పాయిజన్ రుచి.. ఐదుగురు స్నేహితుల వింత ప్రయోగం..చివరికి?
బీహార్‌లో జరిగిన ఈ విషాద ఘటన వింటుంటేనే గుండె తరుక్కుపోతోంది.;
బీహార్‌లో జరిగిన ఈ విషాద ఘటన వింటుంటేనే గుండె తరుక్కుపోతోంది. సమాజం ఎటు పోతుంది, కేవలం విషం రుచి ఎలా ఉంటుందో చూడాలనే వింత ఆలోచన లేదా చిన్నపాటి మందలింపులకే ప్రాణాలు తీసుకోవడం అనేది నేటి తరం పిల్లల సున్నిత మనస్తత్వానికి నిదర్శనం. ఆడుకోవాల్సిన వయసులో, నలుగురు స్నేహితులు ప్రాణాలు కోల్పోవడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏవైనప్పటికీ, ఇది సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనను గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన గుర్తుచేస్తోంది. వివరాలలోకి వెళితే..
వింత ప్రయోగం.. విషాదంగా మారిన క్షణం:
బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఐదుగురు స్నేహితులు కలిసి చేసిన పని ఊహించని విషాదాన్ని మిగిల్చింది. సరదాగా పొలానికి వెళ్లిన ఈ బాలికలు, పక్షులను చంపే విషాన్ని నీళ్లలో కలుపుకుని తాగారు. విషం రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలమో లేక మరేదైనా బలమైన కారణమో కానీ, ఆ ద్రవం వారి ప్రాణాలను హరించింది. నలుగురు బాలికలు అక్కడికక్కడే విగతజీవులుగా పడిపోగా, ఒక బాలిక మాత్రం ఆ నీటిని తాగిన వెంటనే ఉమ్మేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆ ఒక్క క్షణం తీసుకున్న నిర్ణయం ఆమెను బతికించింది కానీ, తన కళ్ల ముందే ప్రాణస్నేహితులను కోల్పోవడం ఆమెను షాక్ కి గురిచేసింది. అప్పటి వరకు కలిసి వున్న ఫ్రెండ్స్ ఒక చిన్న తప్పుతో ప్రాణాలు కోల్పోవటం నిజంగా దురదృష్టం.
చిన్న వయసు.. సున్నిత మనస్తత్వం:
ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు మరో కోణాన్ని కూడా వెలికితీస్తున్నారు. మృతుల తల్లిదండ్రులు వారిని చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారు అని మందలించినట్లు తెలుస్తోంది. నేటి తరం పిల్లలు శారీరకంగా త్వరగా ఎదుగుతున్నా, మానసికంగా మాత్రం చాలా సున్నితంగా తయారవుతున్నారు. చిన్నపాటి అవమానాన్ని లేదా కోపాన్ని తట్టుకోలేక విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. విషం రుచి చూస్తాం అని వారు చెప్పుకున్నా, లోలోపల ఉన్న మనస్తాపం వారిని ఈ ఘాతుకానికి పురికొల్పి ఉండవచ్చు. సోషల్ మీడియా ప్రభావం లేదా అవగాహన లోపం వల్ల ప్రాణాల విలువ తెలియక ఇలాంటి ప్రయోగాలు చేయడం ఆందోళన కలిగించే విషయం.
పిల్లలతో సమయం గడపండి:
ఇక పిల్లల మనసు ఒక తెల్ల కాగితం లాంటిది. వారు చేసే చిన్న చిన్న తప్పులను సరిదిద్దే క్రమంలో తల్లిదండ్రులు అనుసరించే పద్ధతులు వారిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మందలించడం కంటే, స్నేహపూర్వకంగా దగ్గరకు తీసుకుని విషయాలను వివరించడం ప్రస్తుత కాలంలో చాలా అవసరం. ఈ ఐదుగురు బాలికల ఉదంతం మనందరికీ ఒక గుణపాఠం కావాలి. పిల్లల్లో మానసిక ధైర్యాన్ని నింపడం, ప్రాణం విలువను వివరించడం ప్రతి ఒక్కరి బాధ్యత. మరోసారి ఏ తల్లిదండ్రులకూ ఇలా బాధ పడకూడదని ఆశిద్దాం.