నాలుగు రోజులే వర్క్...మూడు రోజులు హాలీ డేస్
వారానికి ఒక్క రోజే హాలీ డే. బాబోయ్ ఈ ఒక్క రోజూ ఎన్నో పనులు. ఎలా అడ్జస్ట్ చేసుకోవడం అని ఉద్యోగ కార్మిక లోకం అంతా మధన పడుతున్న తీరుని అంతా చూస్తూ వస్తున్నారు.;
వారానికి ఒక్క రోజే హాలీ డే. బాబోయ్ ఈ ఒక్క రోజూ ఎన్నో పనులు. ఎలా అడ్జస్ట్ చేసుకోవడం అని ఉద్యోగ కార్మిక లోకం అంతా మధన పడుతున్న తీరుని అంతా చూస్తూ వస్తున్నారు. నిజానికి ఆదివారం హాలీడే అన్నది బ్రిటిష్ వారు పాలనలో ఈ దేశంలో ప్రవేశపెట్టారు అనేక కార్మిక చట్టాలు కూడా అపుడే వచ్చాయి. వాటిని ఎంతో కొంత మార్చి గత ఎనభయ్యేళ్ళుగా ఈ దేశంలో అమలు చేస్తున్నారు. ఇక రెండవ శనివారం తో కలుపుకుని నెలకు అయిదు రోజులు మాత్రమే ఈ దేశంలో హాలీ డేస్ ఉన్నాయి. మిగిలినవి అన్నీ వర్కింగ్ డేస్ గానే పరిగణిస్తున్నారు. అలాగే రోజుకు ఎనిమిది గంటల పని విధానం కూడా దేశంలో అమలులో ఉంది.
ఇతర దేశాలలో చూస్తే :
ఇదిలా ఉంటే ఈ దేశంలో అనేక కంపెనీలలో వారానికి రెండు రోజుల సెలవు విధానం అమలులో ఉంది. ముఖ్యంగా అనేక ప్రైవేట్ కంపెనీలు ఐటీ సెక్టార్ లో ఈ విధానం అమలు చేస్తున్నాయి. అలా వారానికి అక్కడ అయిదు రోజులు పని శని ఆదివారాలు సెలవుగా ఉంటోంది. బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా ప్రతీ నెలా రెండవ చివరి శనివారాలు సెలవుగా ఇస్తున్నారు. అలా వారికి ఆరు రోజులు సెలవులు అందుతున్నాయి. కానీ ప్రధానంగా చూస్తే అనేక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలలో మాత్రం వారానికి ఆరు రోజుల పని విధానం అమలులో ఉంది. ఇక ఇతర దేశాల విషయానికి వస్తే జపాన్ స్పెయిన్, జర్మనీ వంటి దేశాలలో అనేక కంపెనీలు సంస్థలలో వారానికి నాలుగు రోజుల పని విధానం అమలులో ఉంది. దాంతో అక్కడ పనిలో నాణ్యత పెరిగింది అని నివేదికలు ఉన్నాయి.
దేశంలో సైతం డిమాండ్ :
పని దినాలు ఎన్ని ఉండాలి సెలవులు ఎన్ని అన్న దాని మీద చాలా కాలంగా దేశంలో చర్చ సాగుతోంది. వారానికి ఒక రోజు సెలవు కాదు మరిన్ని కావాలి అన్నది కూడా మరో డిమాండ్ గా ఉంది. హాలీ డేస్ ఇస్తే శ్రమ పడినది అంతా మరచిపోయి మళ్ళీ పూర్తి ఉత్సాహంతో వర్క్ చేయడానికి కూడా ఉత్సాహంగా ఉంటారని మానసిక శాస్త్రవేత్తలు సైతం చెబుతున్న మాట. దాంతో భారత్ లోనూ ఇపుడు వారానికి నాలుగు వర్కింగ్ డేస్ అన్నది అమలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిని సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఆమోదించిన కొత్త కార్మిక చట్టాల కోడ్స్ లో పొందుపరచారు అని అంటున్నారు.
కొత్త లేబర్ కోడ్స్ లో ఏముంది :
ఇక కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కొత్త లేబర్ కోడ్స్ ని ఆమోదించింది ఇది నవంబర్ 21న అమలులోకి వస్తుందని కూడా ప్రకటించింది. దీని ప్రకారం గతంలో ఏకంగా 29 దాకా ఉన్న కార్మిక చట్టాలను అన్నింటినీ క్రోడీకరిస్తూ కుదిస్తూ నాలుగుకే పరిమితం చేశారు. దీఎంతో ఈ కొత్త చట్టాలు అభ్యుదయంగానే కాకుండా కార్మిక శ్రేయస్సుకి మేలు చేసేవిగా ఉంటాయని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పేర్కొంటోంది. కార్మికులకు సామాజిక భద్రత కూడా ఉంటుందని స్పష్టం చేసింది. కార్మికులకు పూర్తిగా మేలు చేసేలా వారికి రక్షణ భద్రత కల్పించేలా ఉంటాయని కూడా వెల్లడించింది.
రోజుకు పన్నెండు గంటలా :
అదే విధంగా వారానికి ఎన్ని రోజులు సెలవు ఇవ్వాలి ఎన్ని రోజులు వర్కింగ్ డేస్ ఉండాలి అన్నది ఈ కొత్త చట్టాలలో పొందు పరచారు. అదే విధంగా ఆప్షన్ కూడా ఇచ్చారు. రోజుకు పన్నెండు గంటల పని విధానం అని వస్తున్న వార్తలను సైతం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఖండిస్తోంది. అదే సమయంలో వారానికి తప్పనిసరిగా 48 గంటలు పని విధానం ఉండాలని పేర్కొంది. అంటే రోజుకు ఎనిమిది గంటలు వంతున వారంలో ఆరు రోజులు పనిచేయించుకుంటారా లేక రోజుకు పది గంటల వంతున్న పని చేయించుకుని వారానికి రెండు రోజులు సెలవు ఇస్తారా లేక రోజుకు పన్నెండు గంటలు పనిచేయించుకుని నాలుగు రోజులు వర్కింగ్ డేస్ గా ఉంచి మిగిలిన మూడు రోజులు సెలవు ఇస్తారా అన్నది ఆయా కంపెనీలకు విడిచిపెట్టింది. అయితే ఇవన్నీ మాండేట్ అయితే కాదని పేర్కొంది. వారానికి 48 గంటలు ఏ విధంగా సర్దుకోవాలో ఆయా సంస్థల యాజమాన్యాలే నిర్ణయించుకునేలా కొత్త చట్టాలలో ఉంది అని అంటున్నారు.
ఒవర్ డ్యూటీ అయితే :
ఇక రోజుకు ఎనిమిది గంటలు అంటూ వారానికి అరు రోజులు పనిచేయించినా మరో గంట ఒవర్ డ్యూటీ చేస్తే కచ్చితంగా ఓవర్‌టైమ్‌పై సాధారణ వేతనానికి రెట్టింపు రేటుతో చెల్లించాల్సి వస్తుందని కార్మిక శాఖ వెల్లడించింది అలాగే రోజుకు పన్నెండు గంటలు అని నిర్ణయించి వారానికి నాలుగు రోజులు పనిచేయించినా ఈ పన్నెండు గంటలలోనే విధుల మధ్యలో విరామం, స్ప్రెడ్ ఓవర్ వంటివి తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో మిత్స్, ఫ్యాక్ట్స్ అని ఈ నెల 12న ఒక కీలకమైన ట్వీట్ చేసింది.
ఇవీ కొత్త చట్టాలు :
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాల గురించి కూడా పూర్తి సమాచారం ఇలా ఉంది. 29 పాత కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా 4 లేబర్ కోడ్స్‌ను ఎన్ డీయే ప్రభుత్వం తీసుకుని వచ్చింది. నవంబర్ 21 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ కొత్త చట్టాలను చూస్తే కనుక వేతనాల కోడ్- 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్- 2020, సామాజిక భద్రతా కోడ్- 2020, వృత్తిపర భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్- 2020 గా పేర్కొంది. ఈ కొత్త కార్మిక చట్టాల వల్ల ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులకు కూడా రెగ్యులర్ సిబ్బందితో సమానంగా సెలవులు, మెడికల్ కవర్, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించేలా చర్యలు తీసుకుంది. అంతే కాదు వీరు గ్రాట్యుటీ పొందేందుకు సంవత్సరం సర్వీస్ చేస్తే సరిపోతుంది. గతంలో అయితే ఎక్కువ ఏళ్ళు పనిచేస్తేనే తప్ప వారికి గ్రాట్యూటీ వచ్చేది కాదు. ఇక మహిళలకు కూడా ఈ చట్టాలలో భద్రతను కల్పించారు.