12 వేల కోట్లు దేశానికి ఆదా అన్న వెంకయ్య

ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలు మంచివా మేలైనవేనా లేక ఇబ్బందా అన్న దాని మీద వేడి వేడిగా దేశంలో చర్చ సాగుతోంది.;

Update: 2025-04-12 17:24 GMT

ఈ దేశంలో జమిలి ఎన్నికలు అని కాన్సెప్ట్ వచ్చింది. అయితే ఇది కొత్తదా పాతదా అంటే పాతదే అని చెప్పాలి. 1952లో తొలిసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. ఆనాడు కేంద్రంతో పాటు రాష్ట్రాలకూ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అలా ఒకేసారి అయిదేళ్ళ కాలపరిమితితో ఎన్నికలు జరగడం ఆనాడు జరిగింది.

తిరిగి 1957, 1962, 1967లలో కూడా జమిలి ఎన్నికలే జరిగాయి. అయితే 1964లో తొలి ప్రధాని పండిట్ నెహ్రూ కన్నుమూయడంతో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చాయి. ఆయన కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధీ 1966లో దేశానికి తొలిసారిగా ప్రధాని అయ్యారు.

ఇక కాంగ్రెస్ పెద్దల మధ్య లుకలుకలు సిండికేట్లు ఏర్పాటు కావడం ఇందిరా గాంధీ యంగ్ వింగ్ వేరుగా ఉండడం ఇలా చాలా జరిగాయి. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో రాష్ట్రాలలో కాంగ్రెస్ కొంత మేర బలహీనపడినట్లు అయింది. అదే సమయంలో జనసంఘ్, వామపక్షాలు బాగా పుంజుకున్నాయి.

అలా కొన్ని రాష్ట్రాలలో ఈ కొత్త కాంబినేషన్ తో సంయుక్త ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి. ఇలా జమిలి నుంచి అసెంబ్లీలు కొన్ని 1960 దశకం చివరి నాటికి వేరుపడ్డాయి. అయితే ఆయా ప్రభుత్వాలు అయిదేళ్ళూ మనుగడ సాగించలేకపోవడంలో జమిలి గొలుసుకట్టు తెగింది. అది కాస్తా 1970 దశకం వచ్చేసరికి మరింతగా వేరు పడింది.

ఇక దేశంలో లోక్ సభకు కూడా అనేక దఫాలు మధ్యంతర ఎన్నికలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జమిలి ఎన్నికల ప్రస్తావన చేస్తోంది. నిజానికి ఇది పాతదే అయినా బీజేపీ ఎత్తుకోవడంతో దాని మీద అనుమానం నీడలు పడుతున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న కాన్సెప్ట్ తో బీజేపీ జమిలి అంటోంది.

ఆ విధంగా చేయడం వల్ల రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే కుట్ర ఉందని అన్ని పార్టీలూ అనుమానిస్తున్నాయి. అలాగే బీజేపీ తనదైన జాతీయ అంశాలను తెర మీదకు తెచ్చి గెలిచేందుకు జమిలి ఎన్నికలు ఒక సాధనంగా మారుతున్నాయని కూడా భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలు మంచివా మేలైనవేనా లేక ఇబ్బందా అన్న దాని మీద వేడి వేడిగా దేశంలో చర్చ సాగుతోంది. ఇక చూస్తే కనుక రాజకీయ మేధావిగా గుర్తింపు పొంది దేశానికి ఉప రాష్ట్రపతిగా సేవలు అందించిన ఎం వెంకయ్యనాయుడు జమిలి ఎన్నికల మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు జరిగితే సమయం,ధనం ఆదా అవుతారని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని ఈరోజు జరిగిన ఒకే దేశం ఒకే ఎన్నిక సదస్సులో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ జమిలి ఎన్నికల గురించి తనదైన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒకే ఎన్నిక విధానాన్ని సిఫారసు చేస్తోందని అన్నారు. ఒకేసారి దేశంలో ఎన్నికలు జరిగితే ఏకంగా 12వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని ఆయన పేర్కొన్నారు. జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది లేదని కూడా ఆయన చెప్పారు.

ఇవన్నీ అపోహలు మాత్రమే అని అన్నారు. జమిలి ఎన్నికలను కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం అన్నది పూర్తిగా రాజకీయ కోణంలో నుంచే జరుగుతోంది తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు చేసిన కామెంట్స్ ఇపుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

Tags:    

Similar News