనే మాట‌ను వాడి ఆయ‌న త‌న అహం చ‌ల్లార్చుకున్నారు. ఇంత‌కూ ఏమిటా ఆయుధం అంటే..? అదొక కేవ‌లం క్షిప‌ణి. అంత‌మాత్రాన దాన్నేమీ తేలిగ్గా కొట్టేయ‌లేం..! ప్ర‌పంచ వ్యాప్తంగా దానికి అంత ఆద‌ర‌ణ ఉంది మ‌రి..! ఇక భార‌త్ తో అమెరికా ఈ ఆయుధంతో పాటు మ‌రికొన్ని కొనుగోలుకు కుదుర్చుకున్న డీల్ విలువ దాదాపు వంద‌ మిలియ‌న్ డాల‌ర్లు కావ‌డం గ‌మ‌నార్హం.

భుజం పైనుంచే ప్ర‌యోగం..

అమెరికాతో కుదిరిన ర‌క్ష‌ణ డీల్ ప్ర‌కారం.. భార‌త్ పొంద‌నున్న ఆయుధాల్లో అత్యంత కీల‌క‌మైన‌ది జావెలిన్. దీనిని భుజంపై నుంచి గురిపెట్టి ప్ర‌యోగించ‌వ‌చ్చు. ర‌ష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ కు ఇది చాలా ప‌నికొచ్చింది. వంద‌ల కొద్దీ ర‌ష్యా ట్యాంక‌ర్ల‌ను ధ్వంసం చేయ‌డంతో జావెలిన్ ను దేవ దూత అంటూ పోల్చేవారు. ట్యాంక్ విధ్వంస‌క క్షిప‌ణి అయిన జావెలిన్.. 3.7 అడుగులు మాత్ర‌మే ఉంటుంది. డిస్పోజ‌బుల్ లాంచ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. దీనిని శ‌త్రు సెన్సార్లు గుర్తించ‌లేవు. స‌హ‌జంగా అయితే, ట్యాంక్ విధ్వంస‌క క్షిప‌ణి ప్ర‌యోగం త‌ర్వాత పొగ‌, వేడి వ‌స్తాయి. జావెలిన్ అలాంటిదేమీ ఉండ‌దు. ట్యూబ్ నుంచి మోటార్ ఈ క్షిప‌ణిని విసిరాక‌.. క్షిప‌ణి మోటార్ ప‌ని చేస్తుంది. టార్గెట్ వైపు ప్ర‌యాణిస్తుంది. అంతా కంప్యూట‌ర్ ఆప‌రేష‌నే. అస‌లు దీనిని క‌చ్చితంగా ఎక్క‌డినుంచి ప్ర‌యోగించిన‌దీ కూడా క‌నిపెట్ట‌లేం. ఒక‌వేళ గుర్తించినా ఈలోపు భుజంపై నుంచి ప్ర‌యోగించిన‌ సైనికులు దాక్కోవ‌చ్చు.

-అమెరికా డిఫెన్స్ దిగ్గ‌జాలు లాక్ హీడ్ మార్టిన్, రేథియాన్ సంస్థ‌లు దీనిని డెవ‌ల‌ప్ చేశాయి. 2 ల‌క్ష‌ల డాల‌ర్ల విలువైన దీని ఉత్ప‌త్తి చాలా క్లిష్టం. ర‌ష్యాను నిలువ‌రించేందుకు అమెరికా వీటిని ఉక్రెయిన్ కు అంద‌జేసింది. దీన్నుంచి ట్యాంకుల‌ను కాపాడేందుకు ర‌ష్యా సైన్యం ఇనుపు బోన్లు అమ‌ర్చింది. దీంతో ఉక్రెయినియ‌న్లు దీనిని దేవ దూత అని పిలవ‌డం మొద‌లుపెట్టారు. త‌మ పిల్ల‌ల‌కూ జావెలిన్, జావెలినా అనే పేర్లు పెట్టారు. 93 మిలియ‌న్ డాల‌ర్ల విలువైన అమెరికా ఒప్పందంలో స‌గం 45.7 మి.డా. జావెలిన్ కొనుగోలుపైనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News