అక్కా.. గెటప్ మార్చుకుని నీతులు చెబితే వినాలా? కవితకు జనసేన కౌంటర్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించిన టీఆర్ఎస్ చీఫ్ కవితకు తెలంగాణ జనసేన నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించిన టీఆర్ఎస్ చీఫ్ కవితకు తెలంగాణ జనసేన నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. తీహార్ జైల్లో చిప్పకూడు తిని వచ్చిన కవిత 2.0 అంటూ నీతులు చెబితే తాము వినాలా? అంటూ జనసేన నేత ఆర్కే సాగర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ వాదం కోసం మాట్లాడుతున్న కవిత ఉద్యమంలో పిల్లలు తన్నులు తింటే ఎక్కడున్నారు? అంటూ ప్రశ్నించారు. ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు కమాయించుకోవచ్చని అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్ లో బ్యూటీపార్లర్ పెట్టుకోలేదా? అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలోని శిఖం భూములు ఆక్రమించడంతోపాటు తెలంగాణ బిడ్డలు డబ్బుతోనే ఆస్తులు పోగేసుకున్నారంటూ కవిత చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. దీనిపై ఘాటుగా స్పందించిన జనసేన తెలంగాణ నేతలు కవితపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
టీఆర్ఎస్ చీఫ్ కవిత చేసిన విమర్శలపై తెలంగాణ జనసేన నేత ఆర్కే సాగర్ ఎదురుదాడి చేశారు. కవిత మాటలు వింటుంటే దెయ్యాల వేదాలు వల్లించినట్లు ఉన్నాయంటూ మండిపడ్డారు. అవినీతి కేసులో తిహార్ జైలులో చిప్పకూడు తిన్నవారు చెప్పే నీతులు కూడా వినాల్సివస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కా.. ఎక్కడున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడు వచ్చారు? 2000 సంవత్సరంలో ఉస్మానియా వర్సిటీలో తన్నులు తిన్నప్పుడు ఎక్కడున్నారు అంటూ సాగర్ పదునైన ప్రశ్నలు సంధించారు.
ఇప్పుడు మీ ఆస్తి ఎన్ని కోట్లమ్మా? బుర్జుఖలీఫాలో ప్లాట్స్ ఎక్కడమ్మా? వందల కోట్లతో హోటల్స్ ఎక్కడ నుంచి వచ్చాయమ్మా? 50 ఎకరాల ఫాం హౌసులు ఎక్కడ నుంచి వచ్చాయి. తెలంగాణ అమరవీరుల సంగతేంటి? తెలంగాణ జాగృతి పేరుతో ఎంత డబ్బు వసూలు చేశారు? మీరు వసూలు చేసిన డబ్బుపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదు. మనం అందరినీ ప్రశ్నించవచ్చు కానీ, మనల్ని ఎవరూ ప్రశ్నించకూడదు అంటూ సాగర్ ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డగా ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
మీ పదేళ్ల పాలనలో కడుపు మండి, ఎవరూ మా వైపు లేరనే ఆవేదనతో పవన్ కల్యాణ్ ను తాము నెత్తిన పెట్టుకుని తెచ్చామని వ్యాఖ్యానించారు. కవిత విమర్శలకు దీటుగా జనసేన రీయాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో జనసేన వర్సెస్ టీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నెక్ట్స్ లెవల్ కి చేరుకుందని వ్యాఖ్యానిస్తున్నారు. జనసేనపై ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణతో మొదలైన వివాదం.. అటు తిరిగి ఇటు తిరిగి రాజకీయంగా పెను దుమారం రేపుతోందని అంటున్నారు. ఈ విషయంలో కవిత స్పందన కూడా చర్చనీయాంశం అవుతోంది. సొంతంగా పార్టీ పెట్టుకున్న కవిత.. జనసేనను అడ్డుపెట్టుకుని తెలంగాణ ప్రజల దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటే, తెలంగాణ జనసేన నేతలు కూడా అదే స్థాయిలో విరుచుకుపడటం హాట్ టాపిక్ అవుతోంది.