సిక్కోలులో ఈ సీట్లు జనసేనకు రిజర్వ్
ఉత్తరాంధ్రా జిల్లాల మీద జనసేన పెద్ద ఆశలే పెట్టుకుంది. ఎందుకంటే ఆ పార్టీకి ఉభయ గోదావరి జిల్లాల తరువాత ఎక్కువగా అభిమానం ఆదరణ చూపించే జిల్లాలుగా ఇవి ఉంటాయి.;
ఉత్తరాంధ్రా జిల్లాల మీద జనసేన పెద్ద ఆశలే పెట్టుకుంది. ఎందుకంటే ఆ పార్టీకి ఉభయ గోదావరి జిల్లాల తరువాత ఎక్కువగా అభిమానం ఆదరణ చూపించే జిల్లాలుగా ఇవి ఉంటాయి. పైగా అక్కడా 34 అసెంబ్లీ అయిదు ఎంపీ సీట్లు ఉంటే ఉత్తరాంధ్రాలోనే అదే నంబర్ ఉంది. దాంతో ఏపీలో పొలిటికల్ గా మ్యాజిక్ చేయాలీ అంటే జనసేనకు ఈ రెండు రీజియన్లూ ఎంతో కీలకంగా ఉంటాయని అంటున్నారు. అదే విధంగా జనసేన కూడా ఉత్తరాంధ్రా మీద ఎక్కడా ఫోకస్ తగ్గకుండా చూసుకుంటోంది.
మూడవ వంతుగా :
ఉత్తరాంధ్రా జిల్లాలు జనసేనకు 2024 ఎన్నికల్లో ఎంతో సహకరించాయి. ఆ పార్టీ మొత్తం గెలుచుకున్న 21 అసెంబ్లీ సీట్లలో ఆరు సీట్లు ఈ మూడు ఉమ్మడి జిల్లాలలోనే ఉన్నాయి. అంటే మూడవ వంతు సీట్లు అన్న మాట. అందులో విశాఖ నుంచి నాలుగు, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి చెరొకటి జనసేన గెలుచుకుంది. ఈసారి కూడా ఆ పట్టు నిలుపుకోవడమే కాదు రెట్టింపు చేసుకోవాలన్న ఆశతో ఆ పార్టీ ఉందని అంటున్నారు.
నాగబాబు రంగంలోకి :
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో రాజకీయం చేయడానికి కానీ కేంద్ర బిందువుగా కానీ పవన్ కళ్యాణే ఉన్నారు. ఆయన అక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఉత్తరాంధ్రా జిల్లాలలో జనసేనను బలోపేతం చేసేందుకు నాగబాబుని రంగంలోకి దించుతున్నారు. నాగబాబు కూడా తరచూ ఈ ప్రాంతాలలో పర్యటిస్తూ పార్టీ పటిష్టత మీద దృష్టి పెడుతున్నారు. తాజాగా ఆయన మూడు జిల్లాలలో పర్యటించి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించారు పార్టీ నాయకులతో కూడా భేటీ అయ్యారు. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు తెలుసుకున్నారు.
ఆ మూడు సీట్ల మీద :
ఇక శ్రీకాకుళం జిల్లాలో చూస్తే జనసేన మూడు సీట్ల మీద కన్ను వేసింది అని అంటున్నారు. ఇప్పటికే పాలకొండ సీటుని తన ఖాతాలో వేసుకుని తొలి ఎమ్మెల్యేను జిల్లా నుంచి పంపించిన జనసేన రెండవ సీటుగా ఎచ్చెర్ల మీద గురి పెట్టింది. అక్కడ బలమైన సామాజిక వర్గం ఉంది. దాంతో జనసేనకు అనుకూలంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీటుని బీజేపీకి కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో ఈ సీటు నుంచి జనసేన పోటీ చేయాలని చూస్తోంది అని అంటున్నారు.
పాతపట్నంతో బోణీ :
ఇక జనసేన మరో కీలక సీటు మీద కూడా గురి పెట్టింది అని అంటున్నారు. అదే పాతపట్నం సీటు. ఇక్కడ మొదటి నుంచి టీడీపీ కాంగ్రెస్ ల మధ్యనే పోరు ఉంది. 2014, 2019లలో వైసీపీ గెలిచింది. అలా ఆ పార్టీకి బలమైన స్థావరంగా ఈ సీటు ఉంది. అయితే 2024లో మాత్రం టీడీపీకి చెందిన మామిడి గోవిందరావు గెలిచారు. ఇక జనసేన ఈ సీటుని ఆ ఎన్నికల్లోనే కోరింది. కానీ పొత్తు ధర్మం కారణంగా కుదరలేదు. కానీ ఈసారి తప్పకుండా తీసుకుంటామని చెబుతున్నారు.
మహిళా నేత దూకుడు :
పాతపట్నంలో వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచే జనసేన మహిళా నేత ఒకరు సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయంగా ఆమె దూకుడు చేస్తున్నారు ఆమె భర్తకు కూడా నామినేటెడ్ పదవి దక్కింది. దాంతో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేతో సమాంతరంగా రాజకీయాన్ని చేస్తున్నారు. తమ పార్టీలోకి వైసీపీ అసంతృప్తులను ఆహ్వానిస్తూ ఫ్యాన్ పార్టీ బలాన్ని తగ్గించే పనిలో ఈ దంపతులు ఉన్నారని చెబుతున్నారు. అధినాయకత్వం వద్ద సైతం ఈ దంపతులకు మంచి పేరు ఉండడంతో వచ్చే ఎన్నికల్లో మహిళా నేతకు టికెట్ దక్కుతుందని అంటున్నారు. ఆ విధంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మొత్తం పది సీట్లలో మూడింటి నుంచి పోటీ చేయడమే కాదు పక్కగా గెలుచుకోవాలని జనసేన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకుందని అంటున్నారు.