జనసేనలో అన్యాయం జరుగుతోంది.. జనసేనాని ఒకసారి ఇటు చూడండి!

జనసేన పార్టీకి ఉమ్మడి గోదావరి జిల్లాలు కంచుకోట అనే అభిప్రాయం ఉంది. గత ఎన్నికల్లో జనసేనకు వెన్నుదన్నుగా గోదావరి తీరంలో ఓటర్లు నిలిచారు;

Update: 2025-05-20 21:30 GMT

జనసేన కంచుకోట గోదావరి తీరంలో పదవుల పంపకంపై అలజడి మొదలైందా? అగ్రవర్ణాలకే పార్టీలో అగ్రతాంబూలం దక్కుతోందని బీసీలు ఆవేదన చెందుతున్నారా..? పార్టీలో పదవులు అన్నీ ఒకే పార్టీకి కట్టబెడుతున్నారనే వార్తల్లో నిజమెంత? పార్టీలో బీసీ నేతల ఆవేదన, అసంతృప్తికి కారణమేంటి? ఇప్పటికే కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీతో లొల్లి పెరుగుతోందనే ఆందోళనల నడుమ బీసీ నేతల అసంతృప్తి జనసేనకు తలనొప్పిగా మారుతోందా? పార్టీ అధినేత, జనసేనాని పవన్ ఓ లుక్కేయాల్సిన స్టోరీ ఇది...

జనసేన పార్టీకి ఉమ్మడి గోదావరి జిల్లాలు కంచుకోట అనే అభిప్రాయం ఉంది. గత ఎన్నికల్లో జనసేనకు వెన్నుదన్నుగా గోదావరి తీరంలో ఓటర్లు నిలిచారు. ప్రధానంగా జనసేనాని పవన్ కూడా గోదావరి డెల్టా పరిధిలోని కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసి రికార్డు మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. పవన్ పోటీ ప్రభావంతో గోదావరి డెల్టాలోని మొత్తం ఐదు జిల్లాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఇక పార్టీ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉండటం, ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ పరపతి అపరిమితంగా ఉండటంతో జిల్లా రాష్ట్రస్థాయిలో పదవుల కోసం జనసేనలో ఎక్కువ మంది నేతలు పోటీ పడుతున్నారు. అయితే పార్టీలో ఎక్కువగా అగ్రవర్ణాలకు చెందిన ఒకటి రెండు కులాల వారికే అవకాశం దక్కుతోందనే అసంతృప్తి ఇటీవల ఎక్కువైందని టాక్ వినిపిస్తోంది.

ఇటీవల జనసేన నేతలకు కొన్ని పదవులు దక్కాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు అగ్రవర్ణాల వారికే పదవుల్లో ప్రాధాన్యం లభించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పౌరసరఫరాల శాఖ చైర్మన్ పదవి జిల్లాకు చెందిన సీనియర్ జనసేన నేత తోట సుధీర్ కు లభించింది. అదేవిధంగా కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ పదవి తుమ్మల రామస్వామికి కేటాయించారు. అయితే తాజాగా మరోమారు ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు - డీసీసీబీ చైర్మన్ గానూ రామస్వామికే కేటాయించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సుధీర్ తోపాటు రామస్వామి ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. పైగా ఇప్పటికే ఒక పదవి ఉన్న వారికి మరో పదవి కేటాయించడంపైనా జనసేన నేతల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

డీసీసీబీ చైర్మన్ గా నియమితులైన రామస్వామి కుడా పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతున్నా, కుడా చైర్మన్ పదవి తమకు దక్కుతుందని గ్యారెంటీ లేదంటూ బీసీ నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటివరకు జనసేన కోటాలో నియమించిన నామినేటెడ్ పదవులలో రెండు కాపులకు ఒకటి కమ్మ సామాజిక వర్గానికి కేటాయించినట్లు చెబుతున్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్న రాజమండ్రి, అమలాపురం, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను ఒక్కో సామాజికవర్గానికి కేటాయించాలని కూటమి నేతలు అవగాహన ఏర్పరుచుకుని ఆ మేరకు పదవుల పంపకం పూర్తి చేశారు. రాజమండ్రి పట్టణాభివృద్ధి సంస్థను కమ్మ సామాజికవర్గానికి అమలాపురం పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కాపులకు ఇచ్చారు. దీంతో జిల్లాస్థాయిలో తమకు ఎలాంటి పదవి దక్కలేదని బీసీల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థకు కొత్తవారిని నియమించే అవకాశం రావడంతో తమకు కేటాయించాలని బీసీ నేతల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అయితే జిల్లా పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే స్థానిక నేతలు వారి గోడును వింటారా? అన్నదే ఉత్కంఠ రేపుతోంది. డిప్యూటీ సీఎం బాధ్యతల్లో బిజీగా ఉంటున్న జనసేనాని పవన్ జిల్లా రాజకీయాలపైనా ఫోకస్ పెట్టాలని కొందరు బీసీ నేతలు సూచిస్తున్నారు. జనాభాలో సగం ఉన్న తమను నిర్లక్ష్యం చేయడం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని గుర్తించాలని సూచిస్తున్నారు. మరి జనసేనాని పవన్ బీసీల గోడు వింటారా? వారి కోరిక మేరకు కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గిరీని అయినా వారికి కట్టబెడతారా? లేదా? అన్నదే సస్పెన్స్ గా మారింది.

Tags:    

Similar News