పయ్యావుల బడ్జెట్ లో ఆ రంగాల్లో కీలక కేటాయింపులు
ఏపీలో కూటమి ప్రభుత్వం 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ను శనివారం శాసనసభలో ప్రవేశపెట్టింది.;
ఏపీలో కూటమి ప్రభుత్వం 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ను శనివారం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కొంత వాస్తవికత దృక్పథంతో ఉందని చెప్పాలి. అంతా అనుకున్నట్లుగా మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా అంకెలతో భారీ బడ్జెట్ ని ప్రవేశపెట్టలేదు. అదే సమయంలో బడ్జెట్ గతసారికీ ఈసారికి పెరిగింది. అయితే రూపాయి రాకా రూపాయి పోకను దృష్టిలో ఉంచుకుని మూడు లక్షల 32 వేల కోట్లతో ప్రవేశపెట్టారు.
బడ్జెట్ లో ప్రధాన కేటాయింపులు:
ఇదిలా ఉంటే బడ్జెట్ లో పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగిన శాఖలను చూస్తే ఎన్నో అంశాలు కనిపిస్తాయి. పాఠశాల విద్యకి ఏకంగా 32,308.32 కోట్ల రూపాయలు కేటాయించడం గొప్ప విషయంగా ఉంది. విద్యకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఇది తెలియచేస్తుంది. ఏ రాష్ట్రంలో అయినా విద్యకు ఇచ్చే ప్రాధాన్యత మానవ వనరుల పెట్టుబడులకే అన్న సంగతిని నిపుణులు చెబుతారు. ఆ విధంగా కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది అని భావించాల్సి ఉంది.
బీసీల కోసం :
ఇక ఏపీలో బీసీ సంక్షేమానికి కూడా కూటమి ప్రభుత్వం ఎక్కువ కేటాయింపులే చేసింది. బీసీ వెల్ఫేర్ కి 23,650.88 కోట్ల రూపాయలను కేటాయించింది. దాంతో బీసీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ పధకాలు కార్యక్రమాల ద్వారా భారీ ఎత్తున మేలు జరగనుంది. వారి కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది అన్నది తెలిసిందే.
పంచాయతీ రాజ్ అంటే :
గడచిన రెండు బడ్జెట్లను చూస్తే కూటమి ప్రభుత్వం పంచాయతీ రాజ్ అలాగే గ్రామీణాభివృద్ధికి ఫుల్ ఫోకస్ పెట్టి పనిచేస్తోంది. దాంతో గతసారి కంటే కూడా ఈసారి మరింత ఎక్కువగా పంచాయతీ రాజ్ కి అలాగే రూరల్ డెవలప్మెంట్ కి కేటాయింపులు చేశారు. అలా చూస్తే 22,941.54 కోట్ల రూపాయలు వీటికి కేటాయించడం గ్రామీణ ఆంధ్రాకు ఎంతో శుభ సూచకం అని అంటున్నారు. పల్లెలతోనే ప్రగతి అన్న సూత్రం కూడా నిపుణులు చెప్పే మాట. కూటమి ఆ దిశగా అడుగులు వేస్తోంది అని భావించాల్సి ఉంది.
వైద్యారోగ్యం కోసం భారీగానే :
ఇక ఏపీలో వైద్యారోగ్యం కోసం 19,36.04 కోట్ల రూపాయలు, నీటివనరులకు 8,223.67 కోట్ల రూపాయలు, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ కోసం 14,538.68 కోట్ల రూపాయలు, విద్యుత్ రంగానికి 13,934.25 కోట్ల రూపాయలు, వ్యవసాయ రంగానికి 11,745.21 కోట్ల రూపాయలు, సాంఘీక సంక్షేమం కోసం 11,118.84 కోట్ల రూపాయలు, ఈడబ్ల్యుఎస్ సంక్షేమం కోసం 10,699.33 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి. మొత్తం మీద కీలక రంగాలకు ఊతమిచ్చేలా ఆర్ధిక కేటాయింపులు భారీ స్థాయిలో జరగడం ముదావహమని అంతా అంటున్నారు.