ఒక్క సెకన్‌లో నెట్‌ఫ్లిక్స్ డేటా మొత్తం డౌన్‌లోడ్! కొత్త ఆవిష్కరణ
ఇంటర్నెట్ వేగం గురించి మనం ఆలోచించినప్పుడు కొన్ని Mbps (మెగాబిట్స్ పర్ సెకన్) నుండి కొన్ని Gbps (గిగాబిట్స్ పర్ సెకన్) వరకు మాత్రమే ఊహించగలం;
ఇంటర్నెట్ వేగం గురించి మనం ఆలోచించినప్పుడు కొన్ని Mbps (మెగాబిట్స్ పర్ సెకన్) నుండి కొన్ని Gbps (గిగాబిట్స్ పర్ సెకన్) వరకు మాత్రమే ఊహించగలం. కానీ, జపాన్ శాస్త్రవేత్తలు మన ఊహలకు అందని వేగంతో ఇంటర్నెట్ డేటాను బదిలీ చేస్తూ ప్రపంచ రికార్డు సృష్టించారు. వారు 1.02 పెటాబిట్స్ పర్ సెకన్ (Pbps) అనే అపూర్వమైన వేగాన్ని సాధించి భవిష్యత్తులో డేటా బదిలీ ఎలా ఉంటుందో అనే దానికి మార్గం సుగమం చేశారు.
ఈ వేగం అంటే ఎంత?
1.02 పెటాబిట్స్ అంటే సుమారు 1,02,000 గిగాబిట్స్! ఈ వేగంతో నెట్‌ఫ్లిక్స్‌లోని మొత్తం వీడియో లైబ్రరీని కేవలం ఒక్క సెకనులో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంతేకాదు సుమారు 150 GB పరిమాణం ఉన్న భారీ వీడియో గేమ్‌లు కూడా రెప్పపాటులో డౌన్‌లోడ్ అవుతాయి.భారతదేశ సగటు ఇంటర్నెట్ వేగం 63.55 Mbpsతో పోలిస్తే, జపాన్ సృష్టించిన ఈ వేగం దానికంటే 16 మిలియన్ల రెట్లు వేగవంతమైనది. ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం.
ఈ అద్భుతం సాధ్యమైంది ఎలా?
ఈ ప్రాజెక్టును జపాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (NICT), సుమిటోమో ఎలక్ట్రిక్, కొన్ని యూరోపియన్ సంస్థలు కలిసి చేపట్టాయి. వీరు రూపొందించిన 19-కోర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఈ అద్భుతానికి ప్రధాన కారణం.
టెక్నాలజీ హైలైట్స్
ఈ కేబుల్‌లో 19 వేర్వేరు లైట్ పాత్‌లు ఉంటాయి.సాధారణ ఆప్టికల్ ఫైబర్ లా కనిపించినా ఇది 19-లేన్ల సూపర్ హైవే లాగా పని చేస్తుంది. ఇది 1,808 కిలోమీటర్ల దూరం వరకు డేటాను బదిలీ చేయగలదు. ఇది లండన్ నుండి రోమ్ వరకు ఉన్న దూరానికి సమానం. సిగ్నల్ నష్టం లేకుండా డేటా పంపించడానికి అధునాతన యాంప్లిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించారు.
- ఇది భవిష్యత్‌కు దారి చూపిస్తుందా?
ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రయోగశాల దశలోనే ఉంది. కానీ డేటా వాడకం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆవిష్కరణ భవిష్యత్ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలలో విప్లవాత్మక మార్పులు తేనుంది. ముఖ్యంగా, 6G, హైఎండ్ క్లౌడ్ కంప్యూటింగ్, AI, VR, AR వంటి సాంకేతిక అవసరాలకు ఇది కీలకం అవుతుంది.
ఇది కేవలం వేగం గురించి మాత్రమే కాదు, భవిష్యత్తు డిజిటల్ ప్రపంచానికి సరికొత్త దారితీసే ఆవిష్కరణ. డేటా యుగంలో ఇది మరొక దశకు అడుగుపెట్టిన సూచన. ఎప్పటికైనా, మన చేతుల్లోనూ 1 Pbps ఇంటర్నెట్ రానుందనే ఆశతో ఎదురుచూడొచ్చు!