త్రిష పేరు తెరపైకి.. విజయ్ 'పర్సనల్' లైఫ్‌పై బీజేపీ గురి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.;

Update: 2026-02-14 18:57 GMT

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా తమిళిగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ లక్ష్యంగా ప్రత్యర్థులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ విజయ్ వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి.

త్రిష పేరుతో ఘాటు విమర్శలు

శనివారం సేలంలో జరిగిన టీవీకే రాజకీయ సభ అనంతరం మీడియాతో మాట్లాడిన నైనార్ నాగేంద్రన్ ఏకంగా విజయ్‌పై విరుచుకుపడ్డారు. "విజయ్‌కి రాజకీయాల్లో సున్నా అనుభవం. ఆయన తన ఇల్లు దాటి బయటకు రావాలి. ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటపడితేనే ఆయనకు క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుస్తాయి" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్ తన కుటుంబ సంబంధాలను సరిచేసుకోలేకపోతున్నారని, అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా "ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు ఉంది విజయ్ తీరు" అంటూ ఎద్దేవా చేశారు.

మండిపడుతున్న అభిమానులు, మహిళా నేతలు

నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై విజయ్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రాజకీయాలతో సంబంధం లేని నటి త్రిష పేరును వివాదంలోకి లాగడం అనాగరికమని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. బీజేపీ నేత వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ కనిమొళి సోము తీవ్రంగా ఖండించారు. "మహిళలను గౌరవించలేని వారు రాజకీయ నేతలుగా అనర్హులు" అని ఆమె పేర్కొన్నారు. "విజయ్ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే బీజేపీ ఇలాంటి నీచమైన విమర్శలు చేస్తోంది" అని టీవీకే నాయకులు మండిపడుతున్నారు.

ఎన్నికల వేళ హీట్

మరో రెండు నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే విజయ్ తన పార్టీ గుర్తు 'విజిల్' తో ప్రచారంలో దూసుకుపోతున్నారు. సర్వేల ప్రకారం విజయ్ పార్టీ గణనీయమైన ఓట్లు చీల్చే అవకాశం ఉందని తేలడంతో అధికార డీఎంకే , ప్రతిపక్ష బీజేపీ విజయ్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

గతంలో కూడా విజయ్ - త్రిషల గురించి సోషల్ మీడియాలో పుకార్లు వచ్చినప్పటికీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడు బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం విజయ్‌కి సానుభూతిగా మారుతుందా లేక ఆయన ఇమేజ్‌ను దెబ్బతీస్తుందా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News