రెండేళ్ల గడువు.. ఎమ్మెల్యేలకు బిగ్ టెస్ట్.. !
రాష్ట్రంలో కూటమి సర్కారులోని మూడు పార్టీల ఎమ్మెల్యేలు 164 మంది ఉన్నారు. వీరిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థానాలను పక్కన పెడితే.. మిగిలిన 162 మంది ఎమ్మెల్యేలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉంది.;
రాష్ట్రంలో కూటమి సర్కారులోని మూడు పార్టీల ఎమ్మెల్యేలు 164 మంది ఉన్నారు. వీరిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థానాలను పక్కన పెడితే.. మిగిలిన 162 మంది ఎమ్మెల్యేలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. అదేంటనే ఆశ్చర్యం కలుగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి అప్పుడే రెండేళ్లు గడ చిపోతున్నాయి. మరోసారి ఎన్నికలు జరిగేందుకు మూడేళ్ల వరకు గడువు ఉంది కదా.. అనే సందేహం కూడా వస్తుంది.
కానీ.. చివరి ఏడాది ఏ ప్రభుత్వానికైనా ఎన్నికల సంవత్సరంగా మారుతుంది. మహా అయితే.. ఏడెనిమిది మాసాలే గడువు ఉంటుంది. ఇక, ఎమ్మెల్యేలకు కూడా అంతే సమయం ఉంటుంది. సో.. ప్రజలకు ఏమైనా మంచి పనులు చేయాలన్నా.. ప్రజల అభిమానం చూరగొనాలని భావించినా.. ఈ రెండు సంవత్సరాలే ఎమ్మెల్యేలకు కీలకం. ఈ రెండేళ్లలో రాజకీయాలకు దూరంగా.. అభివృద్ధికి దగ్గరగా వ్యవహరించే నేతలకు మాత్రమే ప్రజలు పట్టం కడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
అలా కాకుండా.. ఎన్నికలకు ముందు చూసుకుందాంలే.. అప్పటి వరకు రాజకీయాలు చేసుకుందాంలే.. అనే చర్చ కనుక పెట్టుకుంటే.. నాయకులు నష్టపోవడం.. ఖాయమన్నది అనేక ఎన్నికల్లో స్పష్టమైంది. ఇక, ఇప్పటి వరకు 130 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగుందంటూ.. ఇటీవల ప్రభుత్వమే ఓ నివేదికను ఇచ్చింది. దీనిని బట్టి.. సదరు ఎమ్మెల్యేలు పొంగి పోవచ్చు. పండగ కూడా చేసుకోవచ్చు. కానీ, వాస్తవంలో ప్రజలు ఓటు వేస్తేనే ఎవరైనా ఎమ్మెల్యేలుగా గెలిచేందుకు ఛాన్స్ ఉంటుంది.
ప్రస్తుతం వచ్చిన నివేదిక.. మచ్చుకు కొందరి అభిప్రాయాన్ని తీసుకుని.. ఇచ్చిందే తప్ప.. నియోజకవర్గం లోని 2 లక్షల మంది ఓటర్ల అభిప్రాయాలకు ఇది గొడుగు పట్టడం లేదు. సో.. ఎమ్మెల్యేల వాస్తవ పనితీరు ఏదైనా తెలుసుకోవాలంటే.. వారు ఇంటి నుంచి బయటకు రావాల్సిందే. ప్రజల మధ్య ఉండాల్సిందే. ఎక్కడ ఏ చిన్న అవసరం వచ్చినా.. ప్రజలను కలుసుకోవాల్సిందే. వారికి భరోసా కల్పించాల్సిందే. ఈ దిశగా ఈ రెండేళ్లపాటు కష్టపడే వారికే ప్రజలు మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. అలాకాదంటే.. ప్రజల తీర్పు ఏవిధంగా అయినా ఉంటుందనడంలోగత ఎన్నికలే ప్రధాన నిదర్శనం.