కూట‌మి అలెర్ట్‌.. సీట్లు పెర‌గ‌వు..!

వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 50 వరకు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని తద్వారా తమకు ఇబ్బందులు ఉండవని ఆశలు పెట్టుకున్న నాయకులకు భారీ షాక్ తగిలింది.;

Update: 2025-12-14 14:30 GMT

వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 50 వరకు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని తద్వారా తమకు ఇబ్బందులు ఉండవని ఆశలు పెట్టుకున్న నాయకులకు భారీ షాక్ తగిలింది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో కులగణ‌న అనంతరం జన గణన ప్రారంభం కానున్నాయి. ఈ రెండు కూడా రెండు సంవత్సరాల పాటు జరగనున్నాయి. దీంతో నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చే అవకాశం లేదు. మరోవైపు పార్టీల పరంగా చూస్తే నాయకుల సంఖ్య ఎక్కువగా ఉంది.

ముఖ్యంగా కూటమిలో అయితే మరింత ఎక్కువగా కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి జనసేన తరపున కనీసం 40 స్థానాలు తీసుకోవాలన్న ఆలోచన కూడా ఆ పార్టీ నాయకులు మధ్య అంతర్గత చర్చలో వినిపిస్తోంది. టిడిపిలో కూడా చాలామంది నాయకులు గత ఎన్నికల్లో త్యాగాలు చేశారు. ఇప్పుడు మరో 20 స్థానాల్లో జనసేనకు ఇస్తే ఆ 20 మంది తగ్గే అవకాశం ఉంది. ఇక బిజెపి విషయానికొస్తే గత ఎన్నికల్లో పది స్థానాలను తీసుకున్నారు. ఇప్పుడు కనీసం 20 స్థానాలు పట్టు పట్టే అవకాశం కనిపిస్తుంది.

మొత్తంగా చూస్తే సీట్ల సంఖ్య పెరగడం లేదు. మరోవైపు నాయకులు పార్టీల నుంచి డిమాండ్లు అయితే పెరుగుతున్నాయి. ఆవారా టిడిపికి ఇబ్బందికర పరిస్తితులు ఎదురుకానున్నాయి. ఇక మరోవైపు వైసీపీ ఒంటరి ప్రయాణానికి సిద్ధమైంది. అయినప్పటికీ ఆ పార్టీలో కూడా నాయకుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి తోడు అప్పటికప్పుడు పుట్టుకొచ్చే నాయకులు, సామాజిక వర్గాలు, కుల సమీకరణల ఆధారంగా తీసుకునే నిర్ణయాలను బట్టి నాయకుల సంఖ్య మరింత పెరుగుతుంది.

అయినప్పటికీ వైసీపీలో పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూటమిలో మాత్రం సీట్ల సంఖ్య పెరగకపోవ డంతో ఈ ప్రభావం కూటమి పార్టీలపై ప్రబ‌లంగా పడే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పటిప్పుడు దీనికి సంబంధించి చర్చ నడవక పోయినప్పటికీ పార్టీ నేతల్లో మాత్రం ఆశలు పెరుగుతున్నాయి. జనసేన 40 స్థానాలు దక్కించుకోవాలన్న వాదనైతే బలంగా ఉంది. బిజెపిలోను ఇదే చర్చ నడుస్తుంది. గత ఎన్నికల కన్నా ఎక్కువగా సీట్లు కావాలన్న విషయంపై నాయకులు ఇప్పటినుంచే దృష్టి పెట్టారు.

వాస్తవానికి సీట్ల సంఖ్య పెరుగుతుందని ముందు నుంచి అనుకున్నారు. దీంతో ఒకవేళ జనసేన, బిజెపి లకు ఎక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ ఇబ్బంది లేదని భావించారు. అసలు ఇప్పుడు టిడిపిలో నేత‌లు ఉన్న సంఖ్యకు సీట్ల సంఖ్యకు సంబంధం లేకపోవడం మెజారిటీ నాయకులకు కూడా గత ఎన్నికల‌లో టికెట్లు లభించక‌ ఇబ్బందులు పడిన పరిస్థితిని గమనిస్తే వచ్చే ఎన్నికల నాటికి అసలు సీట్లు పెరగకపోవడంతో పాటు నాయకుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు అన్న వాదన ఉంది.

ఈ నేపథ్యంలో పార్టీలు ముఖ్యంగా టిడిపి అలర్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ నాయకులకు కేవలం ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు పదవులు కావని.. నామినేటెడ్ పదవుల ద్వారా కొంతమందిని సర్దుబాటు చేసే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు. మొత్తానికి నియోజకవర్గాల పునర్విభజన లేకపోవడం కూటమికి ఇబ్బందికరంగానే మారింది అన్నది వాస్తవం.

Tags:    

Similar News